హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభను చరిత్రలో నిలిచిపోయేంత బ్రహ్మాండంగా నిర్వహిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు. ఇందుకోసం 1,200 ఎకరాల్లో చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాదంతా పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెడతామని వెల్లడించారు. ‘ఢిల్లీ పార్టీలను గెలిపిస్తే రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది ముమ్మాటికీ బీఆర్ఎస్సే’ అని పునరుద్ఘాటించారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసంలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. ప్రాంతీయ పార్టీలు 25 ఏండ్లు పూర్తిచేసుకోవడం గొప్ప విషయమని చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ తర్వాత బీఆర్ఎస్కే ఈ ఘనత దక్కిందని చెప్పారు. ‘బీఆర్ఎస్ రజోత్సవ సభకు ప్రత్యేక కమిటీలను నియమించుకొని గొప్పగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే 119 నియోజకవర్గాల నేతలతో సమావేశాలు నిర్వహించి సభ విజయవంతం కోసం దిశానిర్దేశం చేశారని చెప్పారు. సభ నిర్వహణ అనుమతుల కోసం ఇప్పటికే డీజీపీతో మాట్లాడామని తెలిపారు. స్థానిక నాయకులు సైతం ఏసీపీని కలిశారని వెల్లడించారు. సభ నిర్వహణ రోజున సెలవుదినమని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని పేర్కొన్నారు.
‘మూడు వేల బస్సుల కోసం మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి నేతృత్వంలో ఆర్టీసీ ఎండీకి విన్నవించినం. ఇందుకు సంబంధించి పార్టీ నుంచి డబ్బులు కూడా చెల్లించినం. మా పార్టీ చరిత్రలోనే అతి పెద్ద సభ అవుతుంది’ అని వివరించారు. ఒకవేళ సభకు పర్మిషన్ ఇవ్వకుంటే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టంచేశారు. ఎల్కతుర్తిలో పార్టీ నిర్వహించే బహిరంగ సభకు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు వస్తారని ఆశిస్తున్నామని, వరంగల్ పరిసర ప్రాంతాల్లో పార్టీ ఇప్పటివరకు నిర్వహించిన ప్రతీ సభ అద్భుతమైన విజయం సాధించిందని, ఎల్కతుర్తి సభ కూడా అంచనాలకు మించి విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తంచేశారు.
బహిరంగ సభ ముగిసిన తర్వాత మే నెల తొలి వారంలోనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడతామని కేటీఆర్ తెలిపారు. ఈసారి గతానికి భిన్నంగా డిజిటల్ రూపంలో సభ్యత్వ నమోదు ఉంటుందని వెల్లడించారు. గతంలో సభ్యత్వ పుస్తకాలు అచ్చు వేయించేవారమని, ఈసారి యాప్ తీసుకొస్తున్నామని, డిజిటల్ మాధ్యమంలో సభ్యత్వ నమోదు ఉంటుందని వివరించారు. సభ్యత్వ నమోదు అనంతరం పార్టీ నిర్మాణంపై దృష్టి సారిస్తామని, విద్యార్థి విభాగం, గ్రామ, వివిధ స్థాయి కమిటీల నిర్మాణం పూర్తిచేస్తామని పేర్కొన్నారు.
ఈ ఏడాది అక్టోబర్‌లో పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటామని చెప్పారు. మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. 32 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉన్నాయని తెలిపారు. కమిటీల ఎన్నిక ప్రక్రియను పూర్తిచేసిన తరువాత జిల్లాలవారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేవారికి (రిసోర్స్ పర్సన్స్) తొలుత హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో శిక్షణ ఇస్తామని తెలిపారు.