హైదరాబాద్: అదానీ, రేవంత్ రెడ్డి ఒక్కటై తెలంగాణ ప్రజాలతో ఆడుతున్న నాటకాన్ని బయటపెడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అదానీ పట్ల కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నదని విమర్శించారు. అదానీ, రేవంత్ దోస్తానాను శాసనసభ వేదికగా ఎండగడతామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గపు ఆలోచనను ప్రజలకు వివరిస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులు అర్పించారు. అమరులకు జోహార్.. వీరులకు జోహార్ అంటూ పాటపాడారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర సాధనలో భాగంగా పదవీ త్యాగంతో బీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైంది. ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడిన తెలంగాణ మహానాయకుడు కేసీఆర్. ఉద్యమ నాయకుడు కేసీఆర్ దీక్షకు దిగి దేశ రాజకీయ వ్యవస్థను మెడలు వంచిన రోజు, తెలంగాణ ప్రజా కదలికలతో ఢిల్లీ పాలకుల గుండెల్లో గుబులు పుట్టినరోజు డిసెంబర్ 9. దీక్ష ఫలవంతమైన డిసెంబర్ 9న దీక్షా విజయ్ దివస్‌గా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ అమరులకు ఘనంగా నివాళులు అర్పించాం. గన్‌పార్క్ నుంచి అసెంబ్లీ సమావేశాలకు బయల్దేరుతున్నాం.
ఈ సమావేశాల్లో ప్రజా గొంతుకై, రాష్ట్ర ప్రజల తరపున రాష్ట్రంలో నెకొన్న అన్ని సమస్యల గురించి పోరాడుతాం. కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గపు ఆలోచనను ప్రజలకు వివరిస్తాం. దేశ వ్యాప్తంగా అదానీ మంచివాడు కాదని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నదని, కానీ రాష్ట్రంలో మాత్రం అదానీతో రెవంత్ రెడ్డి అలయ్ బలయ్ తీసుకుంటున్నాడు. రాహుల్ గాంధీ అదానీపై ఇతర రాష్ట్రాల్లో దుర్మార్గపు ప్రచారం చేస్తూ, ఇక్కడమాత్రం మంచివాడని అన్నట్లుగా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు. అదానీ, రేవంత్ ఒక్కటై తెలంగాణ ప్రజానికంతో ఆడుతున్న నాటకాన్ని బయటపెడతాం.
గురుకుల, లగచర్లలో గిరిజనుల నుంచి బలవంతంగా భూములు లాక్కొంటున్న విధానాన్ని, రైతన్నల సమస్యలు, నెరవేరని గ్యారంటీలు, 420 హామీలను తుంగలో తొక్కిన విధానాన్ని, రాష్ట్రంలో నెలకొన్న ప్రతి సమస్యను అసెంబ్లీలో చర్చకు పట్టుబడతాం. తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడిని, ముఖ్యంగా తెలంగాణ తల్లిని మారుస్తానంటున్న రేవంత్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనను నిరసిస్తూ తెలంగాణ ప్రజల ఆర్తిని రెండు సభల్లో వినిపిస్తాం. కాంగ్రెస్ ద్వంద్వ విధానాలను, ఎమ్మెల్యేల హక్కులను, ప్రజాస్వామ్య ఆకాంక్షలను కాలరాస్తున్న విధానాలను ఎండగడతాం. మూసీ, హైడ్రా విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం’ అని కేటీఆర్ చెప్పారు.
Live: గన్‌పార్క్, అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. https://t.co/5sFgaoCF07
— BRS Party (@BRSparty) December 9, 2024