KTR | హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఈ ఏడాది 15.30 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గడంపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలోనే వ్యవసాయానికి ఎందుకింత గడ్డుకాలమని ‘ఎక్స్’లో ప్రశ్నించారు. కేసీఆర్ పదేండ్ల పాలన సాగుకు స్వర్ణయుగమైతే, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సాగు విస్తీర్ణం ఒకసారిగా ఎందుకు పడిపోయిందని నిలదీశారు. ఒక ఏడాదిలోనే 15.30 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గటం ఆగమైతున్న తెలంగాణ రైతు బతుకుకు తొలి ప్రమాద సంకేతమని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్ద కాలంలో దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణలో 8 నెలల్లోనే ఎందుకింత వ్యవసాయ సంక్షోభం ఏర్పడిందో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాల కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. సీఎం మాటలు కోటలు దాటుతు న్నా చేతలు మాత్రం సచివాలయం గేటు దాటడం లేదని మండిపడ్డారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకొనే విజన్ లేదు. రిజర్వాయర్లు నింపే ప్రణాళిక లేదు. చెరువులకు నీళ్లు మళ్లించే తెలివి లేదు. ఒక మాటలో చెప్పాలంటే.. కాంగ్రెస్ పాలనలో రైతు బతుకుకు భరోసానే లేదు’ అని పేర్కొన్నారు. నిన్న వ్యవసాయానికి కరెంట్ కట్ చేశారు. నేడు రుణమాఫీలో రైతుల సంఖ్య కట్ చేశారు. సాగయ్యే భూమి విస్తీర్ణాన్ని కూడా కట్ చేసే పరిస్థితి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ అని మభ్యపెట్టి.. పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టడం వల్లే రైతులకు ఈ అవస్థ ఏర్పడిందని ఆరోపించారు.