KTR | సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందు ఇచ్చిన హామీలు.. చేసిన వాగ్ధానాలు ఏంటీ.. అసలు అధికారంలోకి వచ్చాక చేస్తున్నది ఏంటీ అంటూ ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఆయన సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘గత వారం పదిరోజులుగా హైదరాబాద్ మహానగరం, రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో సూర్యాపేట, ఆదిలాబాద్, సంగారెడ్డి ఇతర కొన్ని పట్టణాల్లో చాలాచోట్ల ప్రభుత్వం దుందుడుకు వైఖరి వల్ల చాలామంది పేదలు మా పార్టీ నాయకత్వాన్ని కలిసి పెద్దలు కేసీఆర్‌ను తలచుకుంటూ ఒకటేమాట చెబుతున్నారు. ఎన్నో ఆశలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ రకమైన అన్యాయం మళ్లొకసారి కాంగ్రెస్ పార్టీ చేస్తది మేం ఊహించలేదు. ఏ ఇందిరమ్మ చెప్పింది? యే సోనియమ్మ చెప్పింది పేదలకొంపలు కూల్చి పెద్దలకు లాభం చేయమని రేవంత్‌రెడ్డికి ఇవాళ తెలంగాణలోని పేద తల్లులందరూ మా నాయకత్వం వద్దకు వచ్చి మొరపెట్టుకుంటున్నారు’ అన్నారు.
‘రాష్ట్రంలోని పేదల తరఫున హృదయపూర్వకంగా తెలంగాణ హైకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతున్న. ఈ బుల్డోజర్ రాజ్యాన్ని, బుల్డోజర్ నిర్వాకాన్ని, హైడ్రా కమిషనర్‌ను మందలించి మీరు చట్టపరంగాపోవాలి తప్పా.. ఇష్టానుసారంగా వెళ్తే ఊరుకోం.. అవసరమైతే స్టే విధించాల్సి వస్తుందని చెప్పినందుకు రాష్ట్రంలోని పేదలపక్షాన నేను గౌరవ హైకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతున్న. మా లీగల్ సెల్ సైతం పేదలకు అండగా నిలబడింది. లంచ్ మోషన్స్ సైతం మూవ్ చేశారు. వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్న. నిన్నా మొన్న క్షేత్రస్థాయిలో జగదీశ్‌రెడ్డి, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, మహమూద్ అలీ, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, తమ్ముడు కార్తీక్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ చాలామంది మిత్రులు తిరిగి ప్రజల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. వారికి కూడా అభినందలు. మీడియా ముఖంగా ప్రజలకు చెప్పేది.. ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించేది ఒక్కటే. ఈ మూసీ ప్రాజెక్టు ఎవరి కోసం చేస్తున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మీ ప్రాధాన్యాలు ఏంటీ? మీరు ఇచ్చిన వాగ్ధానాలు ఏంటీ ? మీరు ఏం చెప్పారు. వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని.. ఫుల్‌పేజీ యాడ్స్ ఇచ్చారు’ అంటూ గుర్తు చేశారు.
‘వందరోజులు వందరోజులు అని చెప్పి.. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రూ.2వేల పెన్షన్ రూ.4వేలు అవుతుందని.. మహిళలందరికీ రూ.2500 చొప్పున ఇస్తామని, కల్యాణలక్ష్మిలో రూ.లక్షకు అఅదనంగా తులం బంగారం ఇస్తామని, మొదటి రోజే రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని.. రైతుబంధును రూ.15వేలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి 300 రోజులు దాటింది. వందరోజుల్లో చేస్తామని చెప్పిన ఒకమాట చేయకపోగా..300 రోజులు దాటినా ఎప్పుడు చేస్తారో స్పష్టత ఇవ్వకుండా ఇవాళ అక్కరలేని.. అక్కరలేని.. ప్రజలు కోరుకోని.. కాస్మోటిక్ ఎన్హాన్స్మెంట్ కోసం రూ.1.50లక్షలకోట్లు ఖర్చుపెడుతామంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి.. ఎవరైనా మున్సిపల్ శాఖ చూస్తున్నారో ఆయనను సూటిగా అడుగుతున్నా. మీరు ఏం ఆశించి ఏ చేస్తున్నారు ఈ ప్రాజెక్టు చెప్పాలి. ఓ వైపు ఖజానాలో పైసలు లేవు.. లంకెబిందెలు లేవని మీరే చెబుతారు. అప్పులు కట్టేందుకే అప్పులు చేయాల్సి వస్తుందని ఉప ముఖ్యమంత్రి చెబుతున్నడు. ఇంత వరకు కనీసం ఇచ్చిన హామీ సవ్యంగా నెరవేర్చలేదు. రుణమాఫీ అన్నారు.. దేవుళ్లపై ఒట్లు పెట్టారు. పంద్రాగస్టు అన్నారు.. డిసెంబర్ అన్నారు అది పూర్తి చేయలేదు. ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదు. 420 హామీలు ఉన్నాయ్. ఇప్పటి వరకు ఒక్కటి అమలు చేసిన పాపాన పోలేదు. ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వలేదు’ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు.