KTR | మెట్రో టేకోవర్‌పై అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి సిగ్గులేకుండా తప్పుడు లెక్కలు చెబుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. ఎల్అండ్టీ అనే ప్రైవేటు కంపెనీకి ఉన్న రూ.15 వేల కోట్ల అప్పును తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా రుద్దుతోందని అన్నారు.
మంత్రి అక్రమ మైనింగ్ కంపెనీపై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ క్రషర్స్‌పై చర్యలు తీసుకోవాలంటూ గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన తెలిపారు. ఈ నిరసనలో కేటీఆర్, హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గన్‌పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ప్రదర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 280 ఎకరాల ప్రభుత్వ భూమిని గత వైఎస్ఆర్ ప్రభుత్వం మెట్రోకు కేవలం లీజుకు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. ఎల్అండ్టీ వద్ద ఉన్న భూములు కొన్నామని రేవంత్ చెబుతున్నారని పేర్కొన్నారు. అవి ఎల్అండ్టీకి లీజుకు ఇచ్చిన భూములే.. తప్ప వారికి అమ్మలేదని తెలిపారు. ఆ భూములు ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. లీజుకు ఇచ్చిన భూములు కొనేశామని రేవంత్ గప్పాలు చెబుతున్నారని మండిపడ్డారు.
280 ఎకరాలు కాజేయాలని దండుపాళ్యం బ్యాచ్ చూస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. మెట్రో ఎల్అండ్టీ వద్ద ఉంటే కేంద్రం ఎందుకు అభ్యంతరం చెబుతుందని ప్రశ్నించారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం ఫండింగ్ ఎందుకు ఇచ్చిందని అడిగారు. దీనిపై ముఖ్యమంత్రి కాకమ్మ కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. మెట్రో ప్రాజెక్టుపై ప్రకటన కాంగ్రెస్ సర్కార్ తప్పుడు నిర్ణయమని కేటీఆర్ అన్నారు.
మెట్రో టేకోవర్‌పై అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సిగ్గులేకుండా తప్పుడు లెక్కలు చెబుతున్నారు.
ఎల్&టీ అనే ప్రైవేట్ కంపెనీకి ఉన్న రూ. 15 వేల కోట్ల అప్పును తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా రుద్దుతోంది.
వేల కోట్ల సంపదను దోచుకోవడానికి, ఎల్&టీ కంపెనీ సీఎఫ్ఓను జైలులో… pic.twitter.com/RxEOYLcnBt
— BRS Party (@BRSparty) March 29, 2026
వేల కోట్ల సంపదను దోచుకోవడానికి, ఎల్అండ్టీ కంపెనీ సీఎఫ్‌వోను జైలులో వేస్తామని బెదిరించారని కేటీఆర్ అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో తాను చెప్పిన మాట వినడం లేదని కాంగ్రెస్ గూండాలు బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారని విమర్శించారు. ఎల్అండ్టీ కంపెనీకి లీజుకిచ్చిన రూ.22 వేల కోట్ల విలువైన 280 ఎకరాల భూమిని కొట్టేయడానికి కాంగ్రెస్ దండుపాళ్యం బ్యాచ్ కుట్రకు తెరలేపిందని అన్నారు. ఈ భూ దందాకు, దండుపాళ్యం ముఠాకు సీఎం రేవంత్ రెడ్డి నాయకుడు అని ఆరోపించారు. మెట్రో టేకోవర్‌లో హైదరాబాద్ ప్రయోజనాలు, మెట్రో ప్రయోజనాలు లేవని తెలిపారు. కేవలం 22 వేల కోట్ల ఆస్తిని కొట్టేయాలనే కుట్ర మాత్రమే ఉందన్నారు. అది ఏనాటికైనా హైదరాబాద్, తెలంగాణ ప్రజల ఆస్తి అని ఆయన స్పష్టం చేశారు. దాన్ని తిరిగి మనమే కొనుక్కోవడం.. ఉల్టా మన భూమికి మనమే పైసల్ ఇచ్చి కొనుక్కోవడమని అని అన్నారు. మెట్రో టేకవర్లో చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో వెంటనే విచారణ జరిపించాలని కోరారు. ప్రభుత్వం వినకపోతే గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.