KTR | హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే కాకుండా అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వర్గీకరణ ఉద్యమానికి అడుగడుగునా అండగా నిలిచిందని గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణపై మంగళవారం కేసీఆర్ శాసనసభలో మాట్లాడుతూ.. ‘మలిదశ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ మొదటినుంచి, అంటే 2001నుంచి వర్గీకరణకు స్పష్టంగా మద్దతు ఇస్తున్నది.
అస్తిత్వ ఉద్యమానికి నాయకుడిగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకున్న నాయకుడిగా, కేసీఆర్‌తోపాటు ఆనాడు మరో అస్తిత్వ ఉద్యమానికి నాయకుడిగా ఉన్న కృష్ణమాదిగను, ఉద్యమంలో అసువులు బాసిన అమరులను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. వర్గీకరణ కోసం ఉద్యమించిన ఎంఆర్పీఎస్, టీఎంఆర్పీఎస్, ప్రజాసంఘాలు, సంస్థలు, వ్యక్తులు చేసిన ప్రతి పోరాటానికి కేసీఆర్ అండగా నిలిచారు’ అని కేటీఆర్ చెప్పారు.
‘2014లో రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రిగా కేసీఆర్ వర్గీకరణకు అవసరమైన చర్యలు చేపట్టారు. అయినా వర్గీకరణను మేము అడ్డుకున్నట్టు చెప్పే ప్రయత్నం కొందరు కాంగ్రెస్ సభ్యులు చేశారు. 2014, నవంబర్ 29 న, అంటే కేసీఆర్ నిరాహారదీక్షకు కూర్చొని సరిగ్గా ఐదేండ్లు గడిచిన సందర్భంగా నిర్వహించిన దీక్షాదివస్‌ను పురస్కరించుకొని శాసనసభలో కేసీఆర్ వర్గీకరణ తీర్మానాన్ని ప్రతిపాదించారు. జనాభా ఆధారంగా అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసైనా వర్గీకరణకు నడుం బిగించాలని తీర్మానం చేశారు. అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి ప్రధానికి నేరుగా తీర్మానం కాపీని అందించిన ఘనత కేసీఆర్‌ది. బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా సామాజిక స్వేచ్ఛ అనేది లేకపోతే చట్టం ద్వారా సంక్రమించిన ఏ హక్కైనా వ్యర్థం, నిరర్ధకం.
అంబేద్కర్ చెప్పిన విధంగా బోధించు, సమీకరించు, పోరాడు అనే తత్వాన్ని జీర్ణించుకొని పోరాడిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ వర్గీకరణ ఉద్యమంలో ఉన్న నిజాయితీని అర్థంచేసుకొని ప్రతిపక్షంలో ఉన్నా, అధికారపక్షంలో ఉన్నా మొదటినుంచి మద్దతిచ్చింది. ఎంఆర్పీఎస్ పోరాటంలో అమరులైన వారికి ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. వర్గీకరణ కోసం సుప్రీంకోర్టులో పదేండ్లపాటు సీనియర్ మోస్ట్ కౌన్సిల్స్‌ను నియమించి గట్టిగా వాదించాం’ అని కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో హామీ ఇచ్చినట్టు అంబేద్కర్ అభయహస్త పథకాన్ని ఎప్పుడు అమలుచేస్తారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘మీరు అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు అంబేద్కర్ అభయహస్తం కింద రూ. 12లక్షల ఆర్థిక సహాయం చేస్తామన్నారు. వర్గీకరణ సిఫారసులను అమలుచేయడంతోపాటు అంబేద్కర్ అభయహస్తం పథకానికి కూడా వచ్చే బడ్జెట్లో తగిన నిధులు ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో ఆర్థిక వెనుకబటుపై కూడా చెప్పారు. ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్లో, కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18శాతం, ఎస్టీలకు 12శాతం ఇస్తామని చెప్పారు. కాస్ట్ విత్ క్యాపిటల్ అన్నప్పుడు ఈ వెసులుబాటు కల్పించాలి. ఇది ఎప్పటినుంచి అమలుచేస్తారో చెప్పాలి. సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు ఖర్గే చేతులమీదుగా ప్రవేశపెట్టిన ఈ డిక్లరేషన్ ఎప్పుడు అమలుచేస్తారో చెప్పాలి. దళితులు వర్గీకరణను స్వాగతిస్తున్నాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.