KTR | రైతులకు యూరియా సరఫరా చేసే విషయంలో ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న మొబైల్ అప్లికేషన్ విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. రైతుల అవసరాలకు తగ్గట్లుగా యూరియా సంచులను సరఫరా చేయలేక, ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారా ఇస్తామని రైతులను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. తాండూరు నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచులు మరియు వార్డు సభ్యులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఒకప్పుడు నేరుగా దుకాణాల వద్దకే వెళ్లిన రైతులకు ఎరువులు అందించలేని ఈ చేతగాని ప్రభుత్వం, ఇప్పుడు యాప్ ద్వారా ఇస్తామంటే ఎవరూ నమ్మరని ఎద్దేవా చేశారు. ఎరువుల కోసం రైతులు పడుతున్న కష్టాలు, వారి లైన్లు బయటి ప్రపంచానికి కనిపించకుండా దాచిపెట్టేందుకే ఈ ‘మొబైల్ యాప్ నాటకాన్ని’ కాంగ్రెస్ మొదలుపెట్టిందని ఆయన ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల పాటు ఎరువుల కోసం రైతులు ఎప్పుడూ క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి లేదని కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస ప్రణాళికా జ్ఞానం లేకపోవడం వల్లనే నేడు రాష్ట్రంలో యూరియా కష్టాలు మొదలయ్యాయని ఆయన అన్నారు. “కేసీఆర్కు రైతులపై ఉన్నట్లుగా గుండెల్లో ప్రేమ ఉంటే, రైతన్నలకు ఈ సమస్యలు వచ్చేవి కావు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ ప్రేమ, చిత్తశుద్ధి రెండూ లేవు” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం ‘లైన్లను దాచే’ ప్రయత్నాలు పక్కనబెట్టి, అసలు సమస్యపై దృష్టి సారించాలని కేటీఆర్ హితవు పలికారు. రైతన్నలకు తక్షణమే అవసరమైన మేర యూరియాను సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు సమస్యలు సృష్టించడం మానేసి, చిత్తశుద్ధితో వారి సంక్షేమం కోసం పనిచేయాలని కోరారు.