సీఎం రేవంత్‌రెడ్డి విజన్ లేని నాయకుడు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజాధనం వృథా అవుతున్నది. ఫార్మాసిటీ కోసం భూములిచ్చిన రైతులు మోసపోయారు.
-కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదేపదే చెప్పిన ఊహాజనిత ఫ్యూచర్‌సిటీకి భవిష్యత్తు లేదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. తన కుటుంబసభ్యులు, స్నేహితుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫార్మాసిటీ భూముల్లో రియల్ఎస్టేట్ వ్యాపారం చేయాలనే రేవంత్‌రెడ్డి ఆకాంక్ష నెరవేరబోదని హెచ్చరించారు. ఫార్మాసిటీ భూముల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కేటీఆర్ ఆదివారం ఒక ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి విజన్ లేని నాయకుడని, ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజాధనం వృథా అవుతున్నదని ఆరోపించారు. ఫార్మాసిటీ కోసం భూములిచ్చిన రైతులు మోసపోయారని ఆవేదన వ్యక్తంచేశారు.
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేసి, దాని స్థానంలో ఫ్యూచర్‌సిటీ అనే అవాస్తవ, ఊహాజనిత ప్రాజెక్టును ప్రవేశపెట్టారని కేటీఆర్ దుయ్యబట్టారు. నిర్లక్ష్య నాయకుడు రాష్ట్రాన్ని పాలిస్తే ఏమవుతుందో చెప్పడానికి ఫ్యూచర్‌సిటీ అనే ప్రచారం ఒక ఉదాహరణ అని పేరొన్నారు. భూసేకరణ చట్టం-2013 ప్రకారం.. ఒక నిర్దిష్ట ప్రజాప్రయోజనం కోసం సేకరించిన భూమిని ఇతరుల ప్రయోజనం కోసం రియల్ఎస్టేట్ ప్రాజెక్టులకు మళ్లించడం సాధ్యం కాదని స్పష్టంచేశారు. ఈ చట్టాన్ని ఉటంకిస్తూ, తాను రెండేండ్ల క్రితమే అసెంబ్లీలో ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించానని గుర్తుచేశారు. అయినా, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు పీఆర్ కోసం ఖర్చు చేసి, ఇప్పుడు తీవ్రమైన న్యాయపరమైన అడ్డంకులను ఎదురొంటున్నదని, చివరికి అధికారులు కూడా దీనిని అంగీకరిస్తున్నారని తెలిపారు.
ఫార్మాసిటీ ప్రాజెక్టు కోసం మా ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనంతో మౌలిక వసతుల కల్పన ప్రారంభించినా, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దానిని పకనపెట్టింది. ఇప్పుడు ఫ్యూచర్‌సిటీ పేరుతో భూములను అక్రమంగా రియల్‌ఎస్టేట్‌కు మళ్లించే ప్రయత్నం చేస్తున్నది. ప్రభుత్వ చర్యలు ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయి. దీనివల్ల ప్రజలు, ముఖ్యంగా రైతులు నష్టపోతారు.
-కేటీఆర్
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 56 గ్రామాల పరిధిలో హైదరాబాద్ ఫార్మాసిటీ ఏర్పాటు కోసం 20వేల ఎకరాలతో ప్రతిపాదనలను తయారుచేసినట్టు కేటీఆర్ గుర్తుచేశారు. స్థానిక రైతులు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వచ్చి తమ భూములను ఇచ్చారని తెలిపారు. కొంతమంది తమ భూములు ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తే, కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోకి రాగానే హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం సేకరించిన ప్రతి ఎకరాన్ని తిరిగి రైతన్నలకు ఇస్తామని హామీలు ఇచ్చిందని చెప్పారు. కానీ, ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులు, స్నేహితుల కోసం అవే భూముల్లో రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తూ వారిని నిండా మోసం చేసిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
రైతన్నలు ఫార్మా కంపెనీల కోసం కేటాయించిన భూముల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని పేర్కొన్నారు. ఫార్మాసిటీ ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనంతో మౌలిక వసతుల కల్పనను ప్రారంభించినా, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దానిని పకనపెట్టి, ఇప్పుడు ఫ్యూచర్‌సిటీ పేరుతో భూములను అక్రమంగా రియల్‌ఎస్టేట్‌కు మళ్లించే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వ చర్యలు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని, దీనివల్ల ప్రజలు, ముఖ్యంగా రైతులు నష్టపోతారని హెచ్చరించారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజలకు, రైతులకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని హెచ్చరించారు.
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ‘ప్రధాన ఎన్నికల కమిషనర్ నిర్వహించిన మీడియా సమావేశంలో సమాధానాల కంటే ఎక్కువగా ప్రశ్నలే ఉత్తన్నమవుతున్నాయి. సమస్యల పరిష్కారానికి బదులు సాకులు చెప్పారు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ఎన్నికల సంఘం ఎన్డీఏ ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేస్తున్నదని ధ్వజమెత్తారు. ఎట్టిపరిస్థితుల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణతోపాటు ఎలక్షన్ కమిషన్‌ను ప్రక్షాళన చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాలోని లోపాలను అంగీకరించినప్పుడు, ఎన్నికల సంఘం తన నిర్లక్ష్యాన్ని కూడా ఒప్పుకోవాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు.
ఓటర్ జాబితాను సవరించడమే కాదు.. ఎలక్షన్ కమిషన్ నియామక ప్రక్రియనే సమూలంగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. మన దేశాన్ని ఎప్పటికీ ప్రజాస్వామ్య దేశంగా పిలుచుకోవాలంటే ఎన్నికల వ్యవస్థను మార్చుకోవాల్సిందేనని స్పష్టంచేశారు. ఎన్నికల కమిషన్ స్వయంప్రతిపత్తిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో కేటీఆర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.