హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు గడవకముందే కాంగ్రెస్ పార్టీ రౌడీయిజం, గుండాయిజం మొదలుపెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తపై జరిగిన దాడిని ఖండించారు. తాము పదేండ్లు అధికారంలో ఉన్నామని, ఎన్నో ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందినా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వలే ప్రతిపక్షాలపై దాడులు చేయలేదన్నారు. జూబ్లీహిల్స్ రహమత్‌నగర్‌లో కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రాకేశ్‌ను కేటీఆర్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కార్యకర్తలు ఎవ్వరూ దిగులు చెందొద్దని, కాంగ్రెస్ చేస్తున్న రౌడీయిజాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీలోని ప్రతి కార్యకర్తను కంటికిరెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. ఆపదొస్తే అన్ని వేళల్లో అండగా ఉంటాని తెలిపారు. తమ కార్యకర్తపై జరిగిన దాడికి కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలన్నారు.
దొంగ ఓట్లు, గూండా గిరి చేసి, డబ్బులు పంచి జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తమకు గతంలో 80 వేలు ఓట్లు వస్తే ఈ ఉప ఎన్నికలో 75 వేల ఓట్లు వచ్చాయని, ఇన్ని కుట్రలు, రిగ్గింగ్ చేసినా మా ఓట్లు కేవలం 5 వేలు మాత్రమే తగ్గాయన్నారు. కచ్చితంగా భవిష్యత్తులో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేసి తీరుతామని స్పష్టం చేశారు.
తాను అహంకారం తగ్గించుకోవాలన్న రెవంత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. శుక్రవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ చేసిన విజయోత్సవ ఊరేగింపుతోనే ఎవరిది అహంకారమో తేలిపోయిందని కేటీఆర్ అన్నారు. గతంలో మేము అనేక ఉప ఎన్నికలు గెలిచాము, కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు. అందుకని ఆ పార్టీ గుర్తును గాడిద మీద వేసి ఊరేగించామా అని ప్రశ్నించారు. ఒక్క ఉప ఎన్నిక గెలిచినందుకే ఇంత ఎగిరి పడడం అవసరం లేదని చురకలంటించారు. ఎవరిది అహంకారమో ప్రజలు నిర్ణయిస్తారన్నారు. జూబ్లీహిల్స్ నేతలు, కార్యకర్తలతో మంగళవారం సమావేశం నిర్వహించానున్నామని చెప్పారు. కాంగ్రెస్ గుండాయిజం మానుకోకపోతే ప్రజలే బుద్ది చెబుతారన్నారు.
నిన్న రాత్రి జూబ్లీహిల్స్ నియోజకవర్గం, రహమత్ నగర్ డివిజన్లో కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రాకేష్ క్రిస్టోఫర్ గారి నివాసానికి వెళ్లి పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
♦️మా కార్యకర్త పై జరిగిన దాడిని ఖండిస్తున్నా… pic.twitter.com/vGqnLUVfEO
— BRS Party (@BRSparty) November 15, 2025