హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): శాసనసభలో బుధవారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య పలుమార్లు సంవాదం జరిగింది. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ ఎటాకింగ్ కౌంటర్లు ఇచ్చారు.
సీఎం రేవంత్: 15 ఏండ్ల ఉద్యమకారుడు, పదేండ్లపాటు సీఎం అయిన కేసీఆర్ సభకు రాకుండా వీళ్లను పంపించి మాట్లాడిస్తున్నారు.
కేటీఆర్: ఈ విధంగా అయినా కేసీఆర్ గురించి మాట్లాడినందుకు ధన్యవాదాలు. ఆయన (సీఎం రేవంత్) స్థాయికి మేం చాలు. కేసీఆర్ అవసరం లేదు. ఆయనకు సమాధానం చెప్పే సత్తా మాకుంది.
సీఎం రేవంత్: కేటీఆర్ మేనేజ్మెంట్ కోటానే అనుకున్నా. అంతకన్నా దారుణంగా ఉన్నారు.
కేటీఆర్: ఆయన (సీఎం) పేమెంట్ కోటాలో సీఎం సీటు కొట్టేశారని మేమూ అనొచ్చు.
సీఎం రేవంత్: అయ్యపేరు, తాతపేరు చెప్పుకొని రాలేదు. కిందిస్థాయి నుంచి ఎదిగి సీఎం అయ్యాను.
కేటీఆర్: తాత, తండ్రుల పేరు చెప్పుకొని పదవుల్లోకి వచ్చారని ఎవరిని అంటున్నారు? రాహుల్గాంధీనా, రాజీవ్గాంధీనా..?
సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపక్ష సభ్యుల్ని వ్యక్తిగతంగా విమర్శించడాన్ని నిలువరించకుండా పదేపదే ప్రతిపక్ష సభ్యులను వారిస్తున్న స్పీకర్‌పై కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. నీతులు తమకే కాదు, వాళ్లకు (అధికార పక్షానికి) కూడా చెప్పాలని సూచించారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి తనను మేనేజ్మెంట్ కోటాలో మంత్రి అయ్యానని అనొచ్చా, సభా నాయకుడు అలా మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు.