హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ప్రజాపోరాటయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కేటీఆర్ పేర్కొన్నారు. 1969లో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమంలో తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఎందరో తెలంగాణ ఉద్యమకారులకు స్ఫూర్తిగా నిలిచిన మహానేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. స్వాతంత్య్ర పోరాటం, మలి దశ తెలంగాణ ఉద్యమం దాకా ప్రజా ఉద్యమాల్లో వారి పాత్ర అనిర్వచనీయమన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ సారథ్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసంలోనే పురుడు పోసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ట్యాంక్ బండ్ వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటు చేసి, హార్టికల్చరల్ యూనివర్సిటీకి వారి పేరు పెట్టి ఘనంగా స్మరించుకున్నదని తెలిపారు.