రెండేండ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టని ప్రభుత్వం హైడ్రాతో లక్ష ఇండ్లు కూల్చి పేదల పొట్టగొట్టింది. బఫర్‌జోన్‌లో ఉన్న పెద్దల ఇండ్లను వదిలి సామాన్యుల ఇండ్లపైకి బుల్డోజర్లను పంపి భయభ్రాంతులకు గురిచేస్తున్నది.
-కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తేతెలంగాణ): ‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటుతో దెబ్బకొడితేనే కాంగ్రెస్ దయ్యం దిగొస్తది. రేవంత్ సర్కారుకు ఆరు గ్యారెంటీలు గుర్తు కొస్తవి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నాలుగు లక్షల మంది పొరపాటు చేస్తే రాష్ట్రంలోని నాలుగుకోట్ల ప్రజలకు అన్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. 22 నెలల రేవంత్‌రెడ్డి పాలనలో లూటీలు, దందాలు, చందాలు తప్ప చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. పేదల ఇండ్లు కూల్చడం, కాల్చుకుతినడం, నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచడమే ఇందిరమ్మ పాలనా? అని ప్రశ్నించారు. నాడు ఓట్ల కోసం బీసీలకు 42 శాతం కోటా ఇస్తామని నమ్మించిన కాంగ్రెస్ నట్టేట ముంచిందని మండిపడ్డారు.
బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో చేతులెత్తేసిన ఆ పార్టీ నేతలు గల్లీలో పూటకో మాట, రోజుకో తీరుతో నాటకాన్ని రక్తికట్టిస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగ సవరణతోనే రిజర్వేషన్లు సాధ్యమనే విషయం రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్‌గాంధీకి తెలియదా? అని నిలదీశారు. పార్లమెంట్లో మౌనం వహించిన కాంగ్రెస్ ఎంపీలు మాయమాటలు చెప్తూ బీసీలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనానికి కేటీఆర్ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో పాలన పడకేసిందని విమర్శించారు.
రైతుల నుంచి మొదలుకొని ఇటు నిరుద్యోగుల వరకు అన్నివర్గాలు ఆందోళనలో ఉన్నాయని చెప్పారు. పాలనను గాలికొదిలేసిన ముఖ్యమంత్రి, మంత్రులు పంపకాల పంచాయితీల్లో మునిగితేలుతున్నారని ఆరోపించారు. నాడు ఉద్దెర హామీలిచ్చి ఇప్పుడు మాయమాటలతో నెట్టుకొస్తున్నారని దుయ్యబట్టారు. రెండేండ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టని ప్రభుత్వం లక్షల ఇండ్లు కూల్చి పేదల పొట్టగొట్టిందని మండిపడ్డారు. హైడ్రా పేరిట అరాచకాలకు దిగుతున్నదని ధ్వజమెత్తారు. బఫర్‌జోన్‌లో ఉన్న సీఎం అన్న తిరుపతిరెడ్డి, మంత్రులు పొంగులేటి, వివేక్, కేవీపీల ఇండ్లను వదిలిపెట్టి సామాన్యుల ఇండ్లపైకి బుల్డోజర్లను పంపి భయభ్రాంతులకు గురిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
గద్దెనెక్కగానే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని ప్రగల్భాలు పలికిన రేవంత్‌రెడ్డి, రెండేండ్లలో కనీసం ఆరేడు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని కేటీఆర్ గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి, రాతపరీక్ష పెట్టి, ఫలితాలు విడుదల చేస్తే కాగితాలు ఇచ్చిన రేవంత్‌రెడ్డి తన ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కేవలం ఏడువేల ఉద్యోగాలిచ్చిన కాంగ్రెస్ సర్కా రు నిస్సిగ్గుగా అరవై వేలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నదని మండిపడ్డారు. ఖాళీల భర్తీపై ముఖ్యమంత్రి, మంత్రులు పొంతనలేని లెక్కలు చెప్తూ నిరుద్యోగులను తప్పుదోవపట్టిస్తున్నారని దెప్పిపొడిచారు. జాబ్ క్యాలెండర్ ముచ్చట జాడలేకుండా పోయిందని ధ్వజమెత్తారు.
అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీ బస్సు తెచ్చిన సర్కారు బస్సు చార్జీలు, విద్యార్థుల బస్‌పాస్‌ల ధరలు పెంచి దండుకుంటున్నదని కేటీఆర్ ధ్వజమెత్తారు. మహిళలకు కుడిచేత్తో ఇచ్చి ఎడమ చేత్తో పురుషుల నుంచి గుంజుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే సిటీ బస్సు చార్జీలు బాదిన ప్రభుత్వం స్థానిక ఎన్నికలు ముగిసిన వెంటనే అన్ని బస్సుల చార్జీలు పెంచేందుకు కుట్రలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రూ. 4 వేల చొప్పున ముసలవ్వ, ముసలయ్యకు పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం రెండేండ్లు దాటినా ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. కల్యాణలక్ష్మి కింద రూ. లక్షతో పాటు తులం బంగారం ఇస్తామనే హామీకి అతీగతిలేకుండా పోయిందని మండిపడ్డారు. ‘కాంగ్రెస్ వాళ్లు తులం బంగారం ఇచ్చే వాళ్లు కాదు. మహిళల మెడల నుంచి ఉన్న బంగారాన్ని గుంజుకొనేవాళ్లు’ అంటూ సెటైర్ వేశారు. యువతులకు స్కూటీలు, విద్యార్థులకు క్రెడిట్ కార్డులు ఇస్తామని ఆశచూపి చేతులెత్తేశారని ధ్వజమెత్తారు.
నాడు ఓట్ల కోసం బీసీలకు 42 శాతం కోటా ఇస్తామని నమ్మించిన కాంగ్రెస్ నట్టేట ముంచింది. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో చేతులెత్తేసిన ఆ పార్టీ నేతలు గల్లీలో పూటకో మాట, రోజుకో తీరుతో నాటకాన్ని రక్తికట్టిస్తున్నారు. రాజ్యాంగ సవరణతోనే రిజర్వేషన్లు సాధ్యమనే విషయం రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్‌గాంధీకి తెలియదా?
-కేటీఆర్
జూబ్లీహిల్స్‌లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ బాకీ కార్డు చూపి ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని గల్లాపట్టి అడగాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. లూటీ చేసిన సొమ్మును పంచిపెట్టి, మాయమాటలతో మభ్యపెట్టి ఓట్లను కొల్లగొట్టేందుకు యత్నిస్తు న్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు ఇచ్చే రెండువేలో, మూడువేలో తీసుకొని బాకీపడ్డ నగదు ఎప్పుడిస్తరని ప్రశ్నించాలని సూచించారు. ప్రమాణం చేయమంటే చేతులు చాచి మనసులో తుపేల్.. తుపేల్ అనుకొని బయటకు మాత్రం వారు చెప్పినట్లు అనాలని కోరారు. ‘ముల్లును ముల్లుతోనే తీయాలి. మోసాన్ని మోసంతోనే జయించాలి. అలవికాని హామీలిచ్చి అరచేతిలో వైకుంఠం చూపిన మోసపూరిత కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాతపెట్టాలి. జూబ్లీహిల్స్‌లోని 4లక్షల మంది ఓటర్లకు రాష్ట్రంలోని 4 కోట్ల మంది భవిష్యత్తును నిర్ణయించే అవకాశం వచ్చింది. ఎట్టిపరిస్థితుల్లో వదులుకో వద్దు’ అని విజ్ఞప్తిచేశారు. ఏమాత్రం పొరపాటు చేసినా మరోమూడేండ్లు అష్టకష్టాలు పడాల్సి వస్తుందనే విషయాన్ని విస్మరించవద్దని ఉద్బోధించారు. కత్తి కాంగ్రెసోనికి ఇచ్చి యుద్ధం బీఆర్ఎస్ను చేయమంటే ఫలితముండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
బీసీలకు కాంట్రాక్టులు, మద్యం దుకాణాల కేటాయింపుల్లో 25 శాతం వాటా ఇస్తామని, విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం కోటా ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఘనమైన హామీలిచ్చిన ప్రభుత్వం ఆచరణలో విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. రెండు బడ్జెట్లు పెట్టినా రూ. 40 వేల కోట్లు ఎందుకివ్వలేదు? మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ పాటించలేదెందుకు? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఇప్పటికైనా ఈ సర్కారు కండ్లు తెరిపించాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటుతో తగిన బుద్ధిచెప్పాలని కోరారు. కారు గుర్తుకు ఓటేసి బుల్డోజర్ పార్టీకి బుద్ధిచెప్పాలని సూచించారు.
తమ ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి పైసలు ఇవ్వడంలేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నారని కేటీఆర్ గుర్తుచేశారు. ఇటీవల ముఖ్యమంత్రి జిల్లాకు చెందిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తాను పెండ్లిళ్లు, పేరంటాలు, చావులకు తప్ప తన నియోజవర్గంలోని ఊర్లకు వెళ్లడంలేదని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే గతంలో వరదలు వచ్చిన సందర్భాల్లో తమ ప్రభుత్వం దగ్గర నిధుల్లేవని ప్రపంచబ్యాంకు ఆదుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ప్రపంచ బ్యాంకుకు లేఖ రాశారని గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ నుంచి గెలుస్తానని, భారీగా నిధులు తెస్తానని ప్రగల్భాలు పలుకుతున్న నవీన్‌యాదవ్ చేసేదేముంటుందని ఎద్దేవా చేశారు. ప్రజలు ఆయన మాటలు నమ్మి మోసపోవద్దని, ఆయన గెలిస్తే వచ్చేది ఏమీ ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. నవీన్యాదవ్ను ఓడగొడితేనే కాంగ్రెస్ కండ్లు తెరిచి ఇచ్చిన హామీలపై దృష్టిపెడుతుందని చెప్పారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో ఉచిత కరెంట్, పెట్టుబడి సాయం, సాగునీరుతో సంతోషంగా ఉన్న రైతన్నలు రేవంత్ హయాంలో ఇబ్బందుల్లో కూరుకుపోయారని కేటీఆర్ విమర్శించారు. ‘పత్తి, ధాన్యం కొనుగోళ్లకు దిక్కులేదు. పంటల బోనస్ పత్తాలేదు. యూరియా బస్తా కోసం అన్నదాత అరిగోస పడాల్సిన దుస్థితి నెలకొన్నది’ అని తూర్పారబట్టారు. యూరియా కోసం మిర్యాలగూడకు చెందిన ఓ మహిళ క్యూలో నిలబడి ప్రాణాలు విడిచిన విషయాన్ని ప్రస్తావించారు. నాడు 24 గంటల కరెంట్‌తో వెలుగులు నిండిన తెలంగాణలో కాంగ్రెస్ రాగానే కరెంట్ కటకట మొదలైందని విమర్శించారు. కేసీఆర్ పాలనలో నాట్లప్పుడు రైతుల ఖాతాల్లో పడ్డ రైతుబంధు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఓట్లప్పుడు పడుతున్నదని ఎద్దేవా చేశారు. రైతుబంధు రూపంలో రూ. 73 వేల కోట్లు వేసిన ఘనత కేసీఆర్‌కు దక్కితే, రెండుసార్లు ఎగ్గొట్టిన ఘనత రేవంత్‌రెడ్డికి దక్కిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
గద్దెనెక్కగానే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన రేవంత్‌రెడ్డి, రెండేండ్లలో కనీసం ఆరేడు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. కేసీఆర్ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి, రాతపరీక్ష పెట్టి, ఫలితాలు విడుదల చేస్తే కాగితాలు ఇచ్చిన రేవంత్‌రెడ్డి తన ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కేవలం ఏడువేల ఉద్యోగాలిచ్చిన కాంగ్రెస్ సర్కా రు నిస్సిగ్గుగా అరవై వేలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నది.
-కేటీఆర్
కేసీఆర్ పదేండ్ల పాలనలోనే బీసీలకు సముచిత ప్రాధాన్యం దక్కిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఎందరో బీసీ బిడ్డలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా అవకాశమిచ్చారని గుర్తుచేశారు. బల హీనవర్గాల రిజర్వేషన్లు పెంచాలని అసెంబ్లీలో రెండుసార్లు బిల్లుపెట్టి పార్లమెంట్‌కు పంపించారని పేర్కొన్నారు. కానీ మోదీ ప్రభుత్వం పక్కనబెట్టిందని ఆరోపించారు. బీసీలతో పాటు మహిళలను రాజకీయ, ఆర్థికంగా ఎంతగానో ప్రోత్సహించారని చెప్పారు. బలహీనవర్గాల నాయకులు ఆలోచించాలని, కాంగ్రెస్ చేసిన మోసాలు, కేసీఆర్ చేసిన మంచి పనులను బేరీజు వేసుకొని ఉప ఎన్నికలో తగిన తీర్పు ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తిచేశారు.