హైదరాబాద్, జూన్ 7(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డికి హిట్లర్ ఆదర్శమని.. అందుకే హంతకముఠా లాంటి ‘హైడ్రా’ను తెచ్చి అంతులేని అరాచం సృష్టిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తలకెక్కిన అధికారమదంతో విర్రవీగిన హిట్లర్‌కు ఆనాడు ఏ గతి పట్టిందో.. నేడు నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల చేతిలో రేవంత్‌రెడ్డి పాలనకు అదే గతిపట్టడం ఖాయమని హెచ్చరించారు. బీఆర్ఎస్ పాలన రాజ్యాంగ స్ఫూర్తి, మానవతాదృక్పథంతో సాగిందని, హిట్లర్‌లాంటి నియంత చర్యలతో కాదని ఆదివారం ఎక్స్‌వేదికగా ఉద్ఘాటించారు. బెంగళూరు వేదికగా ‘ది హిందూ’ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వివాదాస్పద, విచిత్ర వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం ఏర్పాటు చేసిన హైడ్రాకు, దాని పనితీరుకు జర్మనీ నియంత ఆడాల్ఫ్ హిట్లర్ చర్యేలే స్ఫూర్తి అని ముఖ్యమంత్రి బహిరంగంగా ఒప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. రెండున్నరేండ్ల పాలన తర్వాత రేవంత్‌రెడ్డి నిరంకుశ, ఫాసిస్ట్ మనస్తత్వం దేశం మొత్తానికి అర్థమైందని ఎద్దేవా చేశారు. సీఎంకు అత్యంత క్రూరుడైన నియంత ఆదర్శమైతే తమకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, జాతిపిత మహాత్మాగాంధీ, తెలంగాణ ఉద్యమ పితామహుడు జయశంకర్ సార్ ఆదర్శమని స్పష్టంచేశారు.
కోట్ల మందిని చంపిన క్రూరుడే నీకు రోల్ మోడలా?
కోట్లాది మందిని ఊచకోత కోసిన క్రూరుడు, నరరూప రాక్షసుడైన హిట్లర్ నీకు రోల్ మోడలా? అని కేటీఆర్ నిలదీశారు. ‘సమస్త మానవజాతి చరిత్రలో అతిపెద్ద నరమేధం సృష్టించిన హిట్లర్ నీకు ఆదర్శమని చెప్పడానికి నోరెలా వచ్చింది? అని ప్రశ్నించారు. మొన్న ప్రజాపాలన అని, నిన్న ఇందిరమ్మ పాలన అని గొప్పలు చెప్పుకొన్న ఆయన తనది హిట్లర్ పాలన అని ఒప్పుకోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. 30 నెలల మీ రాక్షసపాలన ఆనవాళ్లు హిట్లర్ అరాచకాన్ని తలపించాయని, ఇవి యుద్ధం మిగిల్చే విషాదాలను మించిపోయానని ఆవేదన వ్యక్తంచేశారు.
తెలియని వికాసం.. విధ్వంసమే విధానం
హైడ్రా నుంచి మూసీ వరకు, లగచర్ల నుంచి వెలుగుమట్ల దాకా పేదలపై విరుచుకుపడిన బుల్డోజర్లు ‘నయా నాజీ’ పాలనకు నిజమైన సాక్ష్యాలని కేటీఆర్ అభివర్ణించారు. పదేండ్లు అభివృద్ధి పథంలో పరుగెత్తి.. సంక్షేమ పరవళ్లతో కదంతొక్కి సంతోషంగా ఉన్న తెలంగాణను సంక్షోభాల పాతాళంలోకి నెట్టిన నాడు కాంగ్రెస్ సర్కార్ నియంత పోకడలు బయటపడ్డాయని దెప్పిపొడిచారు. ‘రేవంత్‌రెడ్డి.. విధ్వంసమే నా విధానమని.. వికాసం అంటే తనకు తెలియదని ఇంత నిర్లజ్జగా ఒప్పుకొన్న నువ్వు.. ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉండటం రాజ్యాంగ వ్యవస్థకే అత్యంత ప్రమాదకరం.. ప్రజాస్వామ్య దేశంలో ఒక నియంతను కీర్తించే దుర్మార్గమైన మనస్తత్వం స్వతంత్ర భారతావనిలోనే ఓ చీకటి అధ్యాయం’ అని మండిపడ్డారు.
నియంతలకు నూకలు చెల్లినట్టే..
ఈ వీరోచిత పోరాటాల పురిటిగడ్డ తెలంగాణలో ఎందరో నియంతలకు నూకలు చెల్లాయని స్పష్టంచేశారు. ఊరూరా ఎత్తిన ఉక్కు పిడికిళ్లు తెలంగాణ వ్యతిరేకులను పొలిమేరల దాకా తరిమికొట్టాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ సర్కార్ హింసాత్మక, కూల్చివేతల ధోరణిని తప్పుబట్టారు. బీఆర్ఎస్ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నదని స్పష్టంచేశారు. ‘ముఖ్యమంత్రి మార్కు హిట్లర్ తెలివితేటలకు మాకు (బీఆర్ఎస్ నేతలు) లేవు.. రేవంత్‌రెడ్డి లాంటి నియంతృత్వ ఆలోచనలు చేసేంత తెలివైన వాళ్లం కాదు’అని వ్యంగంగా వ్యాఖ్యానించారు. అందుకే తమ పదేండ్ల పరిపాలనను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగస్ఫూర్తితో, మహాత్ముడు చూపిన అహింసా మార్గంలో, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలలుగన్న ఆశయాల ప్రాతిపదికన నడిపించామని పునరుద్ఘాటించారు..
రేవంత్ వ్యాఖ్యలను హైకమాండ్ సమర్థిస్తుందా?
ప్రజాస్వామ్య దేశంలో ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత క్రూరుడైన నియంత హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నానని ప్రకటించడాన్ని కాంగ్రెస్ హైకమాండ్ సమర్థిస్తుందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. పేదలు, మధ్యతరగతి ప్రజల ఇండ్లను కూల్చడమే ధ్యేయంగా పెట్టుకున్న రేవంత్‌రెడ్డి నియంతృత్వ పోకడలపై తెలంగాణ సమాజం తిరుగబడే
రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. హిట్లర్ వారసుడి చేతిలో చిక్కిన తెలంగాణను కాపాడుకొనేందుకు ఈ గులాబీ జెండా నేతృత్వంలో ‘హిట్లర్ హఠావో.. తెలంగాణ బచావో’ పోరాటం తప్పదని హెచ్చరించారు