హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): అప్పులు కట్టేందుకు అప్పులు తెస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని, మరి ప్రభుత్వ ఆదాయం ఎక్కడికి పోతున్నది? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రశ్నించారు. కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్తున్నదా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. నిన్నటిదాకా అప్పులు చేయటమే తప్పు అన్నట్టు మాట్లాడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడెందుకు అప్పు చేస్తున్నదని నిలదీశారు. బుధవారం తెలంగాణభవన్‌లో మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్ తదితరులతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అప్పులు రూ.3.89 లక్షల కోట్లు మాత్రమేనని, కానీ రూ.7 లక్షల కోట్లు అని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. శ్వేతపత్రాల పేరుతో అబద్ధాలు చెప్పినందుకు వారిద్దరు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతులను విస్మరించి రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని రేవంత్‌పై కేటీఆర్ మండిపడ్డారు. ఫలితంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని అన్నారు. రైతన్నలు తీవ్ర కష్టాల్లో ఉన్నారని తెలిపారు. ధాన్యం కొనలేదని రైతులు బాధపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని, వారి పరిస్థితి దయనీయంగా ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం, అకాల వర్షాలతో వడ్లు వర్షాల పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు అయిపోయినందున రాజకీయాలను పకనపెట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యం తరుగు విషయంలోనూ చర్యలు తీసుకోవాలని, ఒక్కో దగ్గర 3-3.50 కిలోల వరకు తరుగు తీస్తున్నారని ఆరోపించారు. కామారెడ్డి, భువనగిరి, సిరిసిల్ల, నిర్మల్ జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వం స్పందించకుంటే రైతుల పక్షాన రోడ్డు ఎకాల్సివస్తుందని హెచ్చరించారు. రూ.500 బోనస్, రుణమాఫీ జరిగే వరకు రైతుల కోస పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి తన అసమర్థత, తన ప్రభుత్వ చేతకానితనానికి విద్యుత్ ఉద్యోగులను నిందిస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌కు కామన్సెన్స్ లేదని ఆరోపించారు. తన చేతకానితనాన్ని విద్యుత్తు ఉద్యోగులపై చూపెడుతున్నారని విమర్శించారు. సీఎం విజ్ఞతతో మాట్లాడాలని, ముఖం బాగాలేకుంటే అద్దం పగులగొట్టినట్టుగా రేవంత్ వ్యవహరం ఉన్నదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సీఎంగా పదేండ్లు ప్రభుత్వాన్ని నడిపినా, ఏనాడూ ప్రభుత్వ ఉద్యోగులపై నిందలు వేయలేదని గుర్తుచేశారు. ఉద్యోగులతో తమది పేగు బంధమని తెలిపారు. 7,700 మెగావాట్ల నుంచి 20 వేల మెగావాట్లకు తీసుకువెళ్లిన విద్యుత్తు సంస్థల ఉద్యోగుల అద్భుతమైన పనితీరును కూడా నిందిస్తున్నారని విమర్శించారు. నారాయణఖేడ్‌లో ఎలక్షన్ డ్యూటీ డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు టీచర్లపై లాఠీచార్జ్ చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగేనా ఉద్యోగులపై ప్రభుత్వం వ్యవహరించే తీరు అని అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం పైన బీజేపీ ఆలోచనలు వేరే తీరుగా ఉన్నాయని, వారి కుట్రలను జూన్ 4 తర్వాత అర్థం చేసుకుంటారని వెల్లడించారు.
రాష్ట్రంలో సైలెంట్ ఓటింగ్ బీఆర్ఎస్కు అనుకూలంగా జరిగిందని కేటీఆర్ అన్నారు. తమ పార్టీ ఎంపీ అభ్యర్థులతో మాట్లాడానని, తాను ప్రత్యేకంగా సర్వే కూడా చేయించానని తెలిపారు. తెలంగాణలో నల్లగొండ సీటును మాత్రమే కాంగ్రెస్ గెలుస్తుందని వెల్లడించారు. చేవేళ్ల, మల్కాజిగిరి సహా ఇతర స్థానాల్లో ఆ పార్టీకి సరైన అభ్యర్థులు లేరని వివరించారు. కరీంనగర్లో బీజేపీని గెలిపించటానికి డమ్మీ అభ్యర్థిని పోటీలో పెట్టారని విమర్శించారు. ఖమ్మంలో కమ్మ సామాజికవర్గం వాళ్లు నామ నాగేశ్వరరావును గెలిపించుకొంటున్నారని, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్‌లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా పోటీ ఉన్నదని వివరించారు. కేసీఆర్ రంగంలోకి దిగిన తర్వాత బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందని, కేసీఆర్ బస్సు యాత్రతో కాంగ్రెస్, బీజేపీకి భయం పట్టుకున్నదని అన్నారు. నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు మిగతా ఇద్దరు అభ్యర్థులు సరితూగలేదని తెలిపారు. సికింద్రాబాద్ అభ్యర్థిగా పద్మారావును ప్రకటించాక సీన్ మారిందని చెప్పారు. ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుస్తున్నారని తమకు సమాచారం ఉన్నట్టు పేర్కొన్నారు.
అచ్చంపేటలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ దాడికి పాల్పడగా, అక్కడే ఉన్న పోలీసులు దాడులను ఆపకుండా ప్రేక్షకపాత్ర పోషించటంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మీరు తరచూ చెప్పే మొహబ్బత్ కీ దుకాన్ అంటే ఇదేనా?’ అని రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ఎదేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ దాడుల సందర్భంగా పోలీసులు మౌన ప్రేక్షకులుగా వ్యవహరించటం సిగ్గుచేటు అని అన్నారు. పోలీసులు మౌనంగా ఉంటే మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని, న్యాయం జరిగే వరకు పోరాడతామని తేల్చిచెప్పారు.