KTR | కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధికార మదం తలకెక్కిందని.. చంపేస్తాం అంటూ బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సర్పంచులకు నిధులు ఎమ్మెల్యేల దయాదాక్షిణ్యాలు కాదు.. రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఆయన స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకపోవడానికి ఎమ్మెల్యేలు ఎవరు? అవి వాళ్ళ ఇంటి సొత్తు కాదు.. వాళ్ళు ఏమన్నా సొంత ఆస్తులు అమ్మి కడుతున్నారా అని ప్రశ్నించారు.
ఖానాపూర్ నియోజకవర్గంలో ఇటీవల గెలిచిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులను హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ సత్కరించారు. స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన పలువురు సర్పంచ్లకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సొమ్ములు కాంగ్రెస్ ఎమ్మెల్యేల అబ్బ సొత్తు కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసి రిజర్వేషన్లను 17 శాతానికి తగ్గించిందని అన్నారు. కేంద్రం నుంచి వచ్చే రూ. 3,500 కోట్ల నిధుల కోసమే కాంగ్రెస్ హడావిడిగా ఎన్నికలు పెట్టిందని తెలిపారు. ఫైనాన్స్ కమిషన్ నిధుల్లో 70 శాతం నేరుగా గ్రామ పంచాయతీలకే వస్తాయని తెలిపారు. వాటిని ఆపే హక్కు, అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఖానాపూర్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానే అని తెలిపారు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సర్పంచ్ ఎన్నికల కోసం సీఎం ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్, కేసీఆర్ ఏనాడూ సర్పంచ్ ఎన్నికల ప్రచారం చేయలేదు.. రేవంత్ చేస్తున్నారని విమర్శించారు. విజయోత్సవాల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి గ్రామాల్లో పరోక్షంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ వచ్చాక గ్రామాలు సంక్షోభంలోకి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.