KTR | హైదరాబాద్/రాజన్న సిరిసిల్ల, జనవరి 4 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే తెలంగాణ సస్యశ్యామలమైందని, ఇది కేసీఆర్ పుణ్యమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పునరుద్ఘాటించారు. ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసేందుకు రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ నేతలంతా కుట్రలు చేశారని, మేడిగడ్డ బరాజ్‌కు పర్రెలు పడ్డాయంటున్న కాంగ్రెస్ నేతల మెదళ్లకే పర్రెలు పడ్డాయని ఎద్దేవాచేశారు. భూకంపం వచ్చినా ప్రాజెక్టు చెక్కు చెదరలేదని, 28 లక్షల క్యూసెక్కుల వరద వస్తే కూడా మేడిగడ్డ వద్ద ఎలాంటి ప్రమాదం జరగలేదని స్పష్టంచేశారు. శనివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించిన కేటీఆర్, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయా చోట్ల మాట్లాడుతూ రేవంత్ సర్కార్ తీరుపై నిప్పులుచెరిగారు. ఎక్స్ వేదికగానూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. గతంలోనూ కాంగ్రెస్ నేతలే ప్రాజెక్టుపై కుట్రలు చేసి కేసీఆర్‌కు చెడ్డపేరు తేవాలని చూశారని మండిపడ్డారు. ఏడాది గడుస్తున్నా ఎందుకు మరమ్మతులు చేయలేదని నిలదీశారు. మూడు నాలుగు నెలల్లో రిపేర్లు చేసి కోదాడ వరకు బ్రహ్మాండంగా సాగు నీరందించే అవకాశమున్నా ఆ పని చేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మేడిగడ్డను రిపేరు చేస్తే యాసంగిలో నీళ్లివ్వాల్సి వస్తుందని, రైతులకు రైతుభరోసా ఇవ్వాల్సి వస్తుందన్న భయం కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టుకున్నదని దుయ్యబట్టారు. గత యాసంగిలో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందినా నీళ్లు విడువలేని అసమర్థులు కాంగ్రెస్ పాలకులని విమర్శించారు. నడవలేని పరిస్థితిలోనూ కేసీఆర్ రైతుల కోసం బస్సు యాత్ర చేపట్టారని, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, సిరిసిల్లలో పర్యటించారని గుర్తుచేశారు. కృష్ణా నదిపై పెత్తనాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి అప్పగించినప్పుడు నల్లగొండలో భారీ బహిరంగ సభపెట్టి గర్జిస్తే రేవంత్‌రెడ్డి దిగొచ్చి లెంపలేసుకున్నారని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదని ప్రచారం చేసినా, తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరమేనని.. రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ నేతలంతా ఇప్పటికైనా చెంపలేసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై లక్ష అబద్ధాలు చెప్పినా, అధికారం కోసం నిందించినా ఆఖరికి కాళేశ్వరమే ఆదెరువు అయిందని స్పష్టంచేశారు.
పిచ్చోడి చేతిలో రాయిలా పాలన
‘ముఖం బాగాలేక అద్దం పగులగొట్టుకున్న చందంగా కాంగ్రెస్ నిర్వాకం ఉన్నది. కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎం అయ్యింది. పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు. రూ.2 లక్షల రుణమాఫీ అయ్యిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. ఎకరానికి రూ.7,500 చొప్పున రైతుభరోసా ఇస్తామని చెప్పిన సీఎం 75 పైసలు కూడా ఇవ్వలేని ఘనుడని ఎద్దేవాచేశారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలన్న రేవంత్‌రెడ్డి, ఎన్నికల ముందు వరంగల్‌లో రైతు డిక్లరేషన్ అని చెప్పి ఇవ్వాళ రైతును డిక్లరేషన్ ఇవ్వాలంటున్నారని, ఇదెక్కడి నీతి అని దుయ్యబట్టారు. గ్రామాల్లో రైతులు సాగు చేసే వివరాలు అధికారులకు, సర్పంచులకు తెలియదా? అని ప్రశ్నించారు. భూమి ఉన్న ఉద్యోగులకు రైతుభరోసా కట్ చేస్తానంటున్న చీఫ్ మినిస్టర్ కటింగ్ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
కేంద్రాన్ని శాసించే రోజులు వస్తయ్
పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఏడాది గడిచినా తెలంగాణకు తెచ్చింది గుండుసున్నా అని కేటీఆర్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు, నితీశ్‌కుమార్ కేంద్రంలో చక్రం తిప్పినట్టు ఏదో ఒక రోజు కేసీఆర్‌కు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే రోజులు వస్తాయని ధీమా వ్యక్త చేశారు. ఏడాదిలో ఎంత దెబ్బతిన్నా కాంగ్రెసోళ్లకు నిద్రలేని రాత్రులు చూపించింది బీఆర్ఎస్ సైనికులేనని స్పష్టంచేశారు. కాంగ్రెస్ నేతలు ఒక్క రోజు కూడా కేసీఆర్ జపం లేకుండా ఉంటలేరని, బీఆర్ఎస్ కార్యకర్తల పని తీరుకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి లెక్కలు చెప్పే వారు కూడా సరిగా చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. 2014లో తెలంగాణ ఏర్పడే నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.369 కోట్ల రెవెన్యూ మిగులుతో బీఆర్ఎస్ ప్రభుత్వానికి అప్పగించిందని, బీఆర్ఎస్ దిగిపోయేనాటికి కాంగ్రెస్ ప్రభుత్వానికి రూ.5,944 కోట్ల రెవెన్యూ మిగులుతోని అప్పగించామని వివరించారు. మంత్రి భట్టి విక్రమార్క రూ.1000 కోట్ల రెవెన్యూ మిగులు ఉన్నదని 2024 బడ్జెట్లో చెప్పారని, మిగులు ఉందని చెప్తుంటే నెలకు రూ.4 వేల కోట్ల లోటు ఉన్నది ఏం చేయాలో తోయడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన డం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇలా సీఎం, మంత్రి వేర్వేరు లెక్కలు చెప్పవచ్చునా? అని ప్రశ్నించారు.
మోసమే కాంగ్రెస్ విధానం
కాంగ్రెస్ పార్టీ తెలంగాణతోపాటు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వాలను నడపడటం లేదని, ఆయా రాష్ర్టాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగవేస్తూ సర్కస్ చేస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. కర్ణాటకలో ఆర్టీసీ బస్సు టికెట్లపై 15 శాతం ధరను పెంచి ప్రయాణికులను బస్సు కింద పడేయాలని నిర్ణయించిందని దుయ్యబట్టారు. హిమాచల్ ప్రదేశ్‌లో టాయిలెట్ ట్యాక్స్ విధించి ఆ రాష్ట్ర ప్రజలను కడిగిపారేస్తున్నదని, మోసం చేయటమే కాంగ్రెస్ విధానంగా పెట్టుకున్నదని మరోసారి తేలిపోయిందని ధ్వజమెత్తారు. అప్పులపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూనే వాస్తవాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో కార్యకర్తలతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేవారంతా ప్రేక్షకపాత్ర వహించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలు, అన్యాయాలపై ప్రజల తరఫున పోరాడాలని సూచించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు.
కేసులకు భయపడేది లేదు
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. కేసులు ఎన్ని పెట్టినా బెదిరేది లేదని, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కేసులను చూసేందుకు ప్రత్యేకంగా లీగల్ సెల్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. భూముల కబ్జా అని పత్రికల్లో వస్తున్న వార్తా కథనాలను నమ్మవద్దని, రాసిన వార్తలు, కేసులు పెట్టిన అధికారులపైనా హైకోర్టులో దావా వేస్తామని, అవసరమైతే సుప్రీం కోర్టుకైనా వెళ్తామని స్పష్టంచేశారు. సమావేశంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, కోరుకంటి చందర్, పుట్ట మధు, నాఫ్స్కాబ్ మాజీ చైర్మన్ కొండూరు రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, జడ్పీ మాజీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చలిమెడ లక్ష్మీనర్సింహారావు పాల్గొన్నారు. అంతకుమందు పద్మనగర్‌లో బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి మ్యాన రవి నివాసానికి వెళ్లి ఆయన కూతురు వివాహం ఇటీవల జరగగా, దంపతులను ఆశీర్వదించారు. పాత్రికేయులు మల్లికార్జున్, ప్రసాద్‌రెడ్డి కుటుంబాలను పరామర్శించారు.
ఒక్క అక్షరానికి వెయ్యి కోట్లా?
‘వెయ్యి కోట్లు కాదు లక్ష కోట్లు ఖర్చుపెట్టినా తెలంగాణ అస్తిత్వాన్ని చెరపలేవు. నాలుగు కోట్ల గుండెలపై కేసీఆర్ చేసిన సంతకాన్ని మార్చలేవు’ అని రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ కేటీఆర్ చురకలంటించారు. ‘రైతు భరోసా ఇచ్చింది లేదు.. రుణమాఫీ సకగ చేసింది లేదు.. పెన్షన్ పెంచింది లేదు.. ఆరు గ్యారెంటీల అమలుకు దికులేదు. కానీ, ఆగమేఘాలమీద అనవసరమైన వాటి కోసం వేల కోట్ల ఖర్చు పెట్టేందుకు మనసొచ్చిందా?’ అని మండిపడ్డారు. అక్షరం మార్పు (టీఎస్ నుంచి టీజీగా) కోసం అక్షరాలా వెయ్యి కోట్ల ఖర్చా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క అక్షరానికి అయ్యే వెయ్యి కోట్లతో రాష్ట్రంలో అనేక అద్భుతాలు సృష్టించి ప్రజల కష్టాలను తీర్చే అవకాశం ఉన్నా రేవంత్‌రెడ్డి అహానికి పోయి ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారని రాహుల్‌గాంధీకి ఎక్స్ ద్వారా నివేదించారు. వెయ్యి కోట్లతో 50 వేల మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ జరిగేదని, 40 లక్షల మంది మహిళలకు రూ.2,500 చొప్పున, 25 లక్షల మంది వృద్ధులకు రూ.4000 చొప్పున పింఛన్ ఇచ్చే అవకాశం ఉండేదని, తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు అందించే అవకాశం ఉండేదని ఉదహరించారు. కేవలం పంతానికి పోయిన రేవంత్‌రెడ్డి ఒక్క అక్షరానికి వెయ్యి కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని.. లక్ష కోట్ల నష్టం వాటిల్లిందని రేవంత్‌రెడ్డి సహా మొత్తం కాంగ్రెస్ నేతలు అధికారం కోసం అబద్ధపు ప్రచారాలు చేసినా ఇవ్వాళ ప్రజల దాహం తీర్చే ఏకైక అస్త్రం కాళేశ్వరమే.. ఎంత విషం చిమ్మినా తెలంగాణ దాహం తీరుస్తున్నది మన కాళేశ్వరమే. మల్లన్నసాగర్ వద్దని మీరు నిరాహార దీక్షలు చేసినా నేడు మహానగర దాహం తీరుస్తున్న వరప్రదాయిని మల్లన్నసాగర్ కాళేశ్వరంలోభాగమే. -కేటీఆర్
భూములు కబ్జా అయ్యాయని పత్రికల్లో వస్తున్న వార్తా కథనాలను నమ్మవద్దు.. భూకంపం లేదు.. లంబకోణం లేదు.. రాసిన వార్తలపై, కేసులు పెట్టిన అధికారులపైనా హైకోర్టులో దావా వేస్తం. అవసరమైతే సుప్రీం కోర్టుకైనా వెళ్తాం. –కేటీఆర్
నాట్లు వేసినప్పుడు కేసీఆర్ రైతుబంధు ఇస్తే.. రేవంత్‌రెడ్డి మాత్రం ఓట్లు వేసే ముందు ఇస్తడు. బీఆర్ఎస్ ప్రభుత్వం దాచిపెట్టిన రైతుబంధు పైసలనే రేవంత్‌రెడ్డి ఏడిపించి ఏడిపించి రైతులకు ఇచ్చిండు. ఈ ఏడాదిలో ఒక్కపైసా కూడా రైతులకు ఇవ్వని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మోసాలపై ప్రజలు విసిగిపోతున్నరు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తమని చెప్పి ఫ్రీ బస్సు తప్ప ఏంజేసిండ్రో చెప్పాలె.
-కేటీఆర్