సీఎం దావోస్ పోయిండు. ఆడికెళ్లి హార్వర్డ్ పోతడు. అక్కడ ఓ 10 రోజులు పడుతుంది. ఆయన వచ్చేదాకా టైంపాస్ చేయడానికి నోటీసుల పేరిట డ్రామాలు ఆడుతున్నారు. రెండు రోజులకు ఒకరికి నోటీసులు ఇచ్చి పిలువండని అధికారులకు ఆదేశాలిచ్చారు. అందుకే ఒకరోజు హరీశ్‌రావును, ఒకరోజు కేటీఆర్‌ను పిలువాలని చెప్పారు. ఇదొక అబ్సల్యూట్ ట్రాష్ కేస్. బక్వాస్ కేస్. అందులో ఏమీ లేదు. ఇది విచారణ చేస్తున్న పోలీసులకూ తెలుసు. కానీ, ఒకటి మాత్రం వాస్తవం. మేము ఏ తప్పూ చేయలేదు.. అందుకే మేము భయపడబోం.
– కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ఏ తప్పూ చేయలేదు.. ఎవరికీ భయపడబోం.. బరాబర్ సిట్ విచారణకు ముమ్మాటికీ హాజరవుతా.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. సిట్ ఒక ట్రాష్, లొట్టపీసు కేస్ అని ఎద్దేవా చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సిట్ నోటీసులపై ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి పరిపాలన చేతగాని ఒక అసమర్థుడని, ఇచ్చిన హామీలు నిలబెట్టుకొనే తెలివే ఆయనకు లేదని విమర్శించారు.
అబద్ధాలతో అధికారంలోకి వచ్చారని, ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక అటెన్షన్, డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అందులో భాగంగా కొద్దిరోజులు కాళేశ్వరం కుంభకోణం అని, మరో కొద్దిరోజులు ఫోన్ ట్యాపింగ్ అని, అట్లనే ఇంకొద్ది రోజులు గొర్రెల సామ్ అని, ఫార్ములా-ఈ కేస్ అని డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఈ రెండేండ్లలో డ్రామాలు తప్ప రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సాధించింది, ప్రజలకు ఇచ్చింది ఏమీ లేదని విమర్శించారు. మొన్న బొగ్గు కుంభకోణాన్ని హరీశ్‌రావు బయటపెట్టారని, రేవంత్‌రెడ్డి బావమరిది ఆధ్వర్యంలో బొగ్గు కుంభకోణాలు ఎట్ల జరుగుతున్నాయో, వేల కోట్ల కాంట్రాక్టులు అటు రేవంత్‌రెడ్డి, ఇటు కేంద్రంలోని పెద్దలు మంచిగా అదులుకొని, బదులుకొని దోపిడీ ఎలా చేస్తున్నారో బహిర్గతం చేశారని చెప్పారు.
అదేరోజు సాయంత్రం కల్లా సిట్ నోటీస్ ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కైంప్లెంట్ చేస్తే కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశిస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పడం ఆశ్చర్యం అనిపించిందని తెలిపారు. పట్టపగలే దోపిడీ చేసిన దొంగ నేను అని.. దొంగతనం చేశానని.. ఎవడైనా పోలీస్‌స్టేషన్‌లో చెప్తాడా? అని ప్రశ్నించారు. దొంగ అని చెప్పి మేం ఆధారాలు సహా చూపెడుతుంటే.. కాదు కాదు దొంగనే ఫిర్యాదు చేయాలి, చేస్తే మేం విచారణకు ఆదేశిస్తామని అనడం ఎంత అసహ్యంగా ఉన్నదో ఇవాళ కేంద్ర ప్రభుత్వ వైఖరి చూస్తే అర్థమవుతుందని చెప్పారు.
రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డి కంపెనీకి అర్హత లేకపోయినా కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్‌లో కాంట్రాక్టులు ఏవైతే దకించుకున్నారో ఆధారాలు సహా నేను ఢిల్లీకి పోయి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఇచ్చానని, దమ్ముంటే సృజన్రెడ్డిపై సిట్ వేయాలని డిమాండ్ చేశారు. గచ్చిబౌలి భూముల్లో రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని, దీనిపై ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయాలని సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేసిందని, అయినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని, రేవంత్‌రెడ్డిని ఎందుకు కాపాడుతున్నదో? చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చిన ప్రతిసారీ ఇకడ ఆర్ఆర్ ట్యాక్స్ అమలవుతున్నదని అంటున్నారు. రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ దోపిడీ చేస్తున్నారని చెప్తున్నారు. మీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలంగాణ కాంగ్రెస్ ఏటీఎంగా మారిందని స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ వాటిపై సిట్ మాత్రం ఉండదు. బొగ్గు కుంభకోణం జరిగిందయ్యా అని ఆధారాలు ఇస్తే దానిపైనా సిట్ ఉండదు.
-కేటీఆర్
మాకేం తెలుస్తది?
‘ఫోన్ ట్యాపింగ్ అనేది గూఢచారి వ్యవస్థ. నిఘా వ్యవస్థ అనేది శాంతిభద్రతల పరిరక్షణ కోసం, అట్లనే ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్రలు ఎవరైనా చేస్తే దాని నుంచి ప్రభుత్వాలను కాపాడటం కోసం 1952 నుంచి నెహ్రూ టైం నుంచి ఈరోజు వరకు ఉన్నది’ అని కేటీఆర్ వివరించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆధీనంలో ఉండే పోలీసులు కూడా ఇవాళ దేశంలో కొన్నివేల ఫోన్లు వింటున్నారని, అది ఆయనకు తెలుసో? తెలియదో? తనకు తెలువదని చెప్పారు. ఇది దేశ భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రభుత్వాల స్థిరత్వానికి సంబంధించి పోలీసులు రొటీన్‌గా చేసేదేనని, దానికి మంత్రులకు, ప్రభుత్వంలో ఉండే రాజకీయ నాయకులకు పాత్ర ఉండదని చెప్పారు. ఇదే రేపు తాను చెప్తానని, ఇంకా కొత్తగా చెప్పేంది ఏం ఉండదని తేల్చి చెప్పారు.
అయినా తమకేం తెలుసునని స్పష్టం చేశారు. ఈ దేశంలో ప్రతి ప్రభుత్వం గూఢచారి వ్యవస్థపైనే ఆధారపడుతుందని, వాటి నుంచి ప్రభుత్వాధినేతలకు రిపోర్టులు వస్తాయని తెలిపారు. సిట్ ఎవరిని పిలువాలో వాళ్లని పిలువకుండా, అందులో తమకేదో రాజకీయ నాయకులకు సంబంధం ఉన్నట్టు కార్తీకదీపం సీరియల్లాగా, ఒడవని అంతులేని కథ లాగా కేవలం టైంపాస్ కోసం చేస్తున్నారని విమర్శించారు. నిజానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదటి ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసి, ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్‌రెడ్డిని పిలువాలని, ఆయనకు తెలుస్తదని, తమకేం తెలుస్తదని చెప్పారు. గతంలో డీజీపీగా పనిచేసిన మహేందర్రెడ్డికీ తెలుస్తదని, మొన్నటిదాకా డీజీపీగా పనిచేసిన జితేందర్, ఆయన గతంలో హోం సెక్రటరీగా కూడా ఉన్నారని వారికే తెలుస్తుందని చెప్పారు.
రేపు బరాబర్ పోతా. బరాబర్ మళ్లా చెప్పి వస్తా. మీరు నా ఫోన్ ఇవాళ ట్యాప్ అవుతుందో లేదో చెప్పమని సిట్ వాళ్లను ముందు అడుగుతా. ఈ కేసు విచారణ ప్రారంభించి రెండేండ్లయింది. మేము ఏ తప్పూ చేయలేదు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ముమ్మాటికీ పోతా.
-కేటీఆర్
మీరు ఫోన్లు ట్యాప్ చేయట్లేదని చెప్తారా?
2015లో మా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేశారని, ఒక సన్నాసి మా ఎమ్మెల్యేలను కొంటూ రూ.50 లక్షల బ్యాగ్‌తో దొరికిండని, మరి ప్రభుత్వాన్ని కూలగొట్టే కుట్రలు ఎవరైనా చేస్తే వాళ్ల ఫోన్లు పోలీసులు విన్నారేమో తనకేం తెలుసుని కేటీఆర్ ప్రశ్నించారు. ఇంకెవరైనా అట్లాంటి పనులు చేశారేమో? పోలీసులు విన్నారేమో? మంత్రులకు ఏం తెలుస్తదని, ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు ఏం తెలుస్తదని ప్రశ్నించారు. తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్తే జర్నలిస్టులు వార్తలు రాసినా ప్రభుత్వం ఇంతవరకు ఖండించలేదని పేర్కొన్నారు.
నేను రాష్ట్ర డీజీపీని, ఇంటెలిజెన్స్ ఐజీని ఒకటే అడుగుతున్నానని.. రాష్ట్రంలో ప్రస్తుతం తమ ఫోన్లు ట్యాప్ చేయట్లేదని, మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయట్లేదని మీరు ప్రమాణం చేసి చెప్తారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ఇవాళ రేవంత్‌రెడ్డి ట్యాప్ చేయడం లేదని ఏ ఒక అధికారి కెమెరా ముందుకొచ్చి చెప్పే ధైర్యం ఉన్నదా? చెప్తారా అఫీషియల్‌గా? వాళ్లకు తెలిసినా చెప్పలేరు ఎందుకు? రేపు మా గవర్నమెంట్ వస్తది మళ్ల మేం ఎంక్వయిరీ చేసినామనుకో వీళ్లందరూ మళ్ల బొకల పడతారని ఎద్దేవా చేశారు. ఉప ముఖ్యమంత్రి తనపై కోపంగా ఉన్నాడోనని, బొగ్గు కుంభకోణంలో ఆయన వాటాను తానేదో కొట్టేసే ప్రయత్నం చేశానని, తన కుర్చీ ఏమైనా గుంజుకుంటాడేమోనని సీఎం భయపడుతున్నాడని విమర్శించారు.
బరాబర్ పోతా.. అడుగుతా
మొన్న హరీశ్‌రావును పిలిస్తే కొత్త విషయాలు ఏమైనా చెప్తారేమోనని అనుకున్నానని, కానీ, అందులో ఏమీ లేదని, అడిగిందే అడిగారని కేటీఆర్ తెలిపారు. ప్రజలకు పనికొచ్చే ఒక పని ఈ ప్రభుత్వం ఈ రెండేండ్లలో చేసిందా? ఒక మహిళకు రెండున్నర వేల రూపాయలు ఇచ్చిందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. దానిపై చర్చ లేదని, ఆరు గ్యారెంటీల మీద చర్చ లేదని, నూరు రోజులన్నది మర్చిపోవాలని, ఏమన్నా అంటే కేసీఆర్ అప్పులు చేసిండని డప్పు కొట్టాలని, దికుమాలిన ఆలోచన తప్ప వాళ్లు పీకేదేమీ లేదని, వాళ్లతో అయ్యేదేమీ లేదని విమర్శించారు.
ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. పుంఖాను పుంఖాలుగా కథనాలు వచ్చాయని, అవి ఎకడికెళ్లి వచ్చాయని, అసలు ఎవరైనా ఒక అధికారి అఫీషియల్‌గా ప్రెస్‌మీట్ పెట్టి చెప్పారా? మంత్రి అఫీషియల్‌గా మాట్లాడారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అసలు ఏ జరుగుతున్నదని, రాజకీయ వేధింపులు తప్ప ఈ విచారణలో ఏమున్నదని, ఏమన్నా విషయం ఉంటే ఈపాటికే రేవంత్‌రెడ్డి నానా యాగి చేసుండేవాడని తెలిపారు. అధికారులు ఎవరైతే ఈరోజు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారో వాళ్లకు కూడా తెలుసునని, చివరకు ఈ రాజకీయ క్రీడలో బలిపశువులు అయ్యేది పోలీసులేనని చెప్పారు.
గూండాలను తీసుకొని పోయి భూములు కబ్జా చేస్తున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కొడుకుపైన సిట్ వేయాలి. రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డి డైరెక్ట్‌గా బొగ్గు కుంభకోణాలు చేస్తున్నాడని ఆధారాలతో చూపెట్టినా సిట్ లేదు.. మరే విచారణా లేదు. అర్హతలేని సృజన్‌రెడ్డి కంపెనీకి కేంద్ర పథకమైన అమృత్ కాంట్రాక్టులు దక్కించుకున్నారు. ముందు ఆ ఇద్దరి అవినీతి, అక్రమాలపై సిట్ వేయాలి.
-కేటీఆర్
కొత్త జిల్లాల రద్దుకు కుట్రలు
పరిపాలనా సౌలభ్యం కోసం కేసీఆర్ ఏర్పాటుచేసిన కొత్త జిల్లాలపై సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అనుకూల ఫలితాలు రావడంతో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయాలని, కమిషన్ ఏర్పాటు చేసి జిల్లాలను ఎత్తేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు చేరువగా కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే, శాస్త్రీయంగా లేదని కమిషన్ ఏర్పాటు చేసి, జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా తప్పించుకోవాలని రేవంత్‌రెడ్డి చూస్తున్నాడని మండిపడ్డారు. జిల్లాలను రద్దు చేయాలని చూస్తే ప్రజలే గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. ప్రజల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత ఉన్నదని, మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో మంచి ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన దానికంటే మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పారు.
శివధర్‌రెడ్డి ఇవాళ రాష్ట్ర డీజీపీగా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన ఇంటెలిజెన్స్ ఐజీ. ఆయనకు తెల్వకుండానే ఫోన్‌ట్యాపింగ్ జరిగిందా? మరి ఆయన్ని ఎందుకు పిలుస్తలేరు? మహేందర్‌రెడ్డి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఐదేండ్లు డీజీపీగా ఉన్నారు. మరి ఆయన్ను కూడా ఎందుకు పిలుస్తలేరు. ఓన్లీ పొలిటికల్ లీడర్లనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.
-కేటీఆర్