హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): గాంధీ దవాఖానలో కొనసాగుతున్న మాతా శిశు మరణాలపై బీఆర్ఎస్ తరఫున నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటుచేస్తామని ఆ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు. నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో గాంధీ దవాఖానలో జరుగుతున్న మరణాలపై అధ్యయనం చేసి, గుర్తించిన అంశాలను ప్రభుత్వంతోపాటు ప్రజలతోనూ పంచుకుంటామని చెప్పారు.
పార్టీ తరఫున చేసే ఈ ప్రయత్నంలో ప్రభుత్వం కలిసి రావాలని, ప్రజల ఆరోగ్యాలను బాగుపరిచేందుకు బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా తాము ఇచ్చే సలహాలు, సూచనలను స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. గాంధీ దవాఖానలో జరుగుతున్న మరణాలపై దృష్టి సారించాల్సింది పోయి ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన బీఆర్ఎస్పై ఎదురుదాడికి దిగడం బాధాకరమని పేర్కొన్నారు.
ప్రభుత్వం సమస్యను పరిష్కరించాల్సింది పోయి పకదారి పట్టించే కార్యక్రమానికి తెరలేపిందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా మరణాలపై సమీక్షించారా? నాణ్యమైన వైద్యం అందించేందుకు ఫోకస్ చేశారా? ఇటీవల చేపట్టిన బదిలీల్లో సీనియర్ డాక్టర్లను ట్రాన్స్ఫర్ చేశారనే ఆరోపణల్లో వాస్తవం ఉన్నదా? లేదా? అనే ప్రశ్నలకు బదులు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
తెల్లకోటు విప్లవం సాధ్యమయ్యేదా?
రాష్ట్ర ప్రభుత్వం గాంధీ దవాఖానలో ఉన్న అనుభవజ్ఞులైన డాక్టర్లను బదిలీ చేయడం వలన అకడ చికిత్సలకు తీవ్రమైన ఆటంకం ఏర్పడుతున్నదనే విషయాన్ని గుర్తించి, మరణాలను తగ్గించే ప్రయత్నం చేయాలని కేటీఆర్ సూచించారు. వైద్యం అందడం లేదని, పసిపిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారని అంటే బురదజల్లుతున్నామని మాట్లాడతారా? అని మండిపడ్డారు.
ప్రభుత్వం ఆరోపించినట్టు బీఆర్ఎస్ పార్టీ ప్రైవేటుకు కొమ్ముకాయాలనుకుంటే హైదరాబాద్ నగరం చుట్టూ పెద్ద దవాఖానల నిర్మాణాలు, వరంగల్‌లో అతిపెద్ద దవాఖాన నిర్మాణం, బస్తీ దవాఖానాలు, గ్రామాల్లో క్లినిక్‌లు చేపట్టే వాళ్లమా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కిట్లు, తల్లీబిడ్డను ఇంటి దగ్గర దిగబెట్టే వాహనాలు, సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవడం, రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రంలో 33 మెడికల్ కాలేజీల ఏర్పాట్లు సాధ్యమయ్యేవా? అని నిలదీశారు. కేసీఆర్ హయాం లో ప్రైవేట్‌కు కొమ్ముకాస్తే తెలంగాణ వైద్యుల ఉత్పత్తి కర్మాగారంగా, తెల్లకోటు విప్లవాన్ని సృష్టించేదా? అని ప్రశ్నించారు.
మానవీయంగా స్పందించండి
తమపై ఎదురుదాడి చేయడం మానేసి ముందుగా పాలనలో లోపాలను సరిదిద్దుకోవాలని ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు. పోయిన ప్రాణాలు తిరిగిరావని, ఆ తల్లుల కడుపుకోత తీర్చలేమనే సోయితో ఆలోచించి ప్రజలు కూడా మన బిడ్డలే అని మానవత్వంతో ఆలోచిస్తే కాంగ్రెస్ పాలన తీరు కూడా మారుతుందని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ దవాఖానలో జరుగుతున్న మరణాలు ఒక సంఖ్య గా మాత్రమే కనిపించడం దారుణమని, అది ఒక కుటుంబానికి సంబంధించిన శిశువు లేదా తల్లి మరణం అనే మానవీయ కోణంలో ఆలోచించాలని సూచించారు.