KTR | తెలంగాణ మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు లీగల్ నోటీసులు పంపారు. మంత్రి చేసిన అడ్డగోలు వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. తనకు సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్‌పై అసత్యాలు మాట్లాడరని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్‌తో పాటు నాగచైతన్య, సమంత విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అంటూ దుర్వేశపూర్వక వ్యాఖ్యలు చేశారని, కేవలం తన గౌరవానికి, ఇమేజ్‌కి భంగం కలిగించాలనే లక్ష్యంతోనే అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. కేవలం రాజకీయ కక్షతో, రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును కొండా సురేఖ వాడుకుంటున్నారని.. మహిళ అయిఉండి సాటి మహిళ పేరును, సినిమా నటుల పేరును వాడుకొని వారి వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడడం దురదృష్టకరమన్నారు.
అసలు తనకు సంబంధమే లేని ఫోన్ టాపింగ్, ఇతర అంశాలపైన కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యపూరితమని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఒక మంత్రిగా కొండా సురేఖ తన మంత్రి హోదాను దుర్వినియోగం చేశారన్నారన్నారు. ఎలాంటి సాక్షాలు లేకుండా కొండా సురేఖ చేసిన అసత్య పూరిత వ్యాఖ్యలు, దురుద్దేశ పూరిత మాటలు మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయని.. ఎలాంటి సాక్ష్యాధారాలు చూపించకుండా అడ్డగోలుగా మాట్లాడిన కొండ సురేఖ ఒక మంత్రి అని, ఆమె చేసిన వ్యాఖ్యలను సాధారణ ప్రజలు నిజాలుగా భ్రమపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రిగా తన సహచర అసెంబ్లీ సభ్యుడనే సోయి లేకుండా మాట్లాడడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. గతంలో ఇవే అడ్డగోలు మాటలు మాట్లాడిన కొండా సురేఖకు ఏప్రిల్‌లో నోటీసులు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇలాంటి అవాంఛనీయ వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖకు భారత ఎన్నికల సంఘం గట్టి హెచ్చరిక చేసిందని.. అయినా ఇలాంటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలను కొనసాగిస్తున్నరన్నారని మండిపడ్డారు. కొండ సురేఖ ప్రణాళికబద్ధంగా కావాలనే పదేపదే అవే అబద్ధాలను వ్యక్తిత్వాన్ని తగ్గించడం కోసం, నష్టపరచడం కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మంత్రి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అబద్దాలు, అసత్యాలు దురుద్దేశపూర్వకంగా మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి దురుద్దేశపూర్వక, చిల్లర మాటలు మాట్లాడవద్దని హెచ్చరించారు. 24 గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే చట్ట ప్రకారం పరువు నష్టం దావాను వేయడంతో పాటు క్రిమినల్ కేసు వేస్తామని స్పష్టం చేశారు.