హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్వో) ఇచ్చిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ఫారాలను ఇప్పటి వరకు ఏడు శాతం మంది మాత్రమే పూర్తిచేసి ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ నెల 24వ తేదీతో గడువు ముగుస్తుండగా ఇంకా 93 శాతం ప్రక్రియ అంత తకువ సమయంలో ఎలా పూర్తవుతుందని అనుమానం వ్యక్తంచేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని, ‘సర్’ గడువును తక్షణమే పొడిగించాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒకరి పేరూ ఓటరు జాబితాలో ఉండాల్సిందేనని, అదే సమయంలో అనర్హులను జాబితా నుంచి పూర్తిగా ఏరివేయాలని స్పష్టంచేశారు.
తెలంగాణభవన్‌లో ‘సర్’ ప్రక్రియపై పార్టీ నియమించిన ప్రత్యేక కమిటీ సభ్యులతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘సర్’ ప్రక్రియ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎన్నికల కమిషన్ నియమించిన బీఎల్వోలు చాలాచోట్ల ‘సర్’ ప్రక్రియపై ఓటర్లకు సరైన అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమవుతున్నారని పేర్కొన్నారు.
జిల్లాల్లో ఓటర్ల డూప్లికేషన్‌పై శ్రద్ధ పెడుతున్న ఎన్నికల కమిషన్ ఒకే ఓటరు వివిధ రాష్ట్రాల ఓటర్ల జాబితాలో ఉంటున్నా పట్టించుకోవడం లేదని కేటీఆర్ విమర్శించారు. దేశవ్యాప్తంగా ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు ఉండాలనే నిబంధనను ఈసీ కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ‘ఇప్పటికే ఈ విషయాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)ని కలిసి వినతిపత్రం ఇచ్చినం. ఇదే డిమాండ్‌తో త్వరలోనే బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలుస్తుంది’ అని వెల్లడించారు.
బీఆర్ఎస్ తరఫున రాష్ట్రవ్యాప్తంగా నియమించిన బూత్ లెవెల్ ఏజెంట్లు అద్భుతంగా పనిచేస్తున్నారని అభినందించారు. ఇకముందు కూడా అప్రమత్తంగా ఉండి అర్హులైన వారందరి పేర్లు ఓటర్ల జాబితాలో ఉండేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలోని 93కు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఎల్ఏలకు అవగాహన కల్పించే సమావేశాలు పూర్తయ్యాయని, మిగతా నియోజకవర్గాల్లోనూ త్వరలోనే మీటింగ్‌లు నిర్వహిస్తామని చెప్పారు.
‘సర్’ ప్రక్రియను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు వీలుగా హైదరాబాద్ మినహా ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో కమిటీ సభ్యులకు కేటీఆర్ బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ (కరీంనగర్), ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ (నల్లగొండ), మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ (రంగారెడ్డి), పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్ (ఖమ్మం), మన్నె క్రిశాంక్ (మెదక్), వై సతీశ్‌రెడ్డి (వరంగల్), అభిలాష్ రంగినేని (మహబూబ్‌నగర్), ముజీబ్ (ఆదిలాబాద్), సుమిత్రానంద్ (నిజామాబాద్) జిల్లాల్లో ‘సర్’ ప్రక్రియను ఎప్పటికపుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డి పలు సూచనలు చేశారు.