హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): బీజేపీ పాలిత మహారాష్ట్రలో మొదటి మూడు నెలల్లోనే 767 మంది రైతులు మరణించడం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి మూడు గంటలకు ఒక రైతు బలవన్మరణానికి పాల్పడటం జాతీయ అవమానకరమని శనివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ అఘాయిత్యాలపై ప్రతి భారతీయ పౌరుడు స్పందించాలని కోరారు. నేడు భారతదేశానికి కావాల్సింది అధునాతన కృత్రిమ మేధస్సు కాదని, వ్యవసాయ వ్యవస్థపై మెరుగైన అవగాహన అని తెలిపారు.
డబుల్ ఇంజిన్ సర్కారు పేరిట గప్పాలు చెప్తే ఫలితాలు రావని పరోక్షంగా ప్రధాని మోదీ తీరును తప్పుబట్టారు. ‘వ్వవసాయానికి సహాయపడే రైతు బంధు లాంటి పెట్టుబడి సాయం, పంటలు దెబ్బతిన్న వేళ అక్కరకొచ్చే పంటల బీమా, మరణించిన రైతుల కుటుంబాలకు అండగా నిలిచే రైతుబీమా, ఎండిపోయి నోర్లు తెరిచిన బీడు భూములను ఏడాది పొడవునా తడిపేందుకు కాళేశ్వరం లాంటి నీటిపారుదల ప్రాజెక్టులు, పంట ఉత్పత్తులను మద్దతు ధరతో సేకరించేలా అద్భుతమైన నెట్వర్క్.. వెరసి కేసీఆర్ సాగు నమూనా.. వ్యవసాయంపై ఆధారపడ్డ దేశానికి అవసరం’ అని వ్యాఖ్యానించారు. అంతకు మంచి రైతులకు సహాయం చేయాలనే అంకితభావం, అవగాహన, అభిరుచి అవసరమని నొక్కిచెప్పారు.