హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టులోని రెండు పిల్లర్లు కుంగితే, ఆగమేఘాల మీద స్పందించిన మోదీ సర్కార్.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూలిన ప్రాజెక్టులపై ఎందుకు స్పందించడంలేదు? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ఎస్ఎల్బీసీ టన్నెల్, సుంకిశాల రిటర్నింగ్ వాల్ కూలినా, వట్టెం పంప్‌హౌస్ మునిగినా, పెద్దవాగు కొట్టుకుపోయినా, చెక్‌డ్యామ్‌లను కాంగ్రెస్ నేతలు పేల్చివేస్తున్నా నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఎక్కడ సచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. చిల్లర రాజకీయాలు, ప్రచారాలు బంద్ చేసి ప్రాజెక్టు మరమ్మతులపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. యాక్టింగ్ బంద్‌చేసి వాటర్ లిఫ్టింగ్ మొదలుపెట్టాలని హితవుపలికారు.
తెలంగాణభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరంలోని వంద కాంపోనెంట్లలో రెండు కాంపోనెట్లకు కొంత ఇబ్బంది తలెత్తితే, ఇంత గోబెల్స్ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు గత రెండున్నరేండ్లలో జరిగిన అక్రమాలపై ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. ‘కమీషన్ల కక్కుర్తితో పరిస్థితిని అంచనా వేయకుండా ఎస్ఎల్బీసీ విషయంలో అడ్డగోలుగా ముందుకెళ్తే ఆరుగురు కార్మికులు సజీవ సమాధి కాగా.. వారి శవాలను నేటికీ వెలికితీయలేకపోవడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కుంగితే ఆగమేఘాల మీద ఎన్డీఎస్ఏ వచ్చిందే.. 48 గంటల్లో నివేదిక ఇచ్చిం దే.. మరి ఎస్ఎల్బీసీ టన్నెల్ నిట్టనిలువు నా కూలితే.. వట్టెం పంప్‌హౌస్ మునిగి పో తే.. సుంకిశాల రిటర్నింగ్ వాల్ కూలిపోయి రూ.120 కోట్ల నష్టం జరిగితే.. పెద్దవాగు కొట్టుకుపోతే ఎక్కడ సచ్చింది మీ ఎన్డీఎస్ ఏ? ఎక్కడున్నారు మీ అధికారులు? చెక్‌డ్యామ్‌లను చిల్లర కాంగ్రెస్ నేతలు పటాకు లు పేల్చినట్టు పేల్చుతున్నారు. మరి ఎన్డీఏఎస్ఏ అధికారులు ఎక్కడ ఉన్నారు?’ అని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్, బీజేపీ లోపాయికారి బంధానికి నిదర్శనం కాదా? అని నిలదీశారు. ఆనాడు పరుగెత్తుకొచ్చి 48 గంటల్లోనే రిపోర్టు ఇచ్చి.. దున్న ఈనిందంటే దూడను కట్టేయమన్నట్టుగా తానాతందానా ఆడింది కాంగ్రెస్, బీజేపీ కాదా? అని మండిపడ్డారు.
వట్టెం పంపహౌస్ ముగినితే, చెక్‌డ్యామ్‌లు పేలిపోతుంటే కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. బండి సంజయ్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ నేతలు చెక్‌డ్యామ్‌ను పేల్చివేస్తుంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఏం చేస్తున్నారని మండిపడ్డారు. కేసు పెట్టి నిందితులను లోపల వేయొచ్చుగా.. ఏమిటి మీ ఇద్దరి మధ్య ఫెవికాల్ బంధం? అని నిలదీశారు. ఇప్పటికైనా బీజేపీకి చిత్తశుద్ధి ఉండే రిటైర్డ్ న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వరద ప్రవాహాన్ని తట్టుకొని నిలబడిన మేడిగడ్డ బరాజ్ ఎన్నికలకు కొన్ని నెలల ముందే ఎలా పేలుతది? రెండు పిల్లర్లు ఎలా కుంగుతాయి? ఇవన్నీ తేలాల్సిన అంశాలని పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డికీ, కేంద్రానికి సంబంధం లేకపోతే ఓటుకు నోటు కేసును కేంద్ర సొలిసిటర్ జనరల్ ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదు? రేవంత్‌రెడ్డి ఎన్డీఏ భాగస్వామిలా మారిపోయారు. ఆయన ఒక హైబ్రిడ్ ముఖ్యమంత్రి. పొద్దున కాంగ్రెస్ పాట పాడుతూ, సాయంత్రం బీజేపీతో కలిసిపోతున్నారు. కాంగ్రెస్‌ను 15 కిలోమీటర్ల లోపల బొందపెట్టి, ఆ పార్టీ మళ్లీ కోలుకోకుండా చేసేది రేవంత్‌రెడ్డే. చివరికి ఆయన బీజేపీలో చేరడం ఖాయం. రేవంత్‌రెడ్డి అన్నట్టుగా మాకు ప్రతిపక్ష హోదా రాదు.. ముమ్మాటికీ అధికార పక్ష హోదానే వస్తుంది.
– కేటీఆర్
కేసీఆర్, బీఆర్ఎస్ నేతల మీద కక్షతో కాంగ్రెస్ పాలకులు రెండున్నరేండ్లు రాష్ట్ర రైతాంగాన్ని రాచి రంపాన పెట్టారని కేటీఆర్ విమర్శించారు. కాలం బాగైందని ప్రాజెక్టులను పండబెట్టారని, ఇప్పుడు ఎల్‌నినో ప్రభావం ఉంటుందని, నీళ్లు ఎత్తిపోయక తప్పని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. చిల్లర రాజకీయాలుమాని రైతాంగానికి మేలు చేయాలని సూచించారు. ‘కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్పై కోపం ఉంటే కేసులు పెట్టుకో, కమిషన్లు వేసుకో, ఆ కోపం రైతాంగం మీదతీసి పంటలు ఎండబెట్టి, రైతుబంధు వేయకుండా, కరెంట్, నీళ్లు ఇవ్వకుండాహింసించడం తగదు. లిఫ్టింగ్ చేయండి. యాక్టింగ్ బంద్ చేయండి. గాసిప్స్ మీద కాదు.. గవర్ననెన్స్ మీద దృష్టి పెట్టండి. పనికిరాని పనుల మీద కాదు’ అని రేవంత్‌రెడ్డి సర్కార్‌కు చురకలంటించారు.
కాంగ్రెస్ నేతలకు రక్షణ కవచంగా కేంద్ర మంత్రులు పనిచేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఫెవికాల్ బంధం ఉన్నదని ఎద్దేవాచేశారు. మనుషులపై కాల్పులు జరుపుతూ అజ్మల్ కసబ్ కెమెరాలకు ఎలా దొరికిపోయాడో, రేవంత్‌రెడ్డి కెమెరాల సాక్ష్యంగా దొరికిపోయిన ఓటుకు నోటు దొంగ అని విమర్శించారు. అలాంటి కేసును బీజేపీ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డికీ, కేంద్రానికి సంబంధం లేకపోతే కేంద్ర సొలిసిటర్ జనరల్ ఈ కేసును ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఎన్డీఏ భాగస్వామిలా మారిపోయారని, ఆయన ఒక హైబ్రిడ్ ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. ఏనాటికైనా కాంగ్రెస్‌ను మళ్లీ కోలుకోకుండా చేసేది రేవంత్‌రెడ్డేనని కేటీఆర్ జోస్యం చెప్పారు. చివరకు రేవంత్‌రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమని అన్నారు. రేవంత్‌రెడ్డి అన్నట్టుగా తమకు ప్రతిపక్ష హోదా రాదని, ముమ్మాటికీ అధికార పక్ష హోదానే వస్తుందని ధీమా వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ పెద్దలకు మూటలు అందుతున్నాయన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆ మూటలను పట్టుకోవాల్సిన బాధ్యత కేంద్ర హోంమంత్రిది కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రానికి దమ్ముంటే తెలంగాణ నుంచి ఏఐసీసీకి వెళ్తున్న ప్రతి పైసాను పట్టుకోవాలని సవాల్ విసిరారు. తెలంగాణలో అమలవుతున్న ఆర్ఆర్ ట్యాక్స్ ఢిల్లీ పెద్దలకు చేరుతుంటే బీజేపీ నేతలు గాడిదలు కాస్తున్నారా? అని నిలదీశారు. తన సొంత నియోజకవర్గమైన వేములవాడలోని గుడి ‘దివ్య భారత్ సీమ్’లో చేరలేదన్న విషయం కూడా బండి సంజయ్‌కి తెలియకపోవడం విచారకరమని ఎద్దేవా చేశారు. అమృత్ పథకం నుంచి సింగరేణి వరకు ప్రతి విషయంలోనూ సామ్ జరుగుతుం టే, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కాంగ్రెస్ మం త్రులతో తిరుగుతున్నారని విమర్శించారు.
వరద ప్రవాహాన్ని తట్టుకొని నిలబడిన మేడిగడ్డ బరాజ్ ఎన్నికలకు కొన్ని నెలల ముందే ఎలా పేలుతది? రెండు పిల్లర్లు ఎలా కుంగుతాయి? ఇవన్నీ తేలాల్సిన అంశాలు. కాలమే వీటికి సమాధానం చెప్తుంది.
– కేటీఆర్
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ నైతిక మద్దతు ఇస్తున్నదని కేటీఆర్ ప్రకటించారు. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే, ఇప్పటిదాకా అమలు చేయకుండా కాంగ్రెస్ అడ్డుకుంటున్నదని ఆరోపించారు. క్యాబినెట్ సమావేశంలో డబ్బుల పంపిణీపై కాకుండా, ఆర్టీసీ సమ్మె వంటి ప్రజాసమస్యలపై చర్చించాలని సూచించారు. మ్యానిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీల గురించి, మంత్రి శ్రీధర్‌బాబును అడిగి తెలుసుకోవాలని హితవుపలికారు. మూడు బడ్జెట్లు పూర్తయినా మ్యానిఫెస్టోలో ఏం రాశారో తెలియకపోవడం విడ్డూరంగా ఉన్నదని వ్యాఖ్యానించారు. సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పొన్నాల , ఎమ్మెల్యేలు వివేకానంద, కాలేరు వెంకటేశ్, కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే బీరం, లీగల్ సెల్ సభ్యుడు కల్యాణ్‌రావు పాల్గొన్నారు.