KTR | హైదరాబాద్ : మూసీ మురికి కూపంగా మారిందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా.. మూసీని మురికి కూపంగా మార్చింది కచ్చితంగా గత పాలకులే.. అందులో సింహభాగం కాంగ్రెస్ ప్రభుత్వానిది అయితే.. కొద్దిభాగం టీడీపీ ప్రభుత్వానికి కూడా దక్కుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో మూసీపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
మూసీ స్టోరీ ఏంటని ఆలోచిస్తే.. మూసీ నది కృష్ణానదికి ఉపనది. పైన అనంతగిరి కొండల్లో ముచ్కుంద వద్ద మూసీ ఉద్భవించింది. 267 కి.మీ. ప్రయాణం చేసి హైదరాబాద్ నగరం మీదుగా వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. 1591లో కులీకుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని మూసీ తీరాన నిర్మించారు. రెండు నదులుగా మూసా ఈసాగా ప్రారంభమై.. హైదరాబాద్‌లోని బాపు ఘాట్ వద్ద మూసీ నదిగా ఏర్పడుతాయి. గతంలో ఈ నదిని ముచ్కుంద అని కూడా పిలిచేవారు. 1908లో మూసీలో ఒక భయంకరమైన వరద వచ్చింది. కుంభవృష్టి లాంటి వర్షం పడడం కారణంగా అతి పెద్ద వరద సంభవించి 15 వేల మంది మరణించారు. చాలా మంది ఇబ్బంది పడ్డారు. నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ ప్రజలను వరద నుంచి కాపాడాలని చెప్పి.. నాటి ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిచి చర్చించారు. నాడు ఆయన డిజైన్ చేసింది ఉస్మాన్ సాగర్(గండిపేట) 1920లో పూర్తయింది, హిమాయాత్ సాగర్ 1927లో పూర్తయింది. ఈ రెండింటి రిజర్వాయర్ల వెనుక ఒక ఉద్దేశం ఉంది. ఒకటి హైదరాబాద్ ప్రజలకు మంచినీరు అందించడం, రెండోది భారీగా వరదలు వచ్చిన వాటిని ఆపేందుకు, హైదరాబాద్‌లో ఆవాసాలు మునగకుండా, ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా.. రక్షణ కవచం లాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రెండు రిజర్వాయర్లు నిర్మించారు. ఆ తర్వాత 95 ఏండ్ల పాటు మూసీలో ఏ ప్రభుత్వం గొప్పగా పని చేసింది లేదు అని కేటీఆర్ తెలిపారు.
మూసీకి ఒక ప్రత్యేకత ఉంది. పశ్చిమం నుంచి తూర్పు వైపునకు ప్రవహిస్తోంది. పశ్చిమాన ఉండే మంచిరేవుల వద్ద తీసుకుంటే.. ఈస్ట్‌లో ఉండే ఓఆర్ఆర్ దాకా 57.5 కిలోమీటర్లలో 84 మీటర్ల కిందకు ఫాస్ట్‌గా ప్రవహిస్తుంది. ఇది ప్రకృతి ప్రసాదించిన వరంగా చెప్పొచ్చు. వరద వేగంగా కిందకు జాలువారుతుంది. రెండోది గతంలో ఉన్న ఎంసీహెచ్, 2007-08లో ఏర్పడ్డ జీహెచ్ఎంసీ కానీ.. ఈ పరిధి తీసుకుంటే 90 శాతం రెయిన్ వాటర్, 90 శాతం సీవరేజ్ కానీ గ్రావిటీ ద్వారా మూసీలోకి వస్తుంది. 54 ప్రధాన నాలాలు ఉన్నాయి. అవన్నీ కూడా 90 శాతానికి పైగా గ్రావిటీ రూపంలో ఉన్నాయి. నాచారం, జీడిమెట్ల, బాలానగర్, మల్లాపూర్ నుంచి కొన్ని వ్యర్థాలు 90 శాతానికి పైగా మూసీలో కలుస్తున్నాయి. మూసీలో ఒక్క చుక్క నీరు వదిలినా నిల్వదు.. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తినా జరజర నీరు కిందకు పోతోంది. అలా మోక్షగుండం విశ్వేశ్వరయ్య రిజర్వాయర్లను ప్లాన్ చేశారు. ఎలాంటి ఉపద్రవం లేకుండా బ్యాల్సెనింగ్గా రూపొందించారు. ప్రాణ నష్టం లేకుండా కాపాడుకోవచ్చు అని చాలా ముందు చూపుతో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ రెండు రిజర్వాయర్లను కట్టించారని కేటీఆర్ గుర్తు చేశారు.
నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు. గత పాలకులు చేసిన పాపం.. మూసీని మురికి కూపంగా మార్చింది గత పాలకుల పాపం అన్నారు. 2015లో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన రిపోర్టు.. ఇది మా రిపోర్టు కాదు.. కాలుష్యం బారిన పడి కాలుష్యకారంగా మారిపోయిన నదులు భారతదేశంలో ఏ ఉన్నాయంటే.. అగ్రభాగాన ఉన్నది మూసీ(2015). మేం 2014లో అధికారంలో వచ్చాం. ఏడాదిలోనే మేం మురికి కూపంగా మార్చలేదు. మార్చింది ఎవరంటే రేవంత్ రెడ్డి.. ఇప్పుడు నీవుఉన్న కాంగ్రెస్ పార్టీ, గతంలో నీవు ఉన్న టీడీపీ కలిసి మూసీని మురికి కూపంగా మార్చాయి. గబ్బుగబ్బు చేశాయని 2015లోనే రిపోర్టు వచ్చింది. బీవోడీ లెవల్స్ కూడా ఆ రిపోర్టులో పేర్కొనడం జరిగింది. రేవంత్ రెడ్డితో ఏకీభవిస్తున్నా.. మూసీని మురికి కూపంగా మార్చింది కచ్చితంగా గత పాలకులే.. అందులో సింహభాగం కాంగ్రెస్ ప్రభుత్వానిది అయితే.. కొద్దిభాగం టీడీపీ ప్రభుత్వానికి కూడా దక్కుతుందని కేటీఆర్ తెలిపారు.
1908లో వరదలు వచ్చినప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య డిజైన్ చేసిన రిజర్వాయర్లు, పార్కులు తప్ప కేసీఆర్ వచ్చేదాకా ఏ ప్రభుత్వం కూడా ప్రయత్నాలు మొదలు పెట్టలేదు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిపోర్టు తెప్పించుకున్నాం. మూసీ మురికికూపంగా మారింది. బీవోడీ, సీవోడీ ఈ రెండింటిలో కూడా మూసీ ప్రమాదభరితమైన స్థాయిలో ఉందని రిపోర్టులో చెప్పారు. 2016 దాకా మున్సిపల్ మినిస్టర్‌గా కేసీఆర్ ఉన్నారు. ఆ తర్వాత నేను మున్సిపల్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాను. కేసీఆర్ మార్గదర్శకత్వంలో అక్కడ ఉండే పరిస్థితులను అధ్యయనం చేసి పునరుజ్జీవం, సుందరీకరణ చేసే విధంగా సంకల్పించాం అని కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Group-1 Mains | షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు.. పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు