హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ): రియల్ఎస్టేట్ వ్యాపారం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు చేపడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. రుణమాఫీ, రైతుబంధుతోపాటు ఆరు గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు కానీ, మూసీ పునరుజ్జీవననానికి మాత్రమే డబ్బులు ఉన్నాయని ఎద్దేవా చేశారు. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, ఆ పేరుతో చేస్తున్న లూటిఫికేషన్‌ను అడ్డుకుంటామని స్పష్టంచేశారు. ఆదివారం ఆయన నాచారంలోని సీవరేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను బీఆరెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా హెచ్ఎంటీ నగర్లో మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ.. పదేండ్లపాటు ప్రణాళికాబద్ధంగా పనిచేసి హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దామని, వంద శాతం మూసీ నీటిని శుద్ధి చేసే దిశగా ప్రణాళికతో ముందుకు సాగామని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మూసీ మురికి నీరును శుద్ధి చేసే ప్రక్రియను వివరించారు.
బీర్ఎస్ హయాంలోనే మూసీ సుందరీకరణ
బీఆరెస్ హయాంలోనే మూసీ శుద్ధీకరణ, సుందరీకరణ, పునరుజ్జీవనం పథకాన్ని ప్ర ణాళికాబద్దంగా చేపట్టామని, ఇప్పుడు రేవంత్‌రెడ్డి కొత్తగా చేసేదేమీ లేదని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ప్రతిరోజూ 20 కోట్ల లీటర్ల మురికినీరు ఉత్పత్తి అవుతుందని, ప్రతి చుక్క మురికినీటిని శుద్ధిచేసే దిశగా సుమారు రూ.నాలుగువేల కోట్లతో ఎస్టీపీ ప్లాంట్లు ఏర్పాటుచేశామని వివరించారు. బీఆరెస్ కట్టి న ఎస్టీపీలతోనే మురికినీరు శుద్ధి అవుతున్నదని, ఎల్బీనగర్లో దేశంలోనే అతిపెద్ద ఎస్టీపీ ప్లాం ట్ను ఏర్పాటు చేశామని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరిగా తాము ఇండ్లు కూలగొట్టడం కాకుండా, మూసీకి వరద నీ రు వచ్చే నాలాలను ఆధునికీకరించడం, మురికినీటిని శుద్ధి చేయడం, నదిపై కొత్త బ్రిడ్జి ల నిర్మాణం, మూసీకి కొండపోచమ్మసాగర్ ద్వారా గోదావరి జలాలు తరలించడం వంటి నాలుగు అంశాలతో పక్కా ప్రణాళికతో ముందుకెళ్లామని వివరించారు. వీటన్నింటికీ కలిపి రూ.ఇరవై వేల కోట్లు కూడా ఖర్చు కాదని కానీ, రేవంత్‌రెడ్డి మాత్రం రూ.లక్షన్నరకోట్లు అవుతాయని చెప్పారని విమర్శించారు. ఇన్ని కోట్లెందుకు అని అడిగినందుకు తనపై కేసు పెట్టారని, ఢిల్లీకి మూటలు మోసేందుకే మూసీ మాటున డబ్బులు వెనకేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ను ఆగం కానియ్యమని, పేదలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పారు. మూసీ పేరుతో పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు పంపితే మీకంటే ముందు మేమే అడ్డుంటామని కేటీఆర్ చెప్పారు.
వరంగల్ వస్త్రనగరి కల సాకారం: కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): అలనాటి వరంగల్ వస్త్ర వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషి ఫలిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. నేతన్నల తలరాతలు మార్చేందుకు వరంగల్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌కు శంకుస్థాపన చేసి పట్టుదలతో పూర్తి చేసిందని, కిటెక్స్ కంపెనీ పెట్టుబడులను తీసుకొచ్చిందని వివరించారు. ఫైబర్ టూ ఫ్యాషన్ స్లోగన్‌తో వలసలు వాపస్ వచ్చేలా, ఉపాధి అవకాశాలు పుషలంగా లభించేలా వస్త్రనగరిని తీర్చిదిద్దడానికి చేయని ప్రయత్నాలు లేవని నాటి అనుభవాలను, అనుభూతులను ఆయన ఎక్స్‌వేదికగా గుర్తుచేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకున్నా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ముందడుగు వేసిన నేపథ్యాన్ని వివరించారు.