KTR | హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తేతెలంగాణ): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 500 రోజులైనా 420 హామీలు అమలు చేయలేదని, నమ్మి ఓటేసి అధికారమిచ్చిన ప్రజలను అరిగోసపెడుతున్నదని, ఇటు హైడ్రా కూల్చివేతలు, అటు మూసీ ముసుగులో అరాచకాలకు తెరలేపి అన్ని రంగాలను కుదేలు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. రేవంత్‌రెడ్డి గద్దెనెక్కినప్పటి నుంచి అన్నీ నెగెటివ్‌గా ఆలోచిస్తూ, పిచ్చి పనులు చేస్తూ కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫార్మాసిటీ రద్దు పేరిట నాటకాలడుతూ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, స్కిల్సిటీ ముసుగులో భూ దోపిడీకి తెరలేపారని విమర్శించారు. కేవలం తనకు భూములున్నాయనే కారణంతో టెండర్లు పూర్తయిన శేరిలింగంపల్లి మైండ్ స్పేస్ పార్కు మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో రైలును రద్దుచేయడం దుర్మార్గమని మండిపడ్డారు.
అత్తాపూర్ డివిజన్ కాంగ్రెస్ నేత శ్రీరామ్‌రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి సబిత, రాజేంద్రనగర్ పార్టీ ఇన్చార్జి పటోళ్ల కార్తీక్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు ఆదివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ మంచిపనులు చేసిన మహానేతల ఆనవాళ్లను ఎవరూ చెరిపేయలేరని స్పష్టంచేశారు. రాజశేఖర్‌రెడ్డి అంటే ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్, చంద్రబాబు పేరు చెప్తే ఐటీ గుర్తుకొస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అన్నదాతలకు రైతుబంధు, రైతుబీమా ఇంటింటికీ మంచినీళ్లు, వాడవాడలా ప్రకృతి వనాలు, 24 గంటల కరెంట్, బాలింతలకు కిట్లు లాంటి పథకాల పేర్లు వింటే కేసీఆర్ గుర్తుకువస్తారని తెలిపారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, మంచిపనులు చేసిన వాళ్లను ప్రజలు నాలుగు కాలాలపాటు గుర్తుంచుకుంటారని స్పష్టం చేశారు. కానీ కేసీఆర్ ఆనవాళ్లను తుడిపేస్తానన్న భ్రమలో సీఎం రేవంత్‌రెడ్డి రాజుల కాలం మాదిరిగా అనాగరిక చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రింగు రోడ్డు లోపల గులాబీ ప్రభంజనమే
‘రెండు వేల పింఛన్‌ను 4 వేలు.. రూ.10 వేల రైతుబంధును రూ.15 వేలు, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, ఆడబిడ్డలకు ప్రతినెలా రూ.2,500 ఇస్తామంటే నమ్మి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారు. కానీ రింగురోడ్డు లోపలవాళ్లేవరూ కాంగ్రెస్సోళ్ల మాటలను నమ్మలేదు. అందుకే వాళ్లకు ఒక్కసీటు కూడా ఇవ్వలేదు. బీజేపీ కూడా అడ్డిమారి గుడ్డిదెబ్బలా ఒక్క సీటే గెలించింది. బీఆర్ఎస్ మాత్రం ప్రభంజనం సృష్టించింది’ అని గుర్తుచేశారు.
ఢిల్లీ పెద్దలను తీసుకొచ్చి డిక్లరేషన్లు
‘కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు తమను ప్రజలు నమ్ముతలేరని ఢిల్లీ పెద్దలను తీసుకొచ్చి డిక్లరేషన్లు ఇప్పించిన్రు. ఖర్గేతో చేవెళ్లలో ఎస్సీ డిక్లరేషన్.. సిద్ధరామయ్యతో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్.. వరంగల్‌లో రాహుల్‌తో రైతు డిక్లరేషన్.. హైదరాబాద్‌లో ప్రియాంకతో యూత్ డిక్లరేషన్.. తుక్కుగూడలో సభపెట్టి సోనియాగాంధీతో మొత్తం మ్యానిఫెస్టో విడుదల చేయించిన్రు.. తమకు ఒక్క చాన్స్ ఇవ్వాలని ప్రాధేయ పడితే ప్రజలు ఓటేసిండ్రు. ఇప్పుడేమైంది? తినే పళ్లెంల మన్ను పోసుకున్నట్టయింది’ అని కేటీఆర్ వాపోయారు.
పేదల ఇండ్లపైకే హైడ్రా
‘కాంగ్రెస్ నాయకులు పేరుకు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నరు.. ఆస్తులు కాపాడేందుకే హైడ్రా తెచ్చినమంటున్నరు.. కానీ ఎఫ్టీఎల్లో ఉన్న పొంగులేటి, చెరువు నట్టనడిమిన కట్టిన పట్నం మహేందర్‌రెడ్డి.. బఫర్‌జోన్‌లో ఉన్న రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డి..చెరువు మీదున్న కేవీపీ రామచందర్‌రావు ఇండ్లను ముట్టుకోరు.. పేదోళ్ల ఇండ్లను మాత్రం రాత్రికిరాత్రే కూలగొడుతున్నరు’ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు.
ఒక్క ఇల్లు కట్టలే
‘కొత్తరేషన్ కార్డులు ఎప్పుడిస్తరు? ఒక్క ఇందిరమ్మ ఇల్లయినా కట్టిండ్రా అని ప్రశ్నిస్తే ఆహనా పెళ్లంట సినిమా తరహాలో అదిగో ఇదిగో అని ఊరిస్తున్నరు తప్ప వచ్చింది లేదు.. సచ్చిందిలేదు’ అని కేటీఆర్ దెప్పిపొడిచారు. దరఖాస్తుల మీద దరఖాస్తులు తీసుకుంటూ, ప్రజలను భ్రమల్లో ముంచి పబ్బం గడుపుకొంటున్నరని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు అని చెప్పి అరపైసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
అప్పుడు సర్పంచ్‌లకు అవార్డులు..
ఇప్పుడు అవమానాలుకేసీఆర్ పాలనలో అటు పల్లెలు, ఇటు పట్టణాల ప్రగతికి బాటలు వేశారని, ఊరూరా శ్మశానవాటికలు, డంప్‌యార్డులు, పల్లె ప్రకృతివనాలు, నర్సరీలు, పార్కులు నిర్మించారని కేటీఆర్ గుర్తుచేశారు. పట్టణాల్లో అండర్‌పాస్‌లు, హైవేలు, పెద్దపెద్ద రింగురోడ్లు వేశారని చెప్పారు. ఈ క్రమంలో దేశ జనాభాలో 3 శాతం ఉన్న తెలంగాణ 30 శాతం పంచాయతీ అవార్డులను గెలుచుకున్నదని తెలిపారు. నాడు అభివృద్ధి పనులు చేపట్టి అవార్డులు దక్కించుకకున్న సర్పంచులు ఇవ్వాళ కాంగ్రెస్ పాలనలో బిల్లులు రాక అవమానాలకు గురయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు.
గులాబీ జెండానే అండ..
బీఆర్ఎస్ ఓటమితో పార్టీ కంటే తెలంగాణ సమాజానికే ఎక్కువ నష్టం జరిగిందనేది అక్షర సత్యమని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన చారిత్రక అవసరం కనిపిస్తున్నదని చెప్పారు. గులాబీ జెండానే తమకు అండగా ఉంటుందనే విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైందన్నారు. ‘రైతుబంధు తేవడం.. ఇంటింటికీ నీళ్లివ్వడం..ప్రతి పంట పొలాన్ని తడపడం.. వృద్ధులకు రూ.2 వేల పింఛన్ ఇచ్చినందుకు కేసీఆర్ ముద్రలను చెరిపివేస్తారా?’ అని ప్రశ్నించారు.
మత పిచ్చిలేపడమే బీజేపీ పని
తెలంగాణలో ఇక తమదే అధికారమని ఎగిరెగిరి పడుతున్న బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని కేటీఆర్ తేల్చిచెప్పారు. మతిపిచ్చిలేపి ఓట్లు దండుకోవడమే బీజేపీ పని అని దుయ్యబట్టారు. ‘తెలంగాణకు చెందిన ఆ పార్టీ పెద్దనేత హిందువులు ప్రమాదంలో ఉన్నారని అంటున్నరు.. మరి 80 శాతం జనాభా ప్రమాదంలో చిక్కుకుంటే ప్రధాని మోదీ విఫలమైనట్టే కదా’ అని ప్రశ్నించారు.
రేవంత్, మోదీ పరస్పర సహకారం
సీఎం రేవంత్‌రెడ్డి, ప్రధాని మోదీ పరస్పరం సహకరించుకుంటూ బీఆర్ఎస్ను ఖతం పట్టించే కుట్రలకు తెరలేపారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కిందట తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించిన ప్రధాని మళ్లీ ఏడాది తర్వాత హెచ్‌సీయూ భూముల్లో కాంగ్రెస్ బుల్డోజర్లు దింపుతున్నదని చెప్పడం విడ్డూరంగా ఉన్నదన్నారు. ‘అమృత్ స్కాంలో రేవంత్ బావమరిది రూ.1137 కోట్ల ప్రజాధనానికి ఎసరు పెట్టారని ఆధారాలు సమర్పించినా, రెవెన్యూ మంత్రి పొంగులేటి ఇంటిపై ఈడీ రైడ్స్ చేసినా ఎందుకు విచారణకు ఆదేశించడంలేదని నిలదీశారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్‌కు ఈడీ కేసుల్లో చార్జిషీట్లు దాఖలైనా రేవంత్ బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదని.. ఇదే బడేభాయ్.. చోటే భాయ్ దృఢమైన బంధానికి నిలువెత్తు నిదర్శనమని విమర్శించారు.
ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్దే విజయం
రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీని ప్రజలు బొందపెట్టడం ఖాయమని హెచ్చరించారు.
కాంగ్రెస్ గుండెలదిరేలా కదలాలె
ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఇంటి పార్టీ పండుగకు కాంగ్రెస్ గుండెలదిరేలా గులాబీ దండు కదలాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పోచమ్మ, ఎల్లమ్మ బోనాల తరహాలో బస్తీలు, కాలనీల్లో జెండా గద్దెలను ముస్తాబు చేయాలని, లేని చోట్ల నిర్మించుకోవాలని, అవసరమున్నచోట మరమ్మతులు చేయించుకోవాలని కోరారు. ఆదివారం తెల్లారే తయారై..జెండాలను ఎగరేసి..గులాబీ కండువాలను మెడలో వేసుకొని బస్సుల్లో బయల్దేరి ఎల్కతుర్తికి రావాలని సూచించారు. సమయానికి సభా ప్రాంగణానికి చేరుకోవాలని చెప్పారు. నాయకులు ముందుండి కార్యకర్తలతో కలిసి బస్సుల్లో వెళ్లాలని కోరారు. రజతోత్సవ పాట సీడీ ఆవిష్కరణ
‘సమర శంఖ గర్జన గెరిల్లా-ఉద్యమాల ఖిల్లా ఓరుగల్లు జిల్లా’ పేరుతో బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాలకు సంబంధించిన పాట సీడీని తెలంగాణ భవన్లో కేటీఆర్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ పాటను చాలా బాగా రూపొందించారని ప్రశంసించారు. పాటలో కాంగ్రెస్ వైఫల్యాలను చక్కగా ఎండగడుతూనే.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో సారి తెలంగాణ సీఎం కావాలని ప్రతి తెలంగాణ బిడ్డ గుండెల్లో ఆశ ఉన్నదనే భావనను గాఢంగా ప్రతిబింబించాయని కొనియాడారు. గ్రేటర్ వరంగల్ మాజీ కార్పొరేటర్, పార్టీ నేత జోరిక రమేశ్ ఆధ్వర్యంలో ఈ పాటను రూపొందించారు. సహకరించిన ఓరుగల్లు బీఆర్ఎస్ నేత, సాహిత్యం అందించిన ఫీనిక్స్, గాయని జేరిపోతుల సంధ్య, సత్యంను కేటీఆర్ అభినందించారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా నేతలు పులి రజనీకాంత్, పొలపల్లి రామ్మూర్తి, బీఆర్ఎస్వీ హనుమకొండ జిల్లా కో ఆర్డినేటర్ గండ్రకోట రాకేశ్ యాదవ్, పార్టీ యువజన నాయకుడు బొల్లెపల్లి కమల్ కుమార్ పాల్గొన్నారు.
మూసీ పేరిట లూటీ
రైతుబంధు, విద్యార్థులకు స్కూటీలు, స్కాలర్షిప్లు, వృద్ధులకు పింఛన్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చేందుకు పైసల్లేవని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పునరుద్ధరణకు మాత్రం రూ. 1.50 లక్షల కోట్లు వెచ్చిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉన్నదని కేటీఆర్ దెప్పిపొడిచారు. మూసీ మురుగు ముసుగులో ప్రజాధనాన్ని దోపిడీ చేసేందుకు సుందరీకరణ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని విమర్శించారు. ‘మూసీతో మురిసే రైతులెందరు? పెరిగే ఆయకట్టు ఎంత? వచ్చే ఉద్యోగాలెన్ని? అని అడిగితే సమాధానం చెప్పడంలేదు.. మింగ మెతుకులేదు..మీసాలకు సంపెంగ నూనె అన్న చందంగా సోకుల కోసం ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తున్నరు’ అని దుయ్యబట్టారు.
ఫిబ్రవరిలో 31 రాదు.. రుణమాఫీ కాదు!
రైతుబంధు ఇవ్వాలని, రుణమాఫీ చేయాలని రైతులు ధర్నాలు చేస్తున్నా రేవంత్‌రెడ్డి చెవికెక్కడంలేదు. నవాబ్‌పేటలో ధర్నా చేస్తున్న సామాన్య రైతు దగ్గరికి మా సబితమ్మ వెళ్లి అడిగితే, రేవంత్‌రెడ్డి తప్పక రుణమాఫీ చేస్తడమ్మా అన్నడు. ఎన్నడు? అని ప్రశ్నిస్తే ఫిబ్రవరి 31న అన్నడు. అంటే ఆయన చెప్పినట్టు ఫిబ్రవరిలో 31వ తేదీ రాదు..రుణమాఫీ అమలుకాదు. అంటే సామాన్య రైతులకు కూడా ఇది వట్టి దగాకోరు ప్రభుత్వమనే విషయం అర్థమైంది. – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్