KTR | యావత్ దేశానికే తలమానికంగా నిలిచిన తెలంగాణ సంక్షేమ గురుకులాలకు అద్దెలు పేరుకుపోయి చివరికి తాళాలు వేసే దుస్థితి రావడం అత్యంత దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. విద్యాశాఖను తన వద్దే పెట్టుకున్న ముఖ్యమంత్రి, గురుకుల భవనాలకు ఏకంగా ఏడాది కాలం నుంచి అద్దెబకాయిలు చెల్లించకపోవడం రేవంత్ రెడ్డి అసమర్థతకు, చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు.
పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన ఈ అత్యుత్తమ వ్యవస్థను కుప్పకూల్చి కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలన్న కుట్రలో భాగంగానే సీఎం రేవంత్ ఇదంతా చేస్తున్నట్టు అనుమానం కలుగుతోందని కేటీఆర్ అన్నారు. ఓవైపు ఫీజు రీయింబర్స్మెంట్బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల భవితవ్యాన్ని అంధకారంలోకి నెడుతున్న ముఖ్యమంత్రి సంక్షేమ గురుకులాలను కూడా సమాధి చేసే పన్నాగాలు చేస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతోపాటు అగ్రవర్ణ పేదలకు కార్పొరేట్ స్థాయి విద్యనందించిన రెసిడెన్షియల్ వ్యవస్థను బలిపెడితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకుంటే మంచిదని కేటీఆర్ హెచ్చరించారు. రెండేళ్లు నిండకుండానే రెండున్నర లక్షల కోట్ల అప్పులు తెచ్చిన రేవంత్ రెడ్డి, కనీసం గురుకులాల కిరాయి కూడా కట్టకుండా ఆ సొమ్ముతో ఎవరి జేబులు నింపుతున్నాడో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలోని అన్ని గురుకుల భవనాల అద్దె బకాయిలను విడుదలచేసి విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఒకవేళ గురుకులాలకు తాళాలు వేసే దుస్థితే వస్తే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి తెలంగాణ వ్యాప్తంగా ఈ నిరంకుశ కాంగ్రెస్ సర్కారుపై సమరశంఖం పూరిస్తామని కేటీఆర్ అన్నారు. చిన్నారుల భవితవ్యంతో చెలగాటమాడుతున్న రేవంత్ రెడ్డికి ప్రజాక్షేత్రంలోనే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.