HomeTelanganaKtr Says Has Come Forward For Organ Donation
అవయవదానానికి నేను సైతం.. ఎమ్మెల్యేగా తొలి సంతకం పెడతా.. కేటీఆర్ ప్రకటన
అవయవ దానానికి తాను వ్యక్తిగతంగా సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారకరామారావు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అవయదాన అంగీకార పత్రంపై ఎమ్మెల్యేగా తానే మొదటి సంతకం పెడతానని తెలిపారు.
అవయవ మార్పిడి చట్టాన్ని ఉల్లంఘిస్తే రూ.కోటి ఫైన్
ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
ఎమ్మెల్యేలు అందరూ ముందుకు రావాలని పిలుపు
ఆరోగ్యశ్రీ కింద అవయవ మార్పిడిలు చేయించాం : మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): అవయవ దానానికి తాను వ్యక్తిగతంగా సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారకరామారావు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అవయదాన అంగీకార పత్రంపై ఎమ్మెల్యేగా తానే మొదటి సంతకం పెడతానని తెలిపారు. అవయవదాన సవరణ బిల్లును వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో కేటీఆర్ మాట్లాడుతూ, అవయవదానాన్ని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. సభలో ఉన్న ఎమ్మెల్యేలంతా రెండు, మూడు లక్షల మంది ప్రజలకు ప్రతినిధులమని, మనమంతా ఆదర్శంగా ఉండి అవయవదానంపై చైతన్యం తేవాల్సి ఉన్నదని పిలుపునిచ్చారు. సభ్యులు ముందుకొస్తే, స్పీకర్ చొరవ తీసుకుంటే అసెంబ్లీలోనే సంతకాలు చేద్దామని సూచించారు.
రూ.కోటి జరిమానా: దామోదర
అవయవ మార్పిడి చట్టాన్ని ఉల్లంఘిస్తే కోటి రూపాయల జరిమానా, పదేండ్ల వరకు శిక్ష పడుతుందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అసెంబ్లీలో ప్రకటించారు. గురువారం అసెంబ్లీలో అవయవదాన సవరణ బిల్లును ప్రవేశపెట్టి ప్రసంగించారు. చట్ట సవరణతో చర్మం, ఎముకమజ్జ, రక్తనాళాలు, గుండె కవాటాలు (వాల్వ్‌లు) మార్పిడి వంటివి ఇకనుంచి చట్ట పరిధిలోకి వస్తాయని వెల్లడించారు. బ్రెయిన్‌డెడ్ డోనర్ల నుంచి అవయవాలను సేకరించి, మార్పిడి చేసేందుకు వీలుపడుతుందని తెలిపారు. గ్రాండ్ పేరెంట్స్ నుంచి పిల్లలకు కాలేయ మార్పిడి, మనుమలు, మనవరాళ్లు గ్రాండ్ పేరెంట్స్‌కు అవయవదానం చేయవచ్చని చెప్పారు.
కొత్త చట్టం ప్రకారం ఫిజీషియన్, సర్జన్, ఇన్వెంటిస్ట్, అనస్థీషియన్ కూడా బ్రెయిన్‌డెడ్‌ను డిక్లేర్ చేస్తారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో అవయవ మార్పిడి వ్యవస్థలతో జీవన్‌దాన్‌ను అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. అవయవదాతను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా పాలసీని రూపొందిస్తామని చెప్పారు. ఈ బిల్లుపై ఎమ్మెల్యేలు సంజయ్, పాల్వాయి హరీశ్‌బాబు, రాంచందర్‌నాయక్, దానం నాగేందర్, మాజీద్ హుస్సేన్, లక్ష్మీకాంతరావు, ఆదినారాయణ, కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి తమ తమ అభిప్రాయాలు తెలిపారు. మండలిలో అవయవదానబిల్లుకు ఆమోదం శాసనమండలిలో గురువారం అవయవదానానికి సంబంధించిన బిల్లుకు ఆమోదం లభించింది.
ఆరోగ్యశ్రీ కింద అవయవమార్పిడిలు చేయించాం: హరీశ్‌రావు
కేసీఆర్ హయాంలో ఆరోగ్యశ్రీ కింద 577 అవయవ మార్పిడి చికిత్సలు చేశామని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు వెల్లడించారు. రూ.20 లక్షలయ్యే చికిత్సను ఉచితంగా చేశామని, ఏడాదిపాటు మందులు కూడా ఇచ్చామని తెలిపారు. తమ పాలనలో నిమ్స్, ఉస్మానియా, గాంధీ దవాఖానల్లో 609 అవయవ మార్పిడి చికిత్సలు చేశామని చెప్పారు. ప్రస్తుతం 3,724 మంది అవయవదానం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 189 అవయవ మార్పిడిలు జరిగితే, బీఆర్ఎస్ పాలనలో 2014లో 233, 2015లో 364, 2016లో 563, 2017లో 573, 2018లో 469, 2019లో 257, 2020లో 616, 2021లో 716, 2022లో 729, 2023లో 725 చొప్పున జరిగాయని వివరించారు.