రుణమాఫీ అరకొరగా చేశారు. రైతుభరోసా రాలేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిగ్గా నడవడం లేదు. బోనస్ ఇవ్వకుండా రైతులను దగా చేశారు. ఏం సాధించారని విజయోత్సవాలు చేస్తున్నారు? విజయోత్సవాల పేరిట రైతులను అవమానిస్తున్నారు. రైతుల గొంతుకగా అసెంబ్లీ, మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం.
-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
KTR | హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రజా సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో గళమెత్తుతామని, ప్రభుత్వాన్ని అన్ని అంశాల్లో నిలదీస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో ప్రజల గొంతుకగా ప్రజావాణిని బలంగా వినిపిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా వ్యవసాయరంగానికి చేస్తున్న అన్యాయాలపై నిలదీస్తామని తెలిపారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తి కొట్లాడాలని పార్టీ అధినేత కేసీఆర్ తమకు దిశానిర్దేశం చేశారని వెల్లడించారు. బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో అన్ని అంశాలపై మూడు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించామని పేర్కొన్నారు. ఎర్రవెల్లిలోని నివాసంలో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యవసాయ రంగంలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని, ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అన్ని హామీలను, గ్యారెంటీలను అమలుచేయడంలో విఫలమైన తీరును అసెంబ్లీ సాక్షిగా ఎండగడతామని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, గిరిజనులకు ఇచ్చిన డిక్లరేషన్లపై కూడా ప్రభుత్వం తీరును ప్రశ్నిస్తామని స్పష్టంచేశారు.
గురుకులాల్లో అధ్వాన్న పరిస్థితులు
రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో అధ్వాన్న పరిస్థితులు ఉన్నాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘గతంలో గురుకులాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అద్భుతంగా తయారుచేసి నిర్వహించింది. గురుకుల వ్యవస్థను రేవంత్ సర్కారు సంక్షోభంలోకి నెట్టింది. గురుకుల బాట కార్యక్రమం ద్వారా బీఆర్ఎస్వీ గురుకులాలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ కేసీఆర్‌కు నివేదిక ఇచ్చింది. గురుకులాలపై మాజీ మంత్రులు సబిత, జగదీశ్‌రెడ్డి కూడా సలహాలు సూచనలు అందించారు. గురుకులాలను సంసారవంతంగా నడిపేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కేసీఆర్ సూచించారు. గురుకులాల్లో పరిస్థితులను కండ్లకు కట్టినట్టు ప్రభుత్వం దృష్టికి తేవాలని ఆదేశించారు. గురుకులాల భవిష్యత్‌పై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
సర్కారు దౌర్జన్యకాండ
రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి దౌర్జన్యకాండ సాగిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం 14 వేల ఎకరాల భూములను సేకరించి పరిశ్రమల స్థాపనకు అన్ని సిద్ధంగా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం 20 చోట్ల ఫార్మా విలేజ్ల పేరుతో పేద రైతుల భూములను గుంజుకుంటున్నదని దుయ్యబట్టారు. ‘కొడంగల్, సంగారెడ్డి, లగచర్ల వంటి ప్రాంతాల్లో దళిత, గిరిజన రైతులపై ప్రభుత్వం రాత్రివేళల్లో పోలీసులతో దాడులు చేయిస్తున్నది. కేసులు పెట్టి, నిర్బంధించి రైతుల భూములు లాకుంటున్నది. ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఫార్మాసిటీ కోసం ఇప్పటికే 14 వేల ఎకరాలు సేకరించి పెట్టాం. ఫార్మాసిటీ ఉంటుందని హైకోర్టుకు చెప్పారు. మళ్లీ 20 ఫార్మా విలేజ్‌లకు ఎందుకు తెరలేపారు? దళిత, గిరిజన, చిన్న, సన్నకారు రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. పట్నం నరేందర్‌రెడ్డి సహా 40 మంది రైతులు జైళ్లలో ఉన్నరు. వారందరినీ తక్షణమే విడుదల చేసి, రేవంత్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
అరాచకాలపై అసెంబ్లీలో నిలదీస్తం
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజల కష్టకష్టాల్లో పాలు పంచుకునేందుకు ప్రయత్నం చేస్తే వారిని అడ్డుకొని ఇబ్బందులకు గురిచేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నిర్బంధిస్తున్నారని, ఎకడికకడ వారి హకులను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ‘గురుకుల విద్యార్థులను కలవకుండా ఎమ్మెల్యే కోవా లక్ష్మిని గృహ నిర్బంధం చేశారు. రెండో విడత దళితబంధు నిధులు అడిగినందుకు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నది. సరారు అరాచకాలపై అసెంబ్లీలో నిలదీస్తం. తెలంగాణ ఉద్యమం, చరిత్రపై ప్రభుత్వానికి అవగాహన లేదు. తెలంగాణతల్లి రూపురేఖలను మార్చి అస్థిత్వంపై దాడి చేస్తున్నారు. ప్రజల ఆవేదనకు బీఆర్ఎస్ గొంతుకగా నిలుస్తుంది. ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన పనిని అసెంబ్లీ, మండలిలో నిలదీస్తాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
గ్రామాల్లో సంక్షోభ పరిస్థితులు
ఏడాదికాలంగా గ్రామ పంచాయతీల్లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘దోమల పిచికారీ మందులకు కూడా పైసల్లేవు. తాజా మాజీ సర్పంచులకు బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు. సెక్రటరీలకు డబ్బులు ఇచ్చే వాళ్లు లేరు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా పల్లెలను బాగుచేశాం. తెలంగాణ గ్రామాలను దేశానికే ఆదర్శంగా నిలిపాం. ప్రస్తుతం పల్లెల దీనస్థితిపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అంబేదర్ అభయహస్తం కింద రూ.12 లక్షలు ఇస్తామని రేవంత్‌రెడ్డి ప్రగల్భాలు పలికారు. ఇప్పటివరకు దళితబంధుకు రూపాయి కూడా విడుదల చేయలేదు. రెండో విడత దళితబంధు డబ్బులు కూడా ఇవ్వలేదు. దళితబంధు నిధులపై అసెంబ్లీలో సరారును ప్రశ్నిస్తాం. కాంగ్రెస్ 420 హామీలను అసెంబ్లీలో ఎండగడతాం. బీసీ డిక్లరేషన్‌పై అసెంబ్లీలో సరారును నిలదీస్తాం. ప్రజాసమస్యలపై ప్రతిరోజు అసెంబ్లీలో ప్రశ్నలు సంధిస్తాం. రాష్ట్ర శాసనమండలి, శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై మాకు దిశా నిర్దేశం చేసిన మా పార్టీ అధినేత కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అని కేటీఆర్ పేర్కొన్నారు.