హైదరాబాద్ , జనవరి 26 (నమస్తేతెలంగాణ): రేవంత్‌రెడ్డి రాక్షస పాలన సాగిస్తూ యథేచ్ఛగా రాజ్యాంగ హక్కుల హననానికి పాల్పడుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అనుముల రాజ్యాంగాన్ని అమలుచేస్తూ బాబాసాహెబ్ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నాడని మండిపడ్డారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణభవన్‌లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు లఘు నాటిక ప్రదర్శించారు. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో తీసుకున్న రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టారు. కాంగ్రెస్ అధిష్ఠానం, ముఖ్యంగా రాహుల్‌గాంధీ అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని ఎత్తిచూపారు.
రేవంత్ ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న తీరును హెచ్‌సీయూ విద్యార్థులు నాటిక ద్వారా కండ్లకు కట్టేలా వివరించి మనందరికీ కనువిప్పు కలిగించారని కేటీఆర్ కొనియాడారు. తమ యూనివర్సిటీ భూములపై దౌర్జన్యం చేసిన కాంగ్రెస్ సర్కార్‌పై విద్యార్థులకు ఉన్న వ్యతిరేకతను ఈ ప్రదర్శన ద్వారా తెలియజేశారని వివరించారు. బాధ్యత కలిగిన హెచ్‌సీయూ విద్యార్థులు తమ విశ్వవిద్యాలయానికి చెందిన 400 ఎకరాల భూములను కాపాడుకొనేందుకు వీరోచిత పోరాటం చేశారని గుర్తుచేశారు.
పార్టీల సహకారం లేకున్నా ఉద్యమించి దేశాన్ని, చివరికి సుప్రీంకోర్టును కూడా కదిలించారని అభినందించారు. రియల్ ఎస్టేట్ కోసం విశ్వవిద్యాలయ భూములను చెరబెట్టేందుకు యత్నించిన రేవంత్‌రెడ్డిని నిలువరించారని స్పష్టంచేశారు. వారి పోరాటంతోనే సుప్రీంకోర్టు గ్రీన్ బెంచ్ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి పరిశీలన పూర్తిచేసిందని చెప్పారు. హెచ్‌సీయూ భూ కుంభకోణం విలువ రూ.10 వేల కోట్లుగా తేల్చిందని గుర్తుచేశారు. తనకు సంబంధంలేని భూములు, చెరువులను తాకట్టుపెట్టి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్‌కు పాల్పడ్డారని ఆ నివేదిక స్పష్టం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. హెచ్‌సీయూ భూముల విషయంలో రాహుల్ మౌనం వహించడంలో ఆంతర్యమేంటని నిలదీశారు.
రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్న రాహుల్‌గాంధీ ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎవరైనా ప్రజాప్రతినిధులు పార్టీ మారితే వెంటనే అనర్హులయ్యేలా చట్టం తెస్తామని తుక్కుగూడ సభ లో న్యాయ పత్రం విడుదల చేసిన రాహు ల్..తెలంగాణలో రేవంత్ సర్కార్ సాగిస్తున్న ఫిరాయింపు వ్యవహారంపై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించా రు. తుక్కుగూడ వేదికపై ఫిరాయింపు ఎమ్మెల్యేలను తన పక్కన కూర్చోబెట్టుకొని విడుదల చేసింది ముమ్మాటికీ అన్యాయపత్రమేనని తూర్పారబట్టారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రవచించిన ‘బోధించు..సమీకరించు..పోరాడు’ నినాదం స్ఫూర్తితోనే కేసీఆర్ తెలంగాణ సాధనకు నడుంబిగించారని కేటీఆర్ గుర్తుచేశారు. ‘సరిగ్గా 25 ఏండ్ల కిందట తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తిచాటి..నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలను సమీకరించి..14 ఏండ్లు అవిశ్రాంతంగా పోరాడి..రాజ్యాంగంలోని ఆర్టికల్ -3 ద్వారా ప్రత్యేక రాష్ర్టాన్ని ముద్డాడారు’ అని గుర్తుచేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాపాలన ముసుగులో ని యంతపాలన సాగిస్తున్నాడని కేటీఆర్ ఆగ్రహం వ్య క్తంచేశారు. అత్యున్నత పదవిలో ఉండి ప్రతిపక్ష పార్టీ జెండా గద్దెలను కూల్చివేయాలని బహిరంగ సభలో పిలుపునివ్వడం శోచనీయమని వాపోయారు. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన వ్యక్తే భక్షించేలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, అణగారిన వర్గాలపై దాడులు చేస్తూ రాజ్యాంగ విలువలను సమాధి చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ‘కోదాడలో దళిత యువకుడు కర్రా రాజేశ్‌ను పోలీస్ కస్టడీలో చిత్రహింసలు పెట్టి చంపారు.
ఈ ఘటన జరిగి 60 రోజులు దాటింది..ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, స్థానిక మంత్రి ఉత్తమ్‌కు మార్రెడ్డి మాత్రం నోరు మెదపడంలేదు’అని వాపోయారు. జర్నలిస్టులను టెర్రరిస్టుల్లా అరెస్ట్ చేయడం దుర్మార్గమని, ఇది రాజ్యాంగ విలువల హననం కాదా? అని ప్రశ్నించారు. ‘తమ భూములు అమ్మవద్దని తిరగబడ్డ గిరిజన బిడ్డల ఇండ్లలోకి పోలీసులు చొరబడి అనుచితంగా వ్యవహరించడం.. వ్యక్తిత్వ హననం చేయడం.. రైతులను జైల్లో పెట్టడం.. హైడ్రా, మూసీ పేరిట పేదల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చడం.. రేవంత్ రాక్షసపాలనకు నిదర్శనం’ అని నిప్పులుచెరిగారు.
బీఆర్ఎస్ నుంచి గెలిచిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య స్వార్థ ప్రయోజనాలు, డబ్బుల కోసం కాంగ్రెస్‌లో చేరి ఓట్లేసిన ప్రజలను మోసం లూచేశారని కేటీఆర్ మండిపడ్డారు. ఆయన కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడని చెప్పారు. కానీ ఆయన పక్క నియోజకవర్గానికి చెందిన స్పీకర్‌కు మాత్రం ఇది కనిపించకపోవడం విడ్డూరమని పేర్కొన్నారు. ‘యాదయ్యనేమో పార్టీ మారిన అంటుంటే..స్పీకర్ మాత్రం కండ్లకు గంతలు కట్టుకొని కాదు అంటున్నరు..ఆయన బీఆర్ఎస్లోనే సబితమ్మతోనే ఉన్నడు అంటున్నరు’ అంటూ విమర్శలు చేశారు. స్పీకర్ తీరును చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు.
అబద్ధాలు చెప్పే కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు మున్సిపల్ ఎన్నికలు ప్రజలకు మంచి అవకాశమని కేటీఆర్ చెప్పారు. రానున్న బల్దియా ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతల మాయమాటలను నమ్మి మోసపోతే తప్పు మనదే అవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. డబ్బులిస్తే తీసుకొని ఓటు మాత్రం కారుకే వేయాలని సూచించారు.
నాడు ఓట్ల కోసం అరచేతిలో వైకుంఠం చూపిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఓటేసిన ప్రజలకు నరకం చూపుతున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. రైతు, యువజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ డిక్లరేషన్ల పేరిట నమ్మబలికి నేడు తీరని ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రశ్నించే గొంతులను అణచివేస్తూ అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగులకు ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలిస్తామని నమ్మించి నట్టేట ముంచారని మండిపడ్డారు. నియంతృత్వ విధానాలతో ప్రజాస్వామిక విలువలను కాలరాస్తున్నారని విమర్శించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ రాజ్యాంగ రచన సందర్భంగా అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ‘రాజ్యాంగం ఎంత గొప్పదైనా, దాన్ని అమలుచేసే వారిలో చిత్తశుద్ధి లేకపోతే ప్రయోజనం శూన్యం’ అని స్పష్టంచేశారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు పోటీపడి రాజ్యాంగ విలువలను మంట గలుపుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. మతాల మధ్య చిచ్చుపెడుతున్న బీజేపీ ఓవైపు..రాజ్యాంగాన్ని పరిహసిస్తున్న కాంగ్రెస్ మరోవైపు దేశానికి పెనుముప్పుగా మారాయని ఆందోళన వ్యక్తంచేశారు. రెండు జాతీయ పార్టీల కబంధహస్తాల నుంచి రాష్ర్టాన్ని, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని పిలుపునిచ్చారు. ఇందుకోసం మరో పోరాటానికి సిద్ధంకావాలని ఉద్బోధించారు.