హైదరాబాద్, మార్చి 24 (నమస్తేతెలంగాణ) : ‘గ్యాస్ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం బుకాయిస్తుంటే.. సప్లయ్ లేదని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆంబోతుల కొట్లాటలో లేగలు బలైన చందంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నాటకాలకు సామాన్యులు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి గ్యాస్ కొరతపై నిరసనకు దిగారు.
‘కేంద్రం చెబుతుంది కొరతలేదు.. రాష్ట్రం అంటుంది సప్లయ్లేదు.. నాటకాలు ఆపండి.. గ్యాస్ కొరత తీర్చండి’ అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ అసెంబ్లీలోనికి వెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత గ్యాస్ సిలిండర్ కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. పనులు బంద్‌పెట్టి గ్యాస్ ఏజెన్సీల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొన్నదని వాపోయారు. ఇప్పటికైనా మోదీ, రేవంత్ ప్రభుత్వాలు కండ్లు తెరిచి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని ఎల్పీజీ గ్యాస్‌ను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.