KTR | హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ‘పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) పదవా? పార్లమెంట్లో ఓ నీతి.. అసెంబ్లీలో మరోనీతా?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ‘ఫిరాయింపు ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవా? సిగ్గు…సిగ్గు..’ అని ప్రభుత్వ తీరును ఎద్దేవా చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఇదేం దుర్మార్గం? అని సోమవారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ హోదాను, పార్టీ మారిన ఎమ్మెల్యేకు కట్టబెట్టడం ఎకడి సంసృతి ? అని నిలదీశారు. ‘గీత దాటిన కాంగ్రెస్ ప్రభుత్వం, రాజ్యాంగాన్ని పూర్తిగా కాలరాస్తుననది. సంప్రదాయాలను మంటగలుపుతున్నది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది. పార్లమెంట్లో పీఏసీ చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేసీ వేణుగోపాల్‌కు కట్టబెట్టిన విషయం మరిచారా? దేశ అత్యున్నత చట్టసభలో ఒక న్యాయం? రాష్ట్ర అత్యున్నత చట్టసభలో మాత్రం అన్యాయమా?’ అని నిప్పులు చెరిగారు.
చిరుద్యోగుల వేతనాలు విడుదల చేయాలి
నాగర్ కర్నూలు జిల్లాలోని బిజినేపల్లి మండలం అల్లీపూర్ పంచాయతీ ఉద్యోగి 7 నెలలుగా జీతాలు రాక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించటం బాధాకరమని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకటో తేదీనే వేతనాలు అని ఊదరగొట్టిన కాంగ్రెస్ సర్కార్ దీనికి ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. గత నెలలో సూర్యాపేట ప్రభుత్వ వైద్యశాలలో డాటా ఎంట్రీ ఆపరేటర్ వసీం 3 నెలలుగా జీతాల్లేక ఆత్మహత్య చేసుకోవటం, ఆరు నెలలుగా వేతనాలు లేవని ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద గేట్ ఆపరేటర్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కాళ్లపై పడటం వంటి వరుస సంఘటనలు కాంగ్రెస్ సర్కార్ వైఫల్యానికి పరాకాష్ట అని విమర్శించారు. ఇప్పటికైనా బకాయిపడిన వేతనాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
2014-2016 మధ్యకాలంలో 543 మంది సభ్యులు ఉన్న సభలో కేవలం 44 మంది సభ్యులున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన కేవీ థామస్‌ను పీఏసీ చైర్మన్‌గా నియమించారు. 2016-2019 వరకు కాంగ్రెస్ పార్టీకే చెందిన మల్లికార్జున ఖర్గే పీఏసీ చైర్మన్‌గా వ్యవహరించారు. 2019-2024 వరకు అదే పార్టీకి చెందిన అధిర్ రంజన్‌చౌదరి, తాజాగా 2024లో కేసీ వేణుగోపాల్ పీఏసీ చైర్మన్లుగా నియమితులయమ్యారు.