హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వ నిర్లిప్త వైఖరి రెండు వేల మంది తెలంగాణ యువత ఉపాధికి గండికొట్టిందని కేటీఆర్ మండిపడ్డారు. పరిశ్రమల స్థాపనకు బీఆర్ఎస్ సర్కారు పదేండ్ల శ్రమ బూడిదలో పోసిన పన్నీరైందని సోమవారం ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌కు ఢిల్లీకి మూటలు పంపడంపై ఉన్న శ్రద్ధ పరిశ్రమల స్థాపనపై లేకపోవడం దుర్మార్గమని, వరుసగా పరిశ్రమలు తరలిపోతు న్నా రేవంత్‌రెడ్డికి చీమకుట్టినట్టయినా లేద ని విమర్శించారు. తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంలా వాడుకోవడమే కాంగ్రెస్ ఏకైక ఎజెండా అని దుయ్యబట్టారు.
నాడు కర్ణాటకకు వెళ్లాల్సిన కేన్స్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో శ్రమించి, కంపెనీ ప్రతినిధులను ఒప్పించి తెలంగాణకు రప్పించింది. వారు కోరిన పది రోజుల్లోనే కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ పక్కనే భూములు కేటాయించినం. కేసీఆర్ పారదర్శక పాలన, చిత్తశుద్ధితో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన ఆ సంస్థ, ఇప్పుడు కాంగ్రెస్ అవినీతితో రాష్ర్టాన్ని విడిచివెళ్లిపోయింది.
– కేటీఆర్
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో పరిశ్రమ ల స్థాపన, ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేశామని కేటీఆర్ తెలిపారు. టీఎస్-ఐపాస్ లాంటి విప్లవాత్మక పారిశ్రామిక ప్రగతికి బాటలు వేశామని గుర్తుచేశారు. నాడు కర్ణాటకకు వెళ్లాల్సిన కేన్స్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు రప్పించిందని తెలిపారు. కేసీఆర్ పారదర్శక పాలన, చిత్తశుద్ధితో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చి న ఆ సంస్థ, ఇప్పుడు కాంగ్రెస్ అవినీతి కారణంగా రాష్ర్టాన్ని విడిచివెళ్లిపోయిందని వాపోయారు. ‘తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్, కేసీఆర్ పాత్రేమీలేదని.. తెలంగాణ ఆటో పైలట్ మోడ్‌లో ఉన్నద ని నాడు కారుకూతలు కూసిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఏం సమాధానం చెప్తరు? కేన్స్ వెళ్లిపోవడానికి కారణం ఎవరు?’ అని నిలదీశారు. పదేండ్లలో రాత్రింబవళ్లు శ్ర మించి ‘బ్రాండ్ హైదరాబాద్.. బ్రాండ్ తెలంగాణ’ నిర్మించిన ఇమేజ్ను 20 నెల ల కాంగ్రెస్ పాలన సర్వనాశనం చేసిందని దుమ్మెత్తిపోశారు. ‘కాంగ్రెస్‌కు కమీషన్లు దండు కోవడంపై ఉన్న శ్రద్ధ, పరిశ్రమలను నిలుపుకోవడంపై లేదు.. ఢిల్లీకి మూటలు పంపడంపై ఉన్న ధ్యాస, కొత్త పెట్టుబడులను ఆకర్షించడంపై లేదు’ అంటూ ధ్వజమెత్తారు.
రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఆటో డిస్ట్రక్షన్ మోడ్‌లోకి వెళ్లిపోయిందని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర ప్రగతిని పక్కనబెట్టి, పాలనను గాలికొదిలేసి విచ్చలవిడిగా తెలంగాణ సంపదను దోచుకోవడం, పదవి కాపాడుకొనేందుకు ఢిల్లీ పెద్దలకు మూటలు పంపడంలోనే నిమగ్నమయ్యారని ఫైర్ అయ్యారు.
తెలంగాణకు రావాల్సిన భారీ పరిశ్రమలు కాంగ్రెస్ సర్కారు అసమర్థత, నిర్లక్ష్యం, అవినీతి వల్లే పొరుగు రాష్ర్టాలకు పారిపోతున్నయి. రేవంత్ చేతగాని పాలనతోనే కేన్స్ సెమీ కండక్టర్ల ఇండస్ట్రీ రూ.2800 కోట్ల పెట్టుబడులు గుజరాత్‌కు తరలిపోయాయి.
– కేటీఆర్
పీడిత జనుల కోసం, బహుజనుల ఆత్మగౌరవం కోసం తన సర్వస్వాన్ని ధారబోసిన యోధుడు సర్వాయి పాపన్న అని, ధీరత్వానికి ఆయన ప్రతీక అని కేటీఆర్ అభివర్ణించారు. పాపన్న 375వ జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా నివాళులర్పించారు.