KTR | హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తేతెలంగాణ): మోసం చేసిన కాంగ్రెస్‌పై తిరుగుబాటు తప్పదని, ప్రజలు నిలదీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో ఖమ్మం జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
కార్యక్రమానికి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్, పార్టీ నాయకులు ఆర్జేసీ కృష్ణ, బొమ్మర రామ్మూర్తి, కూరాకుల నాగబాబు, కర్నాటి కృష్ణ, పగడాల నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బర్త్‌డే ఫంక్షన్లు, పనికిరాని పనులకు వెళ్లేందుకు హెలికాప్టర్లను వినియోగిస్తున్న మంత్రులు, ఖమ్మం వరదలప్పుడు మాత్రం బాధితుల కోసం పంపకుండా చేతులెత్తేశారని మండిపడ్డారు.
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం, చేతగానితనానికి ఓ నిరుపేద కుటుంబం బలైందని గుర్తుచేశారు. ఖమ్మంలో డిప్యూటీ సీఎంతో పాటు ఇద్దరు మంత్రులున్నా చేసిందేమీలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి సైతం వరద ప్రభావిత ప్రాంతాల్లో చేతులు ఊపుకొంటూ పర్యటించారు తప్ప చేసిందేమీలేదని ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖమ్మం జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిందని, కొన్ని రాజకీయ సమీకరణాల కారణంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నష్టం జరిగిందని చెప్పారు.
ఇప్పుడు అక్కడి ప్రజలు పువ్వాడ అజయ్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, వరదల సమయంలో ఆయనే ప్రజలకు అన్నివిధాలా అండగా ఉన్నారని గుర్తుచేశారు. కష్టకాలంలో ఉన్న ప్రజలను బీఆర్ఎస్ ఎప్పుడూ ఆదుకుంటుందని చెప్పారు. గతంలో భూపాలపల్లిలో వరదలు వచ్చిన సమయంలో నాలుగు హెలికాప్టర్లు పంపించి ప్రజలను కాపాడుకున్నామని పేర్కొన్నారు.
14 నెలల కాంగ్రెస్ పాలనలో అన్నివర్గాలు దగాపడ్డాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని, బడ్జెట్లో లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించి సబ్‌ప్లాన్ అమలు చేస్తామని నమ్మబలికి నట్టేట ముంచిందని ధ్వజమెత్తారు. కాలేజీ పిల్లలు స్కూటీల కోసం పోస్ట్‌కార్డుల ఉద్యమాన్ని మొదలుపెట్టారని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకుంటే ఎంతో నష్టపోయామనే భావనలో తెలంగాణ ప్రజలు ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంతో పాటు, తెలంగాణలో ప్రతి పనికి సంబంధించిన కాంట్రాక్టులు ఖమ్మం జిల్లా మంత్రికే దక్కుతున్నాయని విమర్శించారు. కాంట్రాక్ట్ మంత్రి కమీషన్ల కోసమే ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని దెప్పిపొడిచారు.
డిప్యూటీ సీఎం కూడా 30 శాతం కమీషన్లు తీసుకొని పనిచేస్తున్నారని వారి పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నారని, ముఖ్యమంత్రి రుణమాఫీ అయిందని అంటుంటే, వ్యవసాయ మంత్రి కాలేదంటున్నారని, ఎవరి మాటలు నమ్మాలో తెలియక రైతులు తలలు పట్టుకొనే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. పోలీసులను అడ్డంపెట్టుకొని సర్పంచ్ ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు ముగ్గురు మంత్రులు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. వారి ఆటలను సాగనివ్వబోమని హెచ్చరించారు.