కేసీఆర్ కట్టె లేకుండా నిలబడుతరు.. నువ్వు కమీషన్ లేకుండా పాలించు. కేసీఆర్ కొడితే ఎట్లుంటదో ఆ దెబ్బ తిన్నోళ్లను అడుగు. మీ పాత గురువును అడుగు. ప్రస్తుత బాస్ తల్లిని అడుగు. కేసీఆర్ పేరును నువ్వు కాదు కదా.. కాంగ్రెస్ జేజమ్మలు దిగివచ్చినా మరిపించలేరు. తెలంగాణ ఉన్నంతకాలం రాష్ర్టాన్ని ఎవరు తెచ్చిండ్రంటే కేసీఆర్ పేరే చెప్తరు.
– కేటీఆర్
KTR | వికారాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): కేసీఆర్ అంటే ఒక హిస్టరీ అని, లాటరీలో రేవంత్ సీఎం అయ్యాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ‘71 ఏండ్లున్న పెద్ద మనిషి కేసీఆర్‌ను పట్టుకొని కట్టెలేకుండా సక్కగ నిలబడు అని సంస్కారం లేకుండా రేవంత్‌రెడ్డి అంటుండు.. నీకు సంస్కారం లేకపోవచ్చు గాని ఒక్కటి గుర్తుపెట్టుకో! కేసీఆర్ నిలబడుడు కాదు.. నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిండు.. తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేసి దేశంలోనే సమున్నత స్థానంలో నిలబెట్టింది కేసీఆర్’ అని తేల్చిచెప్పారు. శనివారం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని సోమన్గుర్తి, బొంపల్లి, బాసుపల్లిలో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన అనంతరం కుల్కచర్ల మండలం దాస్యనాయక్ తండాలో సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి కేటీఆర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కేసీఆర్ కొడితే ఎలా ఉంటుందో దెబ్బ తిన్నోళ్లను అడుగు.. ఎట్లా ఢిల్లీ మెడలు వంచి తెలంగాణను తెచ్చిండో అడుగు తెలుస్తది’ అని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఏది చేసినా ప్రజలు గుర్తుంచుకొనేలా చేశారని, ప్రజల కష్టాలు తెలిసిన కొప్ప మేధావి కేసీఆర్ అని, రాష్ర్టాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసింది కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. అడ్డిమార్ గుడ్డిదెబ్బలో.. లాటరీలో అధికారం పొందిన రేవంత్‌రెడ్డికి కేసీఆర్‌తో అసలు పోలికే లేదని తేల్చిచెప్పారు. ‘తప్పిదారి ముఖ్యమంత్రి అయిన రేవంత్‌రెడ్డి ఆగుతలేడు.. నీకంటే ముందు చాలామంది ముఖ్యమంత్రులుగా పనిచేసిండ్రు గుర్తుపెట్టుకో’ అని హెచ్చరించారు.
రేవంత్‌రెడ్డీ.. తిట్ల పురాణం బంద్జెయ్యి. ఏడాది దాటింది. హనీమూన్ పీరియడ్ అయిపోయింది. రేవంత్‌రెడ్డి సీఎం అయితే ఇంకేమైనా చేస్తడేమోనని ప్రజలనుకున్నరు. అది కూడా ఒడిసిపోయింది. ఇగ నీకు సినిమా చూపిస్తం.
-కేటీఆర్
‘కేసీఆర్ పేరును నువ్వు కాదు గదా కాంగ్రెస్ జేజమ్మలు దిగివచ్చినా చెరపలేరు.. తెలంగాణ ఉన్నంత కాలం.. తెలంగాణను ఎవరు తెచ్చిండ్రంటే కేసీఆరే తెచ్చిండ్రని అందరూ చెప్తరు. కేసీఆర్‌ను, బీఆర్ఎస్ను కనుమరుగు చేయాలని రేవంత్‌రెడ్డి కంటున్న కలలు ఎన్నిటికీ నెరవేరవు. కేసీఆర్ మార్క్‌ను ఎవరూ మార్చలేరు’ అని కేటీఆర్ స్పష్టంచేశారు. ‘రాష్ట్రం సాధించిన తర్వాత పదేండ్లు కేసీఆర్‌కు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు. ప్రజలను సంటి పిల్లల్లా కాపాడుకుంటూ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అత్యాద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు’ అని గుర్తుచేశారు. గిరిజనుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా తండాలను పంచాయతీలుగా మార్చారని, పరిగి నియోజకవర్గంలో 52 తండాలు గ్రామ పంచాయతీలుగా మారాయని తెలిపారు. రాష్ట్రంలో 3200 పైగా తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారని, మండలాలను వర్గీకరించారని గుర్తుచేశారు.
‘కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తయింది. రేవంత్‌రెడ్డికి హానీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇక ముందు సినిమా ఉంటది’ అని కేటీఆర్ హెచ్చరించారు. నాడు రైతుల కష్టాలను గుర్తించిన కేసీఆర్ ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయిన రైతులకు రైతుబంధు కింద రూ.72 వేల కోట్లను వారి ఖాతాల్లో జమచేశారని, రైతుబీమాను తెచ్చి రైతు కుటుంబాలకు బాసటగా నిలిచారని చెప్పారు. రూ.72 వేల కోట్ల రైతుబంధు సాయాన్ని, రూ.28 వేల కోట్ల రుణమాఫీని రెండు దఫాలుగా పూర్తి చేశారని గుర్తుచేశారు. నాడు నాట్లు వేసే సమయానికి టింగు టింగు మని రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయని, ఇప్పుడు రేవంత్‌రెడ్డి జనవరి 26న హాలీడే ఉన్నందున మరుసటి రోజున టకీటకీమని డబ్బులు పడుతాయన్నాడని, కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం రేవంత్ అటవాటు చేసుకున్నారని, అయన టింగుటింగు అంటే రేవంత్ టకీటకీ అంటున్నాడని ఎద్దేవా చేశారు. ‘ఎవ్వరి ఖాతాల్లోనూ డబ్బులు జమకాలేదు. తులం బంగారం ఇస్తున్నరా? రూ.2500 వస్తున్నయా? స్కూటీలు ఇస్తున్నారా? స్కాలర్ షిఫ్‌లు పడుతున్నయా? చివరికి సఫాయి కార్మికులకు జీతాలైనా పడుతున్నయా?’ అని నిలదీశారు. ‘బీసీ డిక్లరేషన్‌కు రూ.20 వేల కోట్లు అన్నడు. రూ.లక్ష కోట్లు అన్నడు.. ఇవన్నీ మరిచి ఇప్పుడు టకీటకీ అని కొత్త కథలు చెప్తున్నడు’ అని ఎద్దేశాచేశారు.
‘రాష్ట్రంలో ఏ ఒక్క ఊర్లోనైనా వంద శాతం రుణమాఫీ జరిగిందంటే నేను ఎమ్మెల్యే పదవికే రాజీమామా చేయడం కాదు, రాజకీయ సన్యాసం తీసుకొనిపోతా’నని రేవంత్‌కు కేటీఆర్ సవాల్ విసిరారు. ఇచ్చిన హామీలో చారాణా కూడా మాఫీ కాలేదని విమర్శించారు. రైతులను రేవంత్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని, మహిళలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పి మొండిచెయ్యి చూపిందని మండిపడ్డారు. ‘కేసీఆర్ రూ.28 వేల కోట్ల రుణమాఫీ చేశారని అసెంబ్లీలో చెప్పిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు రూ.11 వేల కోట్లే చేసిండని పచ్చి అబద్ధాలు చెప్తున్నడు. ఆయన పేరు ఎనుముల రేవంత్‌రెడ్డి కాదు.. అబద్ధాల రేవంత్‌రెడ్డి’ అని విమర్శించారు. ‘ఎకరాకు ఏడాదికి రూ.15 వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పుడు రూ.12 వేలే అంటున్నడు. అవికూడా ఎప్పుడిస్తరో తెల్వదు. ఇప్పుడు మార్చి 31 అంటుండు.
ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు పైసా కూడా ఇవ్వలేదు. ఎన్నికల ముందు రైతుబంధు వేసేందుకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రూ.7600 కోట్లు కేటాయించి పెడితే ఇదే రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసి ఆపించిండ్రు. అదే రైతుబంధు డబ్బులను వారు 6 నెలలు సతాయించి పార్లమెంట్ ఎన్నికల సమయంలో వేసిండ్రు. ఆ తర్వాత రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదు. వానకాలం రైతుబంధు ఎగ్గొట్టిండు. ఇప్పుడు యాసంగి రైతుబంధు గురించి డ్రామాలు చేస్తుండు. రైతులకు సీఎం ఎకరానికి రూ.17,500 చొప్పున బాకీ పడ్డడు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతుబంధు పేరిట డ్రామా ఆడుతున్నరు. ఎన్నికల తర్వాత ప్రజాపాలనను మర్చిపోతారు’ అని మండిపడ్డారు.
సీఎం సిగ్గులేకుండా 2 లక్షల రుణమాఫీ చేసిన అంటుండు. రేవంత్‌రెడ్డీ.. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా.. నీ సొంతూరు కొండారెడ్డిపల్లికి పోదామా..? పరిగి ఎమ్మెల్యే సొంతూరు శివారెడ్డిపల్లికి పోదామా? దాస్యనాయక్ తండాకు వస్తవా? లేక కొడంగల్‌కు వస్తవా? ఎక్కడికైనా సరే.. రాష్ట్రంలో ఏ ఒక్క ఊరిలో అయినా వంద శాతం రుణమాఫీ జరిగిందంటే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాదు, రాజకీయ సన్యాసం తీసుకొని వెళ్లిపోతా..
-కేటీఆర్
‘కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని రేవంత్ అంటున్నడు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చుడు కాదు.. దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా నువ్వు లగచర్లకు ఒక్కడివే రా.. నువ్వు వస్తవో? రావో? నాకు తెల్వదు కానీ నేను మాత్రం కొడంగల్‌కు వస్తా.. నీకు దమ్ముంటే ఆపుకో’ అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. కొడంగల్‌కు బాజాప్తా పోతం.. నీ సంగతేందో చూస్తం. నువ్వు సిరిసిల్లకు నాలుగు సార్లు వచ్చినవ్.. మహేశ్వరం వచ్చినవ్.. రాష్ట్రమంతా తిరిగినవ్. మమ్ములను తిట్టినవ్. నీకు సెక్యూరిటీ కూడా ఇచ్చినం. ఇవ్వాళ మేం తిరగాలంటే అనుమతులు అంటున్నవ్. ఇది నీ చేతగాని పాలనకు నిదర్శనం’ అని దుయ్యబట్టారు. కొడంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, అక్కడ నరేందర్‌రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారని చెప్పారు.
లగచర్ల ఘటనలో 45 రోజులు జైలుకు వెళ్లి వచ్చిన సురేశ్, గోపాల్‌లాంటి వారు చాలా మంది గిరిజన బిడ్డలు ఉన్నారని, హీర్యానాయక్‌కు జైలులో గుండెనొప్పి వస్తే బేడీలు వేసి దవాఖానకు తీసుకెళ్లారని, రేవంత్‌కు రానున్న రోజుల్లో చుక్కలు చూపించాలని రైతులకు పిలుపునిచ్చారు. అంబేద్కర్ తన రాజ్యాంగం ద్వారా మాట్లాడే, కొట్లాడే, ప్రజాప్రతినిధులను నిలదీసే స్వేచ్ఛ ఇచ్చారని, ఎన్నికల్లో హామీలిచ్చి మరిస్తే కచ్చితంగా నిలదీయొచ్చని, అదే స్వేచ్ఛతో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ప్రజలకు సూచించారు. తమ సమస్యలను తీర్చకపోతే ప్రభుత్వంపై తిరగబడాలని పిలుపునిచ్చారు. ‘లగచర్ల రైతులను కలుస్తామంటే పర్మిషన్ ఇవ్వడు.. రైతుల కోసం నల్లగొండలో ధర్నా చేస్తామంటే పర్మిషన్ ఇవ్వడు.. ఆఖరికి దాస్యనాయక్ తండాలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు’ అని గుర్తుచేశారు.
అంబేద్కర్ అందరి వాడని, బోధించు, సాధించు, సమీకరించు, పోరాడు అనే నినాదాన్ని నాడు అంబేద్కర్ రాజ్యాంగంలో చూపిస్తే దాన్ని ఆచరణలో పెట్టిన మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్ అని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని వారిని సమీకరిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని చెప్పారు. రాజ్యాంగమే లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదని తెలిపారు. ప్రపంచ మేధావుల్లో బీఆర్ అంబేద్కర్ ఒకరని పలు సంస్థలు గుర్తించాయని, మన దేశంలో మాత్రం కొందరు ఆయనను కేవలం దళితులకే పరిమితం చేశారని చెప్పారు.
దాస్యనాయక్ తండాలో సేవాలాల్ సేన ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన అజయ్‌నాయక్, శంకర్‌నాయక్‌ను కేటీఆర్ అభినందించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పట్నం నరేందర్‌రెడ్డి, కొప్పుల మహేశ్‌రెడ్డి, పైలట్ రోహిత్‌రెడ్డి, బాల్క సుమన్, సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు సంజీవ్ నాయక్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ రజనీ సాయిచంద్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ పాల్గొన్నారు.