హైదరాబాద్: హామీలు అమలు చేయాలని కోరితే దాడులు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. హైడ్రా అని హైడ్రామాలు చేశారని విమర్శించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి దుష్ట సంప్రదాయాలకు తెరలేపుతున్నారని, అవి ఆయన మెడకే చుట్టుకుంటాయని చెప్పారు. ఎన్ని డైవర్షన్లు చేసినా హామీల గురించి ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. కొండాపూర్‌లోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్.. ఎమ్మెల్యేను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. దాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే దాడులు చేస్తున్నారన్నారు. కౌశిక్ రెడ్డి ఏం తప్పు మాట్లాడారని ప్రశ్నించారు. పార్టీ మారిన వారు దమ్ముంటే రాజీనామా చేయాలని కోరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్నారు.
‘ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి ఉరి తీయాలన్నారు.. రాళ్లతో కొట్టాలన్నారు. ఇప్పుడు ఆయనే స్వయంగా కండువాలు కప్పుతున్నారు. పది మంది పోయారు.. ఎవరూ మిగలరని ప్రకటనలు చేస్తున్నారు. పార్టీ మారానని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ బహిరంగా ప్రకటించారు. ఆయనకే పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారు. అరికెపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని కోరితే దాడిచేశారు. పోలీసు ఎస్కార్టు పెట్టి మరీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయించారు. 20 బండ్లు పెట్టుకొని దాడికి వస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నది?. కౌశిక్ రెడ్డి కుటుంబానికి ఏదైనా జరిగి ఉంటే బాధ్యత ఎవరిది?. చేతగాని సీఎం, హోం మంత్రి ఉండటం వల్లే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. అసలు హోం మంత్రి ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. హైదరాబాద్‌లో కనీసం శాంతి భద్రతలు అదుపులో ఉంచలేకపోతున్నారు. హైకోర్టు తీర్పు తర్వాత మళ్లీ రూట్ మార్చారు.’ అని కేటీఆర్ అన్నారు.
అరికెపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నాడో చెప్పాలన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్కు పోరాటాలు కొత్తేమీ కాదన్నారు. అధికారం ఎవరికీ కొత్తకాదని చెప్పారు. పార్టీ మారిన పది మందిపై వేటు వేయాల్సిందేనన్నారు. కౌశిక్ ఇంటిపై దాడికి సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్ని దాడులు చేసినా ప్రజల పక్షాన బీఆర్ఎస్ నిలుస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ప్రజలు ఎదురు తిరిగారని చెప్పారు. ఈ హింసాయుతమైన పద్ధతులు గత పదేండ్లలో ఎక్కడా జరుగలేదని వెల్లడించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో డైవర్షన్ గేమ్‌లు కొనసాగుతున్నాయని తెలిపారు. వాటికి ప్రజలే సరైన సమాధానం ఇస్తారన్నారు. హైదరాబాద్ ప్రజలపై రేవంత్ పగబట్టాడని విమర్శించారు. ఒక్క సీటు కూడా కాంగ్రెస్‌కు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ఈర్శ్య అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు.
Live: BRS Working President @KTRBRS addressing the media after visiting MLA @KaushikReddyBRS residence. https://t.co/OxjhrfGPTW
— BRS Party (@BRSparty) September 14, 2024