హైడ్రాతో, చెరువులతో ఆర్థికశాఖ మంత్రికి ఏం సంబంధం? ఆయన ప్రజెంటేషన్ ఇచ్చి ఐదుగురు బిల్డర్ల పేరు చెప్పారు. ఎందుకిదంతా? బ్లాక్‌మెయిలింగ్ దందానా? పైసలు వసూలు చేసే కథనా? మొత్తం మంత్రులు, నీ (సీఎం) తమ్ముళ్లు, నీ ప్రభుత్వానికి ఇదే పనా? ఇంకో పని లేదా? గరీబోళ్ల ఇండ్లు కూలగొట్టాలి, హైడ్రా దుకాణం చూపెట్టాలి. పెద్ద పెద్ద బిల్డర్ల దగ్గర దందా చేసి, చందాలు తీసుకోవడానికేనా ప్రభుత్వాలు ఉండేది. హైడ్రా భయంతో కూకట్‌పల్లిలో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ కుటుంబాన్ని సోమవారం పరామర్శించిన సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
KTR | హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ)/ బాలానగర్/అల్లాపూర్: రాష్ట్రంలో బకాసుర రాజ్యం నడుస్తున్నదని, కాంగ్రెస్ పాలన పేదలపాలిట భస్మాసుర హస్తంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కూకట్‌పల్లికి చెందిన బుచ్చమ్మది ఆత్మహత్య కాదని, హైడ్రా అనే అరాచక సంస్థతో సీఎం రేవంత్ చేయించిన హత్య అని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు మాధవరం కృష్ణారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, శంభీపూర్ రాజు, రాగిడి లక్ష్మారెడ్డి, పాటిమీది జగన్మోహన్ రావుతో కలిసి బుచ్చమ్మ కుటుంబాన్ని కేటీఆర్ సోమవారం పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ‘మీ ఇంటికి ఏ ఇబ్బందీ రాదు. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తాం. మీరు అధైర్య పడకండి.. అన్ని విధాలా సాయం చేస్తాం’ అని ధైర్యం కల్పించారు.
బుచ్చమ్మ భర్తకు వైద్య పరీక్షలు చేయిస్తామని చెప్పారు.రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గుడ్డెద్దు చేలో పడ్డట్టు కూకట్‌పల్లిలోని నల్ల చెరువు వద్ద కూల్చివేతలు చేపట్టి అనేక మందిని రోడ్డును పడేసిందని మండిపడ్డారు. హైడ్రా అనే బ్లాక్ మెయిల్ సంస్థను పేదల మీదికి ఉసిగొల్పి..నోటీసులు ఇవ్వకుండానే ఇండ్లు కూలగొడుతూ భయానక వాతావరణాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిందని, కనీసం పిల్లలు పుస్తకాలను కూడా తీసుకోనీయకుండా ఇండ్లు కూలగొట్టారని నిప్పులు చెరిగారు. ఎక్కడ తమ ఇల్లు కూలగొడుతారోనన్న భయంతోనే కలత చెంది 52 ఏండ్ల బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నదని, ఆమె కుటుంబాన్ని చూస్తే బాధ కలుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే పర్మిషన్లు ఇచ్చి, పన్నులు కట్టించుకొని, నల్లా కనెక్షన్లు ఇచ్చి ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు.
ఇంత అమానవీయమా?
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇంత అమానవీయంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉన్నదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. సర్కారు దిక్కుమాలిన చర్యలతో చివరికి ప్రజలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ‘ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చిండ్రు.. ఇందిరమ్మ ఇండ్లు కడుతం.. ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇస్తం అన్నరు. ఒక్క ఇల్లయినా కట్టిండ్రా? ఒక్క ఇల్లు కూడా కట్టకుండానే నీ ప్రభుత్వం ఎన్ని ఇండ్లను కూలగొట్టిందో ప్రజలు గమనిస్తున్నరు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నువ్వు వచ్చి దాదాపు ఏడాది కావచ్చింది ఒక్క ఇల్లయినా కట్టినవా?’ అని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. హైదరాబాద్‌లోనే కాకుండా ఊళ్లలోనూ రేవంత్‌రెడ్డి అరాచకం గురించి మాట్లాడుకుంటున్నారని తెలిపారు. ‘నువ్వు నీ క్యాబినెట్ మంత్రులు ఏం చేస్తున్నారో ప్రజలంతా చూస్తున్నరు. గరీబోళ్ల ఇండ్లు కూలగొట్టి హైడ్రా పేరుతో దందా చేస్తున్నరు.. బుచ్చమ్మది ఆత్మహత్య కాదు? రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య.. ఈ హత్య కేసును రేవంత్‌రెడ్డి, హైడ్రా పైన పెట్టాలి’ అని విరుచుకుపడ్డారు. బుచ్చమ్మ కుటంబానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆర్థిక సాయం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. హైడ్రా బాధితులందరికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అండగా ఉంటారని, ప్రజలెవరు భయపడవద్దు అని కేటీఆర్ భరోసా కల్పించారు.
చిన్నారి ఆవేదనకు చలించి..
‘మా ఇల్లు రేవంత్ సార్ కూలగొట్టారు.. మా ఇల్లు మొత్తం కూల్చేశారు.. మేం ఏడుస్తున్నా వదలలేదు. టీచర్ వాళ్లు కాల్ చేసి స్కూల్‌కు ఎందుకు రాలేదని అడిగితే మా ఇంటిని కూలగొడితే బుక్స్ అన్నీ పోయినయ్ అని చెప్పిన. మా బుక్స్, వాటర్ బాటిల్స్, ఏమేం పోయినయివో.. ఆ రేవంత్‌రెడ్డి సారు ఏమేం తీసుకున్నడో.. అవన్నీ మాకు కంపల్సరీ తెప్పియాలి. మా డాడీ డీమార్ట్‌లో బాటిల్ కొనిపిస్తే అది కూడా పగులగొట్టిండ్రు.. మా మమ్మీడాడీ పెట్రోల్ పోసుకుంటే చాన బాధవడ్డ’ అంటూ తన ఇంటిని కూల్చిన సందర్భంలో చిన్నారి వేదశ్రీ ఆవేదనతో చెప్పిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరలై ప్రతి ఒక్కరి గుండెను కరిగించాయి. ఆ చిన్నారి గోడును విన్న కేటీఆర్, ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు సోమవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ఆమె ఇంటికి వెళ్లారు. సున్నం చెరువు పరీవాహక ప్రాంతాల్లో హైడ్రా బాధితుల ఇండ్లకు వెళ్లి పరిస్థితులను తెలుసుకున్నారు. చిన్నారి వేదశ్రీ మీడియా చానల్లో తన గోడు వెలిబుచ్చిన తీరు తనను కలిచివేసిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. వేదశ్రీని ఎత్తుకొని కాసేపు ముచ్చటించారు. పుస్తకాలు కోల్పోయిన వేదశ్రీకి పుస్తకాలతో పాటు బ్యాగు అందించారు. వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. హైడ్రా కూల్చివేతల కారణంగా తమ పిల్లలు, కుటుంబం మొత్తం రోడ్డున పడిందని కేటీఆర్‌కు వేదశ్రీ కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు. వేదశ్రీ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రాక్షసక్రీడలు మానండి
రాజకీయాలపై పెట్టిన దృష్టి ధాన్యం కొనుగోళ్లపై ఎందుకు పెట్టడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.రాజకీయాల్లో రాక్షస క్రీడలు మాని రైతులను ఆదుకోవడంపై దృష్టి పెట్టాలని, రైతుల విషయంలో రాజకీయాలు చేయొద్దని హితవుపలికారు. దసరాకే కాదు దీపావళికి కూడా రైతులను దివాలా తీయిస్తారా? అని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం మూలుగుతున్నా ఎందుకు కొనడం లేదని నిలదీశారు. దొరికినకాడికి దోచుకో.. అందినంత దండుకో అన్నట్టుగా రాష్ట్రంలో ప్రస్తుతం దందా నడుస్తున్నదని కేటీఆర్ ఎద్దేవాచేశారు. ‘అక్రమారులు, కాంగ్రెస్ గ్యాంగ్‌లు సహజ వనరులను కొల్లగొడుతున్నారు. సీక్రెట్ ఒప్పందాలు చేసుకొని యథేచ్ఛగా ఇసుక, మట్టిని బుక్కేస్తున్నారు. ఇసుకాసుర, బకాసుర భస్మాసుర రాజ్యం ఇది’ అని తీవ్రంగా మండిపడ్డారు.
రాష్ట్రంలో అరాచక రాజ్యం
తెలంగాణ మొత్తం మీద ఇవ్వాళ అరాచకమే రాజ్యమేలుతున్నదని కేటీఆర్ ధ్వజమెత్తారు. గరీబోళ్ల పొట్టకొట్టే ప్రభుత్వ చర్యలపై పోరాడుతామని స్పష్టంచేశారు. హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్కు ఓటేసినందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పగ సాధిస్తున్నదని విమర్శించారు. ఈ ప్రభుత్వం మీద అందరం కలిసి కచ్చితంగా తిరగబడాల్సిందే పిలుపునిచ్చారు. కార్యకరమంలో కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, మందడి శ్రీనివాస్‌రావు, ముద్దం నర్సింహయాదవ్, ఆవుల రవీందర్‌రెడ్డి, పండాల సతీశ్‌గౌడ్ తదితరులున్నారు.
చిప్ప చేతిలో పెడితిరి : కేటీఆర్
‘సంపద పెంచే ఆలోచనలు మావి.. ఉన్నది ఊడ్చే సావు తెలివితేటలు మీవి’ అని కాంగ్రెస్ సర్కారు తీరుపై కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. మేము బంగారు బాతును చేతిలో పెడితే.. 11 నెలలకే చిప్పచేతిలో పెడితిరి’ అంటూ నిప్పులు చెరిగారు. హైడ్రా చర్యలతో హైదరాబాద్‌లో సొంతింటి కల చెదిరిందని, మూసీ ముష్టి పనులకు రియల్ ఎస్టేట్ దివాలా తీసిందని ధ్వజమెత్తారు. నాడు నిత్యం కలకలలాడిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు నేడు విలవిలలాడుతున్నాయని పేర్కొన్నారు.
హైడ్రా భయం వల్లనే బుచ్చమ్మ బలవన్మరణానికి పాల్పడింది. ఆమెది ఆత్మహత్య కాదు.. హైడ్రా అనే అరాచక సంస్థతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేయించిన హత్య. మీ దిక్కుమాలిన చర్యల కారణంగా పేదలు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి దాపురించింది. వేదశ్రీ అనే పాప ఏడుస్తూ పుస్తకాలు తీసుకుంటామంటే కూడా తీసుకోనివ్వకుండా ఇల్లు కూలగొట్టిండ్రు. ఇంత దిగజారిన, దిక్కుమాలిన చర్య మరేదైనా ఉంటదా? -కేటీఆర్
హైడ్రాతో ఆర్థిక మంత్రికి సంబంధమేంది? ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తడు.. ఐదుగురు బిల్డర్ల పేర్లు చెప్తడు.. ఎందుకిదంత? బ్లాక్మెయిల్ దందానా? నీ మంత్రులు,నీ తమ్ముళ్లందరిది ఇదే దందానా? పెద్దపెద్ద బిల్డర్లను బెదిరించి వాళ్ల దగ్గర దందా చేసి చందాలు వసూలు చేసేందుకా నీ ప్రభుత్వం ఉన్నది?
-కేటీఆర్
ఈ రాష్ట్రంలో పేదోళ్ల ఇండ్లు కూలగొట్టేందుకే చట్టాలున్నాయా? రేవంత్‌రెడ్డీ.. ఎఫ్టీఎల్లో ఉన్న నీ అన్న తిరుపతిరెడ్డికి ఇంటికి నోటీసులు ఇస్తవు.. పేదలకు ఇవ్వవా? ఏక పక్షంగా కూలగొడుతరా? ఇదెక్కడి న్యాయం?
– కేటీఆర్