KTR | సీఎం రేవంత్‌రెడ్డికి రేషం లేదని.. ప్రజలు తిట్లు వింటే పౌరుషం ఉన్న ఎవరైనా బకెట్ నీళ్లలో దూకి చచ్చేవాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. తెలంగాణ భవన్లో ఖమ్మం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఖమ్మం వరదల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఓపెన్ టాప్ జీపులో చేతులు ఊపుతూ కాలు కింద పెట్టకుండా అటు ఇటు తిరిగి వెళ్లిపోయాడన్నారు. ప్రజలు తిడుతున్న తిట్లను వింటే పౌరుషం ఉన్న ఎవడైనా బకెట్ నీళ్లలో దూకి చచ్చేవాడని.. రేవంత్ రెడ్డికి రేషం లేదని.. కాబట్టి అన్ని దులుపుకొని తిరుగుతున్నాడని సెటైర్లు వేశారు.
తమ స్కూటీ ఏమైందని కాలేజీ పిల్లలు కూడా పోస్ట్ కార్డు ఉద్యమం మొదలు పెట్టారని.. కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో మోసపోయామని అనుకోని వర్గం ఏది ఈ రాష్ట్రంలో లేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోయేసరికి ఎంతో నష్టపోయామన్న భావనలో తెలంగాణలోని ప్రతి ఒక్కరూ ఉన్నారని తెలిపారు. సీఎం నియోజకవర్గంలోని పనులతో పాటు తెలంగాణలోని ప్రతి పని కాంట్రాక్టు కూడా ఇవాళ ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రికే దక్కుతుందన్నారు. కాంట్రాక్టు మంత్రి, ఆయన కమీషన్ల కోసమే ముఖ్యమంత్రి పని చేస్తున్నారని నిన్న కొడంగల్‌లో చెప్పానన్నారు. డిప్యూటీ సీఎం 30శాతం కమిషన్లు తీసుకొని పనులు చేస్తున్నారని సొంత పార్టీ ఎమ్మెల్యేనే చెప్తున్నారని.. వ్యవసాయ మంత్రి రుణమాఫీ కాలేదని చెప్తే.. సీఎం మాత్రం మొత్తం రుణ మాఫీ అయ్యిందన్నారు.. ఇలా మంత్రులకు.. సీఎంకు శ్రుతి లేదన్నారు. ఫలితంగా తెలంగాణ అధోగతి పాలైందన్నారు.
బీసీ సోదరులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని.. 42శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని, సబ్ ప్లాన్ అమలు చేస్తామని.. రూ.లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తామని బీసీ జనాభాను తగ్గించిందని ఆరోపించారు. కేసీఆర్ చేయించిన సమగ్ర కుటుంబ సర్వేలో జనాభా 51.5శాతం ఉంటే.. రేవంత్ కుల గణన సర్వేలో ఐదున్నర శాతం తగ్గించి 46శాతానికి బీసీ జనాభాను చూపించారన్నారు. తెలంగాణలోని ప్రతి వర్గాన్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే అవకాశం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉందన్నారు. సంవత్సర కాలంగా కేసులు పెట్టి వేధిస్తున్నా.. విచారణల పేరిట పిలిచి జైలులో పెడతామని బెదిరిస్తున్నప్పటికీ, ప్రజా సమస్యల మీద రేవంత్ రెడ్డితో కొట్లాడామన్నారు.
భవిష్యత్‌లో కొట్లాడుదామని.. కాంగ్రెస్ పార్టీ హనీమూన్ టైమ్ అయిపోయిందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కల్యాణలక్ష్మి చెక్కులు ఇస్తున్న ఓ మంత్రిని.. తులం బంగారం లేదని మహిళలు ప్రశ్నించారని తెలిపారు. కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టి ప్రజలు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు స్థానిక సంస్థల్లో ఏకగ్రీవానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుతంత్రాలను గులాబీ దండు అడ్డుకుంటుందని.. త్వరలోనే ఖమ్మం పర్యటనకు వస్తానని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు.