హైదరాబాద్: ఎంతోమంది పోరాటం వల్ల స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కులాలు, మతాలకు అతీతంగా తెలంగాణ ప్రజలు ఉంటారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మానుకోవాలని సూచించారు. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండాను కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉద్యోగాల కోసం యువత ఎదురుచూస్తున్నారని.. రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. రైతు భరోసా, పింఛన్ ఎప్పుడిస్తారన్నారు. రూ.2500 ఎప్పుడిస్తారని ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు దెబ్బతిన్నారని విమర్శించారు. ఒక్క నెలలో 30 హత్యలు అయ్యాయని పత్రికలు రాస్తున్నాయని చెప్పారు. హోం మంత్రిని పెట్టి శాంతిభద్రతలు కాపాడాలన్నారు.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలం ముందు పెట్టుకుందాం అనుకుంటే అక్కడ రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని విమర్శించారు. గతంలో సోనియాగాంధీని బలిదేవత అని, రాహుల్ గాంధీని ముద్దపప్పు అని తిట్టాడు.. ఇప్పుడు వాటిని కవర్ చేసుకోవడానికే రాజీవ్ విగ్రహం పెట్టాడన్నారు. కంప్యూటర్ను రాజీవ్‌గాంధీ కనిపెట్టాడని రేవంత్ రెడ్డి అంటున్నారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టాడని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు.. కంప్యూటర్ కనిపెట్టిన ఛార్లెస్ బాబేజ్ ఆత్మ ఎక్కడున్నా బాధపడుతుంది. మీకు తెలియదు, ఎవరైనా చెప్తే వినవంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పాలనే లేదు.. సెప్టెంబర్ 17ను ప్రజాపాలన అంటున్నాడని విమర్శించారు. ఇకనైనా పరిపాలనపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. ఇచ్చిన 420 హామీలను నెరవేర్చే వరకు మిమ్మల్ని వదిలే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సకల మర్యాదలతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్‌కు పంపిస్తామన్నారు.
Live : BRS Working President @KTRBRS addressing the media at Telangana Bhavan https://t.co/0c1XVlxZGX
— BRS Party (@BRSparty) September 17, 2024