హనుమకొండ, నవంబరు 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీసీలకు 42% రిజర్వేషన్లని చెప్పి అధికారంలోకి వచ్చి పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్లో బీసీల కోటా 17 శాతానికే పరిమితం చేసిన ద్రోహి రేవంత్‌రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. దేశంలో బలహీన వర్గాలకు ఇంతకంటే అన్యాయం ఎన్నడూ, మరే ప్రభుత్వమూ చేయలేదని ధ్వజమెత్తారు. తెలంగాణను దోచుకుంటూ ప్రజలను రాచిరంపాన పెడుతున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధిచెప్పడానికి ఆనాటి దీక్షాదివస్ స్ఫూర్తితో.. త్యాగనిరతి, పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకొని మరో ఉద్యమం చేపడుదామని పిలుపునిచ్చారు.
నవంబర్ 29న నిర్వహించనున్న దీక్షా దివస్ సన్నాహాల్లో భాగంగా వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల బీఆర్ఎస్ కార్యాలయాల్లో బుధవారం జరిగిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడారు. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు వాటా ఇస్తానని, లక్ష కోట్ల బడ్జెట్ పెడతానన్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. అదే బీసీలను నమ్మించి తడిగుడ్డతో గొంతుకోసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకుంటున్నదని, ప్రజలపై, బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి వేధిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిందని నిరుత్సాహపడాల్సిన అవసరంలేదు. చీకటిని అనుభవిస్తేనే వెలుగు విలువ తెలుస్తది. కష్టపడితేనే సుఖం విలువ తెలుస్తది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా తన నిజస్వరూపాన్ని భయపెడుతున్నది. మన పిల్లలపై పోలీసులు కేసులు పెడుతున్నరు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజలకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. బాధపడేదిలేదు, భయపడేదిలేదు
-కేటీఆర్
ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజలకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేసులకు భయపడాల్సిన అవసరం లేదు. బాధపడేదిలేదని, భయపడేదీ లేదని కేటీఆర్ చెప్పా రు. ‘తెలంగాణ రాష్ట్ర సాధనకు పదహారేండ్ల క్రితం కేసీఆర్ తెగింపుతో ఇచ్చిన పిలుపుమేరకు ఆ రోజు దీక్షాదివస్ వచ్చింది. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని 2009 నవంబర్ 29న కేసీఆర్ కరీంనగర్లో బయలుదేరి సిద్దిపేటకు వెళ్లే క్రమంలో పోలీసులు అరెస్టు చేసి వరంగల్ మీదుగా ఖమ్మం జైలుకు తీసుకెళ్లడం ఇంకా నా మనసులో తిరుగుతున్నది’ అని వివరించారు. అంతకు ముందు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేదర్ చిత్రపటానికి కేటీఆర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ సర్కారు వేధింపులతో ఇబ్బందులు పడుతున్న బాధితులకు అండగా నిలుస్తున్న వరంగల్ న్యాయవాదుల బృందానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

‘తెలంగాణ ఉద్యమం గురించి ఈతరం పిల్లలకు తెలియదు. నా కొడుక్కు అప్పుడు ఎనిమిదేండ్లు. ఇప్పుడు 20 ఏండ్లు. ఇప్పటి వాళ్లకు అవన్నీ తెలియజెప్పాలె. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ దీక్ష, అమరుల త్యాగాలు, ముఖ్యంగా శ్రీకాంతాచారి అమరత్వం, విద్యార్థులు, ఉద్యోగులు, జర్నలిస్టుల పోరాట స్ఫూర్తిని తిరిగి మళ్లీ తలుచుకోవాలి’ అని కేటీఆర్ చెప్పారు. ఏటా నవంబర్ 29న దీక్షాదివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, వరంగల్‌లో ఇంకా గొప్పగా జరుగుతుందని, ఇక్కడ కవులు, కళాకారులు, రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులు, ఇతర సంఘాలను కలుపుకొని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు వినయ్‌భాస్కర్ 11 రోజులపాటు కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. మనకు రాష్ర్టాన్ని తెచ్చిపెట్టిన దీక్షను గుర్తు చేసుకోవాల్సిన, మహా నాయకుడు కేసీఆర్‌కు అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నదని తెలిపారు. అందరం ఒక్కసారి మళ్లీ గట్టిగా కదం తొక్కాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రతి అక్కా, చెల్లె చెప్తున్నరని తెలిపారు.
2009 నవంబర్ 29న కరీంనగర్ జిల్లా అల్గునూర్‌లో కేసీఆర్‌ను అరెస్టు చేసి కారులో లక్ష్మీకాంతారావు, నాయిని నర్సింహారెడ్డిని తీసుకెళ్తుండగా అక్కడికి చేరుకున్నాం. అక్కడి నుంచి జయశంకర్ సార్‌తో కేసీఆర్ వెంట వచ్చాం. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు రాస్తారోకో చేస్తుంటే నేను అక్కడ దిగిన. మీరు ఇంటికి వెళ్లండని జయశంకర్ సార్‌కు చెప్పిన. నేను ఇక్కడే ధర్నాలో కూర్చుంటే పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తుంటే హనుమకొండ చౌరస్తాలో పోలీస్ వ్యాన్‌లో నుంచి దుంకి జయశంకర్ సార్ ఇంటికి పోయి అక్కడ ఉన్నం. రెండు గంటల తర్వాత పోలీసులు వచ్చి మళ్లీ అరెస్టు చేసి ఇదే వరంగల్ గడ్డపైనే జైలులో పెట్టారు.
– కేటీఆర్
కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలోని అన్ని వర్గాలతోపాటు బీసీలను దారుణంగా మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. ‘కాంగ్రెస్ 2023 నవంబర్ 10న కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పెట్టింది. అందులో బీసీలకు 42% రిజర్వేషన్లు అని పెట్టింది. విద్య, ఉద్యోగాల్లో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో, రాజకీయ ప్రాతినిథ్యంలో 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని ప్రకటించింది. ఆరు నెలల్లోనే ఇస్తామని నమ్మబలికి బీసీల ఓట్లు వేయించుకొని గెలిచింది. ఆరు నెలలు కాదు.. రెండేండ్లు గడుస్తున్నది. 42% రిజర్వేషన్లు అని, దేశంలోనే ఎవరూ చేయని విధంగా కులగణన చేశామని, దానికి రూ.160 కోట్లు ఖర్చు చేశామని గొప్పగా చెప్పుకుంటున్నది. ఇంతచేసి కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిందేమీ లేదు. తీరా బీసీలకు 42 శాతమని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 17 శాతమే ఇచ్చి ధోకా చేసింది’ అని ధ్వజమెత్తారు.
జనగామలో ఉన్న మాస్ నాయకత్వం రాష్ట్రంలో ఎక్కడా లేదని, ఇక్కడ ముగ్గురు మాస్ లీడర్లు ఉన్నారని కేటీఆర్ తెలిపారు. ‘తాటికొండ రాజయ్య డప్పు కొడితే ఎలా ఉంటుందో మీకే తెలుసు, ఎర్రబెల్లి దయాకర్‌రావు సూటిగా గుండెను తాకేలా మాట్లాడతారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. కేసీఆర్ సార్ రైతుబంధు కమిటీ చైర్మన్ తీసుకోవాలని మరీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాలేజీ బిల్డింగ్‌లను కూలగొడతామని బెదిరించారు. నీకు ఎందుకు పంచాయితీ కడియం ద్రోహం చేసినట్టు నువ్వు కూడా చేయమని చెప్తే పల్లా నిజమైన విధేయతకు, విశ్వాసానికి మారుపేరుగా నిలిచారు. నాకు విశ్వాసం ఉన్నది. జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ మూడింటి సమాహారమే 12 మండలాలు, రెండు మున్సిపాలిటీలు. జనగామ జిల్లా 2001 నుంచి 2025 వరకు కేసీఆర్‌తోనే నడుస్తున్నది. మీకు స్ఫూర్తినిచ్చే ముగ్గురు నాయకులు, పార్టీ అండ, ప్రజాదీవెన ఉంటుంది. సర్పంచ్ ఎన్నికలే కాదు, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీలు ఏ ఎన్నికైనా ఎగిరేది బీఆర్ఎస్ జెండానే’ అని కేటీఆర్ తెలిపారు.

బీఆర్ఎస్ ఆఫీసు జిల్లాలో జనతా గ్యారేజీలా ప్రజల పక్షాన నిలబడి సమస్యలు పరిష్కరిస్తున్నదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ చెప్పారు. వరదల సమయంలో బాధితులకు పార్టీ అండగా నిలిచిందని, చిరు వ్యాపారులకు న్యాయవాదులు అండగా నిలిచారని తెలిపారు. పార్టీ కార్యాలయాలను కూల్చివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తే బీఆర్ఎస్ లీగల్‌సెల్ అండగా నిలిచిందని వివరించారు. ఉద్యమ నేతగా కేసీఆర్ న్యాయ, ధర్మ పోరాటం చేశారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ కొనియాడారు. తెలంగాణ మొత్తం కేసీఆర్ వెంట ఉండి గర్జించి తెలంగాణను సాధించిందని చెప్పారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులు, మహిళలకు ఎక్కడ చిన్న ఇబ్బందులు కలిగినా బీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పారు. ఆయా సమావేశాల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మంత్రులు సత్యవతి రాథోడ్, డీఎస్ రెడ్యానాయక్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, బానోతు శంకర్‌నాయక్, నన్నపునేని నరేందర్, మాజీ చైర్మన్లు ఎం సుధీర్‌కుమార్, సాంబారి సమ్మారావు, బడే నాగజ్యోతి, నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, కే వాసుదేవరెడ్డి, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, లలితాయాదవ్, పులి రజినీకాంత్ పాల్గొన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో బీసీల కోటా 17 శాతానికే పరిమితం చేసిన ద్రోహి రేవంత్‌రెడ్డి. జనగామ జిల్లా నర్మెట మండలంలో 17 గ్రామ పంచాయతీలు ఉంటే ఒక్కటే బీసీ రిజర్వేషన్ ఉన్నది. సిరిసిల్ల నియోజకవర్గం వీర్నపల్లి మండలంలో ఒక్కటీ బీసీ రిజర్వేషన్ ఇవ్వలేదు. మొత్తం తెలంగాణలోని 32 జిల్లాల్లో గతంలో 24 శాతం ఉంటే ఇప్పుడు 17 శాతం చేసి సీఎం రేవంత్‌రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు.
-కేటీఆర్
అధికారం, పదవుల కోసం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసే దమ్ము సీఎం రేవంత్‌రెడ్డికి ఉన్నదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లో ఏదో కిందా మీదా పడి దొంగ ఓట్లు వేయించి గెలిచారని వ్యాఖ్యానించారు. ‘ఇక్కడ ఒకాయన నీతులు, క్యారెక్టర్, కమిట్మెంట్, గాడిద గుడ్డు అంటూ రాజీనామా చేయకుండా పదవి పట్టుకుని గబ్బిలంలా వేలాడుతున్నాడు. నిజంగా నిజాయితీ ఉంటే, క్యారెక్టర్ ఉంటే, దమ్ముంటే రాజీనామా చేసి స్టేషన్ ఘన్‌పూర్‌కు రా? అని సవాల్ విసిరారు. ఇజ్జత్ మానం లేకుండా ఈ వయసులో ఆ దిక్కుమాలిన ఒక్క ఎమ్మెల్యే పదవి పట్టుకుని గబ్బిలం సూరు పట్టుకుని వేలాడినట్టు సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని కేటీఆర్ మండిపడ్డారు.
2009 నవంబర్ 30న రాత్రి దాదాపు విడుదల చేస్తే ఖమ్మంలో కేసీఆర్ ఉన్న దగ్గరికి వెళ్లాం. ఆ దీక్ష తర్వాత తెలంగాణ సమాజం, విద్యార్థులు, ఉద్యోగులు, జర్నలిస్టులు, ప్రజలు, ప్రతివర్గం కదలింది. తెలంగాణ మొత్తం కదనభూమి, యుద్ధభూమిని తలపించేలా ఎక్కడికక్కడ వీరోచితంగా కదిలింది. కేసీఆర్ దీక్ష ప్రారంభమై తెలంగాణ ప్రకటన వచ్చేవరకు 11 రోజులపాటు అద్భుతంగా, సముద్రంలా ఎగిసిపడింది. తుఫాన్ వాతావరణం సృష్టించింది.
– కేటీఆర్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓరుగల్లును అవమానిస్తున్నారని, ఓరుగల్లుకు ప్రతీకగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ రాజముద్ర నుంచి తీసేస్తున్నాడని, దీనికి ప్రతిగా ఇదే ఓరుగల్లు నుంచి ప్రతిఘటన మొదలవుతున్నదని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఘోరీ కట్టేదిశగా పోరాటం నడుస్తదని తెలిపారు. ఒక్క బీసీ వర్గాలకే కాదు తెలంగాణలోని సబ్బండవర్ణాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని ధ్వజమెత్తారు. ‘కేసీఆర్ స్ఫూర్తిని అందిపుచ్చుకుని సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ.. ఏ ఎన్నిక వచ్చినా కదంతొక్కుదాం. ఒక్కొక్క నాయకుడు, కార్యకర్త, సోదరి.. మరో కేసీఆర్ కావాలి’ అని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం కోసం 11 రోజులు అన్నాహారాలు మానేసి చావు నోట్లో తలపెట్టిన నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు ఎంతో అదృష్టవంతులమని, మన పార్టీ మనకు గర్వకారణమని చెప్పారు.