Telangana Assembly | హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో బుధవారం జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలుసార్లు ఢీ అంటే ఢీ అంటూ మాటల బాణాలు విసురుకున్నారు. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అంటే ఘాటుగా స్పందించారు కేటీఆర్. వారి సంభాషణలోని ముఖ్యాంశాలు
సీఎం: మా ప్రభుత్వం స్పోర్ట్స్, అగ్రికల్చర్, ఆర్టిఫిషిల్ ఇంటెలిజెన్స్, ఎనర్జీ పాలసీలను తీసుకొస్తుంది.
కేటీఆర్: ప్రభుత్వం అనేక పాలసీలు తీసుకొస్తం అంటుంది. కానీ ఇప్పటివరకు కేసీఆర్‌పై జెలసీ తప్ప ఏ పాలసీ లేదు.
సీఎం: ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతిస్తామంటున్న బీఆర్ఎస్.. నేడు నిర్వహించే స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమానికి రావాలి.
కేటీఆర్: కచ్చితంగా ప్రభుత్వం నిర్వహించే మంచి కార్యక్రమాలకు 100% మద్దతు ఇస్తాం. సీఎం మమ్మల్ని రావాలని అడిగారు. ప్రొటోకాల్ పాటిస్తే కచ్చితంగా వస్తాం. ఓడినవాళ్లను వేదికపై కూర్చోబెట్టి.. గెలిచిన వాళ్లను కింద కూర్చోబెడతామంటే కుదరదు. సబితమ్మను కూడా పిలిచి.. గౌరవం ఇవ్వండి.
సీఎం: నేను గుంటూరుకెళ్లి చదువుకోలేదు, గవర్నమెంట్ స్కూళ్లో చదువుకున్నాను. ముల్కీ రూల్స్, 610, ఏ రూల్ ఐప్లె చేసినా తెలంగాణలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగానికి నాకు అర్హత ఉన్నది. గుంటూరులో చదువుకున్నవారికి అర్హత ఉన్నదో లేదో స్పీకర్ చెప్పాలి.
కేటీఆర్: నేను గుంటూరులో ఇంటర్ చదివిన. విజ్ఞాన్, రత్తయ్య కాలేజీలో చదివిన. ఇందులో నేనేమీ దాచడం లేదు. నేను గవర్నమెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేయలేదు. ప్రైవేటు రంగంలో ఉద్యోగం సంపాదించుకున్న, చేసిన. ప్రైవేటు రంగంలో 610 జీవో వర్తించదు. సీఎం రేవంత్‌రెడ్డి ఇది తెలుసుకుంటే బాగుంటుంది.
సీఎం: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై చర్చ సందర్భంగా ఓ వ్యక్తి కేటీఆర్ గురించి ఒక విషయం చెప్పారు. ఏ అంటే 100% ఆర్టిఫిషియల్, ఐ అంటే జీరో పర్సంట్ ఇంటెలిజెన్స్.
కేటీఆర్: మా నాన్నగారు నన్ను చదివించారు. రెండు మాస్టర్ డిగ్రీలు చేసిన. పూణెలో బయోటెక్నాలజీలో మాస్టర్స్, ఆ తర్వాత న్యూయార్క్‌లో ఎంబీఏ చేసిన. అంతో ఇంతో చదువుకున్న. ఉద్యోగం చేసిన. నేను చదువుకున్నా కాబట్టి సర్టిఫికెట్లు చూపెట్టగలను. ఉద్యోగం సంపాదించినా, అదే ఉద్యోగంపై ఇండియాకు వచ్చిన. కానీ వారు (సీఎంను ఉద్దేశించి) ఎక్కడ చదువుకున్నారో తెలియదు, ఏం చదువుకున్నారో తెలియదు. నాకు ఇంటెలిజెన్స్ ఉన్నదా అంటే.. నేను పోటీ పరీక్షలు రాసిన. జీవితంలో ఇంటర్వ్యూలు అటెండయ్యా. కానీ సీఎం గతమేందో నాకు తెలియదు. బయట రకరకాలుగా చెప్తుంటారు. ఎవరి ఇంటెలిజెన్స్ ఏమిటో ప్రజలు తేలుస్తారు.