KTR | కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పరిస్థితి ఎంత దారుణంగా దిగజారిందో ఈ ఒక్క ఘటననే చూస్తే అర్థమవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బతికున్నప్పుడు అండ దొరకలేదు.. చనిపోయిన తర్వాత కనీస గౌరవం కూడా దక్కని పరిస్థితికి తెలంగాణను తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు.
కేసీఆర్ పాలనలో పేదవాడి ఆఖరి ప్రయాణం కూడా గౌరవంగా సాగాలనే ఆలోచనతో ప్రత్యేకంగా పార్థివ దేహాల తరలింపు వాహనాలను ఏర్పాటు చేశారు అని కేటీఆర్ గుర్తుచేశారు. అది మానవత్వం.. అది ప్రజల గౌరవాన్ని కాపాడే సంకల్పం అని తెలిపారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ పాలనలో కుటుంబ సభ్యులే మృతదేహాలను భుజాలపై మోసుకెళ్లాల్సిన దుస్థితి రావడం బాధాకరం మాత్రమే కాదు.. తెలంగాణ ఆత్మగౌరవానికే మచ్చ అని విమర్శించారు.
ప్రచారాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసే ప్రభుత్వం.. పోస్టర్లు, సభలు, యాత్రలు, హెలికాప్టర్ల కోసం ప్రజల డబ్బు వెచ్చించే ప్రభుత్వం.. అదే ప్రజలకు అవసరమైన కనీస అత్యవసర సేవలు అందించలేకపోవడం సిగ్గుచేటు కాదా అని ప్రశ్నించారు. రాజకీయ ప్రతీకారాలు.. విమర్శలు.. ప్రచార హడావుడి.. ఇవే తప్ప ప్రజల కష్టాలు కనిపించడం లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి అని ప్రశ్నించారు.
తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలబెట్టిన నాయకుడు కేసీఆర్.. ప్రతి పేద కుటుంబం గౌరవంగా జీవించాలని పాలన నడిపించారని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలు మళ్లీ అవస్థల తెలంగాణను చూస్తున్నారని అన్నారు. ఇదేనా కాంగ్రెస్ చెప్పిన “మార్పు”..? ఇదేనా ప్రజలకు ఇచ్చిన హామీల ఫలితం..? తెలంగాణ ప్రజల గౌరవాన్ని వీధుల్లో మోసుకెళ్లడానికేనా ఈ ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది ప్రజలు..? అని నిలదీశారు
మీ అధినేతల జోడో యాత్రలకు జోరుగా బస్సులు ఇవ్వొచ్చు.. వారి ఎన్నికల ప్రచారాలకు ప్రభుత్వ వనరులు వినియోగించొచ్చు.. మంత్రులు చీటికిమాటికి గాలిమోటార్లు ఎక్కొచ్చు.. కానీ పేదోడు జీవితం ముగిసిన తర్వాత కూడా గౌరవంగా చివరి ప్రయాణం చేసే హక్కు ఉండకూడదా అని మండిపడ్డారు. ఇది కేవలం ఒక కుటుంబం బాధ కాదు.. ఇది తెలంగాణ సమాజాన్ని కలచివేసే విషాదం అని ఆవేదన వ్యక్తం చేశారు.