KTR | హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): నామినేటెడ్ ఎమ్మెల్సీల విషయంలో గవర్నర్ తీవ్రమైన పక్షపాతంతో నిర్ణయం తీసుకొన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఇద్దరి విషయంలో రాజకీయ సంబంధాలు ఉన్నాయని తిరస్కరించిన గవర్నర్, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న కోదండరాంను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎలా నియమించారో చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్ తీరును ప్రజలు గమనిస్తున్నారని, వారికి సమాధానం చెప్పే తీరాలని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఫెవికాల్ బంధంలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ భవన్లో శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీ య పతాకాన్ని కేటీఆర్ ఆవిషరించారు. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా కొట్లాడిన దాసోజు శ్రవణ్, ఎరుకల సామాజికవర్గానికి చెందిన సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా గత క్యాబినెట్ నామినేట్ చేస్తే, వారికి రాజకీయ సంబంధాలున్నాయని చెప్పి గవర్నర్ తిరసరించారు. ఈ రోజు వస్తున్న వార్తల ప్రకారం ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న కోదండరాం, మరొకరిని ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ లేఖ రాగానే ఆగమేఘాల మీద ఆమోదించారు. శ్రవణ్, సత్యనారాయణకు రాజకీయ నేపథ్యం అడ్డంకి అయితే రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి, ఎన్నికల్లో పోటీ చేసిన కోదండరాంను ఏ రకంగా ఆమోదించారో ప్రజలకు గవర్నర్ సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రజలిచ్చే జీతంతో గవర్నర్ పనిచేస్తున్నారు. రాజ్‌భవన్ కూడా ప్రజల డబ్బుతోనే నడుస్తున్నదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. గవర్నర్ సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కరికే బాధ్యులు కాదు. రాష్ట్ర ప్రజలకీ బాధ్యులు అనే విషయం తెలుసుకోవాలి. ఆనాడు కనిపించిన రాజకీయ నేపథ్యం, ఈ రోజు ఎందుకు కనిపించడం లేదు? కాంగ్రెస్- బీజేపీ ఫెవికాల్ బంధం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారా? ఈ పరిణామం కాంగ్రెస్, బీజేపీ కుమ్మకు రాజకీయాలను తెలియజేస్తున్నది’ అని ఆరోపించారు.
మంచి పదవిలో మంచి ముహుర్తాన సీట్లో కూర్చోబెట్టినంత మాత్రాన నీచ మానవులు బుద్ధి మార్చుకోరని, సీఎం రేవంత్‌రెడ్డి ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. అదే అహంకారం, వెకిలితనం చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మేము ఇంకా అధికారపక్షమని, కాంగ్రెస్ ఇంకా ప్రతిపక్షంలో ఉన్నదని సీఎం అనుకొంటున్నారు. కాంగ్రెస్‌కు చేతనైతే ఇచ్చిన 420 హామీలను అమలుపర్చాలి. ఆరు గ్యారెంటీలను అమలుచేయాలి. రాజకీయాల్లో ఇలాంటి కుసంసారులు ఉన్నప్పుడు ఇలాంటి విమర్శలు తప్పవు. కాంగ్రెస్ హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నాల్లో భాగంగానే ఈ విధంగా చేస్తున్నారు. ఎన్ని చేసినా కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా వెంటాడుతాం’ అని స్పష్టంచేశారు.
ప్రజాపాలన ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులు చేయాలి కానీ, ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు కాదని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో సర్పంచ్ల పదవీకాలం ముగుస్తున్నందున తిరిగి ఎన్నికలు జరిగేవరకు వారినే సర్పంచ్‌లుగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో సర్పంచ్‌లు రెండేండ్లు పనిచేయలేకపోయారని, కాబట్టి వారి పదవీకాలాన్ని తిరిగి ఎన్నికలు నిర్వహించేవరకు పొడిగించాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత సర్పంచ్ల పదవీకాలం ముగియగానే వెంటనే ఎన్నికలు నిర్వహించిందని గుర్తు చేశారు. ప్రస్తుత సర్పంచ్ల హయాంలో నిర్మించిన భవనాల ప్రారంభోత్సవాలను కుంటిసాకులతో ప్రభుత్వం అడ్డుకొంటున్నదని ఆరోపించారు. ఆ భవనాలను వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జాతీయ జెండా ఎగురవేసిన తరువాత మాజీ మంత్రి మహముద్ అలీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కండ్లు తిరిగి కింద పడిపోతుండగా పార్టీ నాయకులు ఆయనను పట్టుకొని ప్రాథమిక చికిత్స అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నాగం జనార్ధన్ రెడ్డి, పోన్నాల లక్ష్మయ్య, మాజీ స్పీకర్ మధుసూదనచారి, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, దానం నాగేందర్, కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పాడి కౌశిక్‌రెడ్డి, కడియం శ్రీహరి ఎమ్మెల్సీ పదవులకు ఒకేసారి రాజీనామా చేస్తే ఒకే బ్యాలెట్ పేపర్‌పై ఒకేసారి ఎన్నిక జరగాల్సి ఉండగా, రెండు వేర్వేరు ఎన్నికలు ఎలా నిర్వహించారని కేటీఆర్ ప్రశ్నించారు. అలా చేసినందువల్లనే రెండు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌కు దక్కాయని ఆరోపించారు. వాస్తవంగా అందులో ఒకటి బీఆర్ఎస్కు రావాల్సి ఉండెనని తెలిపారు. రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీని కలవగానే ఎమ్మెల్సీలకు వేర్వేరుగా ఎన్నికలు జరిగాయని గుర్తుచేశారు. ఇదంతా బీఆర్ఎస్ను ఖతం చేయాలని బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. కాంగ్రెస్‌కు జాకీలు పెట్టి నిలిపే ప్రయత్నం జరుగుతున్నదని, దానికి బీజేపీ మద్దతుగా నిలుస్తున్నదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ – బీజేపీది ఫెవికాల్ బంధమని ప్రజలకు తెలుసని, బీజేపీ నేత బండి సంజయ్ కూడా ఇటీవల కాంగ్రెస్, బీజేపీ కొట్లాడుకోవద్దు, బీఆర్ఎస్ అంతం చూద్దామని పిలుపునిచ్చారని గుర్తుచేశారు. గుంపు మేస్త్రీ కూడా ఇదే మాట చెప్పారని అన్నారు.