హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తేతెలంగాణ): తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక సద్దుల బతుకమ్మ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని సోమవారం ఒక ప్రకటనలో ఆడబిడ్డలకు శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజించి, ప్రకృతిని ఆరాధించి, గౌరవమ్మను భక్తితో కొలిచే సబ్బండ వర్ణాల సంబురం బతుకమ్మ వేడుక అని పేర్కొన్నారు.
ఈ వేడుక తెలంగాణ సంస్కృతీ, అస్థిత్వం, ప్రకృతితో ప్రజలకున్న అనుబంధానికి అద్దం పడుతుందని చెప్పారు. తెలంగాణ నారీలోకం తొమ్మిది రోజులపాటు ఉత్సాహంగా భక్తిశ్రద్ధలతో ప్రకృతిమాతను పూజిస్తూ, ఆటపాటలతో జరుపుకొన్న ఈ పండుగ ప్రతి ఇంట సిరిసంపదలను, సంతోషాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రతి ఆడబిడ్డ జీవితంలో ఆనందం వెల్లివిరియాలని, సౌభాగ్యం నిండుగా ఉండాలని బతుకమ్మ తల్లిని ప్రార్థించారు.
తెలంగాణ ఆడబిడ్డలకు బీఆర్ఎస్ సీనియర్‌నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు సద్దు ల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డల బతుకు పాట, బతుకు చిత్రం, ఆత్మగౌరవం ఈ పండుగ అని పేర్కొన్నారు. ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాక్షించారు.