హైదరాబాద్: కష్టంలో ఉన్న తల్లిలాంటి పార్టీని నమ్ముకొని ఉండే వారే నిజమైన కార్యకర్తలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అవకాశవాదులే సిగ్గులేకుండా పార్టీ మారుతారని విమర్శించారు. పార్టీ నుంచి పారిపోయిన వారి పేర్లు తీసుకొని వారిని పెద్దోళ్లను చేయొద్దన్నారు. పార్టీ కోసం కొట్లాడేవారికే అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తలే రేవంత్ పాలనపై మండిపడుతున్నారని, ఇదేం పాలన అంటూ ఆ పార్టీ నాయకులే నిలదీస్తున్నారన్నారు.
‘రాష్ట్రంలో కమీషన్ల పాలన కొనసాగుతున్నది. కమీషన్ల పనిలో కాంగ్రెస్ నేతలు బిజీగా ఉన్నారు. 30 శాతం కమీషన్ లేనిదే ఫైల్లు కదులుతలేవు. తమ ప్రభుత్వంలో ఫైల్లు కదలాలి అంటే మంత్రుల చెయ్యి తడపాల్సిందేనని కొండా సురేఖ చెప్పారు. మా ప్రభుత్వంలో మంత్రులు 30 శాతం కమిషన్ తీసుకుంటున్నారు ఇంకొక కాంగ్రెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చెప్పారు. ఈ కమీషన్ల నుంచి దృష్టి మరల్చేందుకే కమిషన్. రెండు లక్షల రుణమాఫీ ఎంతమంది చేశారు?. రూ.50 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి.. రూ.12 వేల కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారు. రుణమాఫీ ఇచ్చింది పావు వంతే. రాష్ట్రంలో 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులను పట్టించుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదు.
వరంగల్ మహాసభ విజయవంతం కాగానే నోటీసుల డ్రామా మొదలుపెట్టారు. కాళేశ్వరం ఒక ఇంజినీరింగ్ మార్వెల్ అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కాళేశ్వరం విషయంలో నిజం నిలకడగా తేలుతుంది. ఒక బ్యారేజీలో రెండు పగుళ్లు వస్తే ఏదో అయినట్లు చేస్తున్నారు. ఈ కాంగ్రెస్, బీజేపీ దొంగలే మేడిగడ్డ దగ్గర బాంబు పెట్టి పేల్చేశారని నా అనుమానం. పాలమూరులాగే కాళేశ్వరంలోనూ నిజం తెలుస్తుంది. చిల్లిగవ్వ పుట్టడం లేదంటూనే అందాల పోటీలు పెడుతున్నారు. రాష్ట్రం దివాళా తీసిందంటూనే దుబారా ఖర్చులు చేస్తున్నరు. అందాల పోటీలు రేవంత్ రెడ్డికి, భట్టి విక్రమార్కకు మధ్య జరుగుతున్నట్టు ఉన్నాయి. మిస్ వరల్డ్ బ్యానర్ల మీద రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు ఫొటోలు చూశా.. వారిలో ఎవరు మిస్ వరల్డ్ పోటీదారులో అర్థం కాలేదు. చార్మినార్ అగ్నిప్రమాదంపై రేవంత్ రెడ్డికి రివ్యూచేసే సమయం లేదా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానంటూ.. బీఆర్ఎస్ హయాంలో కట్టిన అద్భుత కట్టడాలను అందగత్తెలకు చూపించారు. లక్షన్నర కోట్లు అప్పు చేసి రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశాం. పల్లెలు, పట్టణాలు అభివృద్ధి పథంలో దూసుకుపోయాయి. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికి లబ్ధి జరిగింది. కుర్చీని కాపాడుకోవడానికి రెవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు మోస్తున్నారు. రైతుల ఖాతాల్లో రైతు బంధు పైసలు పడ్తలేవు.. కానీ ఢిల్లీలో రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రం నెల నెలా టకీ టకీమని పడుతున్నాయ్. కాంగ్రెస్, బీజేపీ ఇద్దరూ దొంగలే.. ఇద్దరినీ నమ్మొద్దు. అప్రమత్తంగా ఉండి.. ఇద్దరినీ ఎండగట్టాలి. తెలంగాణకు గుండె ధైర్యమైన గులాబీ జెండాను మల్లొక్కసారి మనమే ఎగురవేయాలి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తగిన బుద్ధి చెప్పాలి. ఎవరికి టికెట్ వచ్చినా ప్రతీ కార్యకర్త తనకే అవకాశం వచ్చినట్టుగా కొట్లాడాలి. మళ్లీ నిర్మల్ జిల్లాలో గులాబీ జెండా ఎగిరేవరకు పోరాడుదాం.’ అని కేటీఆర్ అన్నారు.