KTR | ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య పార్టీ మారినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని.. వారిపై అనర్హత వేటు వేసేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నిరాకరించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా వెనకేసుకుని వస్తున్న రాహుల్ – రేవంత్ రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తూ అడుగడుగునా తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిపై వేటు వేయాల్సిన స్పీకర్ వ్యవస్థను రాజకీయ ఒత్తిళ్లతో భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ పార్టీ, తన దిగజారుడుతనాన్ని మరోసారి చాటిచెప్పిందన్నారు.
గతంలోనూ ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటుపడకుండా అడ్డుపడిన అప్రజాస్వామిక శక్తులే ఇవాళ కూడా రాజ్యాంగ విలువలకు నిలువునా పాతరేశాయని విమర్శించారు. పార్టీ మారినట్టు కళ్ళముందు కోటి సాక్ష్యాలు కనిపిస్తున్నా, ఆధారాలు లేవనడం పవిత్రమైన శాసనసభను కూడా అవమానించడమే అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగంపైనే కాదు, చివరికి అత్యున్నత న్యాయస్థానాలపైనా కూడా గౌరవం లేదని మరోసారి తేలిపోయిందని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలకు వెళ్లేందుకు అధికార పార్టీ వణికిపోతోందని ఇవాల్టి తీర్పు తేటతెల్లం చేస్తోందని అన్నారు.
గోడ దూకిన ఎమ్మెల్యేలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు విఫలయత్నం చేసినా ప్రయోజనం లేదని. వాళ్లంతా ప్రజాకోర్టులో ఎప్పుడో “మాజీ”లు అయిపోయారనే విషయాన్ని గుర్తించకపోవడం కాంగ్రెస్ పార్టీ మూర్ఖత్వానికి నిదర్శనమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజాతీర్పును అవమానించిన జంప్ జిలానీలకు, గడప గడపకు వెళ్లి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పిన ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పే దాకా BRS పోరాటం కొనసాగుతూనే ఉంటదని స్పష్టం చేశారు.