రేవంత్‌రెడ్డికి హైట్ ఒక్కటే తక్కువనుకున్న..బుర్ర కూడా తక్కువే.. గొప్ప నాయకుడైన కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలె. మీ రాహుల్‌గాంధీ 2014 నుంచి ఇప్పటి వరకు వరుసగా మూడు ఎన్నికల్లో ఒడిపోయిండు. కానీ కాంగ్రెస్ ఖతమై పోయిందా? అడుగో బొడుగో అక్కడో ఎక్కడో ఉంటది కదా? రాష్ట్రం తెచ్చిన పార్టీ.. పవర్ఫుల్ నాయకుడు ఒక్క ఎన్నికల్లో ఒడిపోగానే ఖతమై పోతరా?
– కేటీఆర్
హైదరాబాద్, జూలై 11 (నమస్తేతెలంగాణ) : ‘హరీశ్‌రావు కేసీఆర్ తయారు చేసిన నిఖాైర్సెన సైనికుడు..నిబద్ధత కలిగిన నాయకుడు..పార్టీ ఆవిర్భావానికి ముందునుంచీ కేసీఆర్ వెంట నడిచిన నేత..బీఆర్ఎస్కు రక్షణ కవచం’ అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. హరీశ్ పార్టీ మారుతున్నారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ‘పార్టీ మార్పు పుకార్లపై హరీశ్‌రావు వందల సార్లు సమాధానం చెప్పిన్రు.. ‘నాకు క్యారెక్టర్ ముఖ్యం.. నీలా కాదు రేవంత్‌రెడ్డీ.. నాలుగు పార్టీలు మారిన నీకు నన్ను అనే అర్హత ఎక్కడిది’ అని కూడా అన్నరు. ఇంకా ఆయనతో ఎన్నిసార్లు చెప్పిస్తరు?’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ దేశంలో శీల పరీక్షలు పెట్టాల్సి ఉంటే రేవంత్ రెడ్డికే పెట్టాలని స్పష్టంచేశారు. ‘ఆయన ఇప్పటికీ ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా పొద్దున కాంగ్రెస్ నేతలతో కలిసి ఉంటూ డ్రామాలు చేస్తరు.. రాత్రికాగానే బీజేపీ నేతల చెంతచేరి కేసులు మాఫీ చేయాలని వాళ్ల కాళ్లు పట్టుకుంటరు.. అలాంటాయనకు మా హరీశ్‌రావు, పార్టీ నేతల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది?’ అంటూ దెప్పిపొడిచారు. రేవంత్‌రెడ్డి పార్టీ మార్పుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే ఆయన ఆరోగ్యానికి అంత మంచిదని చురకలంటించారు.
ఈఎంఐ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఢిల్లీకి పైసలు ఎత్తిపోయడం తప్ప నీళ్లు ఎత్తిపోయడం తెలియదని కేటీఆర్ ఎద్దేవాచేశారు. డబ్బు సంచులు మోయడం తప్ప ధాన్యం సంచులు నింపడం చేతగాని వ్యక్తి మన ముఖ్యమంత్రిగా ఉండటం దౌర్భాగ్యమని పేర్కొన్నారు. తప్పకుండా రాష్ట్ర రైతాంగం తగిన సమయంలో రేవంత్‌రెడ్డికి కర్రుకాల్చి వాత పెడుతుందని హెచ్చరించారు. రాదనుకున్న రాష్ట్రాన్ని మొలిపించిన నాయకుడు కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. అలాంటి మహానేతను ఉద్దేశించి మొలకెత్తినయని మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంగుష్టమాత్రుడని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ‘ఆయనకు హైట్ ఒక్కటే తక్కువనుకున్నా..బుర్ర కూడా తక్కువే’ అని ఎద్దేవాచేశారు. గొప్ప నాయకుడైన కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. ‘మీ రాహుల్‌గాంధీ 2014 నుంచి ఇప్పటి వరకు వరుసగా మూడు ఎన్నికల్లో ఒడిపోయారు. కానీ కాంగ్రెస్ ఖతమై పోయిందా? అడుగో బొడుగో అక్కడో ఎక్కడో ఉంటది కదా?’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘రాష్ట్రం తెచ్చిన పార్టీ.. పవర్ఫుల్ నాయకుడు ఒక్క ఎన్నికల్లో ఓడిపోగానే ఖతమై పోతరా? అని ప్రశ్నించారు.
‘అన్ని అబద్ధాలు చెప్పి..తప్పుడు హామీలిచ్చి దొంగ ఓట్లతో గెలిచి, తెలంగాణపై తుపాకీ గురిపెట్టిన నీకే అంత ఉంటే, రాష్ట్రం తెచ్చిన పార్టీ నేతలమైన మాకు ఎంత ఉండాలి? నువ్వు అంతా సిపాయివే అయితే.. దమ్ముంటే మా పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు.. లేకుంటే పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వు.. ఇంకా మొనగాడివి అనుకుంటే అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు సిద్ధపడు’అంటూ సవాల్ విసిరారు. రేవంత్ చేయించుకున్న సర్వేలోనే కాంగ్రెస్ ఒడిపోతదని, బీఆర్ఎస్ 78 సీట్లతో గెలుస్తుందని తేలిందని చెప్పారు. తాను చెప్తున్నది వాస్తవం కాదనుకుంటే రేవంత్‌రెడ్డి దేవుళ్లపై ఒట్టు పెట్టి చెప్పాలని డిమాండ్ చేశారు. ‘తెలంగాణ సాధనలో యువకుల బలిదానాలకు కారణమైన, రాష్ట్రం ఇవ్వాలని అడిగిన వారిపై వికృత రాజకీయాలు చేసిన కాంగ్రెస్ ఖాతాలో మూడు వేల కోట్లు ఉన్నయ్.. రాహుల్‌గాంధీ ముక్కునేలకు రాసి పాప ప్రక్షాళన చేసుకున్నా అమరుల రుణం తీరదు’ అని వ్యాఖ్యానించారు. ‘వారు (కవిత) మా పార్టీ గురించి అనలేదు.. అన్నది కాంగ్రెస్ గురించే..ఆ పార్టీ నాయకులనే అడగాలి’ అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.