హైదరాబాద్ జూన్ 27 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు చేతగానితనంతో నిన్న జూరాల, నేడు మంజీర ప్రమాదంలో చిక్కుకున్నా ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం మొద్దునిద్ర వీడటం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని శుక్రవారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. మంజీరాకు మరమ్మతులు చేయాలని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎన్డీఎస్వో) మార్చి 22న ఇచ్చిన నివేదికను నిర్లక్ష్యంగా పక్కనబెట్డడం క్షమించరాని నేరమని మండిపడ్డారు. జూరాల జలాశయం ప్రమాదంలో పడి 24 గంటలు గడవకముందే హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు తాగునీరు అందించే మంజీరా బరాజ్‌ను కూడా ప్రమాదంలో పడేయడం కాంగ్రెస్ నేరపూరిత నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నదని దుమ్మెత్తిపోశారు.
‘మేడిగడ్డ బరాజ్ వద్ద చరిత్రలో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో వరద రావడంతో రెండు పిల్లర్లకు పగుళ్లు వచ్చాయి. ఇప్పుడు ఇదే తరహాలో వరద ఉధృతి పెరగడంతో మంజీరా దిగువ భాగంలోని పిల్లర్లకు పగుళ్లు వచ్చాయి. ఆఫ్రాన్ కొట్టుకుపోయింది. స్పిల్ వేలోని భాగాలు దెబ్బతిన్నాయి’ అని పేర్కొన్నారు. దీనిపై ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చినా ముఖ్యమంత్రి మాత్రం కండ్లు తెరవడంలేదని విమర్శించారు. రానున్న రోజుల్లో ఎగువ నుంచి వరద ఉధృతి పెరిగితే మరింత కోతకు గురయ్యే ప్రమాదమున్నదని, డ్యామ్ ప్రమాదంలో చిక్కుకునే పరిస్థితులు ఉంటాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
గతంలో మేడిగడ్డ వద్ద అంచనాకు మించి వరద రావడంతో పిల్లర్లలో పగుళ్లు వచ్చాయని చెప్పారు. ఇప్పుడు అదే తరహాలో మంజీరా ప్రాజెక్టుకు కూడా వరద పోటెత్తడంతో పిల్లర్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. మేడిగడ్డ ఘటనను అసెంబ్లీ ఎన్నికల వేళ బూతద్ధంలో చూపి బీజేపీ, కాంగ్రెస్ కూడబలుక్కొని బీఆర్ఎస్పై బురదజల్లాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. మేడిగడ్డ బరాజ్‌లోని పియర్స్‌కు పగుళ్లు వస్తే నానా రాద్ధాంతం చేసిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు మంజీరా బరాజ్‌కు పగుళ్లు వస్తే కనీసం స్పందించకపోవడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు.
గత ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టుల్లో ఇబ్బందులు వస్తే తర్వాత అధికారంలోకి వచ్చిన వారు మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకువచ్చారని గుర్తుచేశారు. కానీ రేవంత్‌రెడ్డి మాత్రం రాజకీయాల కోసం బీఆర్ఎస్పై కక్ష సాధిస్తూ రైతులను కష్టాల్లోకి నెడుతున్నారని విమర్శించారు. చిల్లర రాజకీయాలు పక్కనబెట్టి మేడిగడ్డ, మంజీర బరాజ్‌ల్లో దెబ్బతిన్న పియర్స్‌కు మరమ్మతు చేయించాలని, లేదంటే రైతులు క్షమించబోరని హెచ్చరించారు. ప్రాజెక్టుల రిపేర్లపై నిర్లక్ష్యం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చరిత్ర క్షమించబోదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
స్ట్రాటజిక్ రోడ్ డెలవప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా చేపట్టిన 42 ప్రాజెక్టుల్లో బీఆర్ఎస్ పదేండ్ల పాలనలోనే 36 ప్రాజెక్టులు పూర్తయ్యాయని కేటీఆర్ తెలిపారు. ఇందులో భాగంగా మరో ప్రాజెక్టు అందుబాటులోకి రావడం గర్వకారణంగా ఉన్నదని చెప్పారు. హైదరాబాద్ ప్రజల తరఫున అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
‘అన్నపు రాశులు ఒకచోట.. ఆకలి మంటలు ఒకచోట.. హంస తూలికలు ఒకచోట.. అలసిన దేహాలు ఒకచోట’ అని కవి కాళోజీ నారాయణరావు చెప్పినట్టు అందాల పోటీల విందులో ప్లేటు భోజనానికి రూ. లక్ష, వేములవాడలో కాంగ్రెస్ సభకు ఆలయ నిధుల నుంచి ఒక్కో ప్లేటు భోజనానికి రూ. 36 వేల చొప్పున ఖర్చు చేసిన కాంగ్రెస్ సర్కారు పేద పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టకుండా అరిగోసపెడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్థుల కడుపులు మాడ్చుతున్నదని ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తూ తెలంగాణ భవిష్యత్తును పణంగా పెడుతున్నదని నిప్పులు చెరిగారు. కేసీఆర్ పాలనలో దేశానికి దిక్సూచిలా నిలిచిన విద్యావ్యవస్థ కాంగ్రెస్ హయాంలో అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు.
ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుకు డబ్బు లేదని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం భారత్ సమ్మిట్‌కు రూ. 29.45 కోట్లు దుబారా చేయడం విడ్డూరమని కేటీఆర్ మండిపడ్డారు. సిగ్గులేని కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్‌గాంధీ హాజరయ్యే అర్థంపర్థం లేని, పనికిరాని సమావేశానికి పెద్ద మొత్తంలో ఖర్చుచేయడం ఎందుకని ప్రశ్నించారు. వందరోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారెంటీలను 600 రోజులైనా ఎందుకు నెరవేర్చడం లేదని కేటీఆర్ నిలదీశారు.