నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 5: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శనకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. యాదాద్రి జిల్లా భువనగిరి మొదలుకొని కన్నెపల్లి వరకు గులాబీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని వివేరా హోటల్లో అల్పాహారం స్వీకరించేందుకు ఆగిన కేటీఆర్‌కు బ్రహ్మరథం పట్టారు. మాజీ ఎమ్మెల్యేలు బూడిద భిక్షమయ్యగౌడ్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, నల్లమోతు భాస్కర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు సాదరంగా ఆహ్వానించారు. పూలమాలలు, శాలువాలు వేసి సన్మానించారు.
కేటీఆర్ వస్తున్నారనే విషయం తెలుసుకొని పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. హోటల్ ప్రాంగణమంతా గులాబీమయంగా మారింది. కాగా యాదగిరిగుట్ట మండలం బా హుపేట స్టేజీ వద్ద ఇమ్మడి ఫిల్టర్ కాఫీ సెంటర్ వద్ద ప్రభుత్వ మాజీ విప్, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి స్వాగతం పలికి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వచ్చిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కేటీఆర్ ముచ్చటించారు. వారికి ప్రత్యేకంగా అభివాదం చేశారు. ఫొటోలు దిగేందుకు పోటీపడిన పార్టీ శ్రేణులతో సరదాగా గడిపారు.
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రాజయ్య కేటీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కోమటిపల్లి వద్ద బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఘనస్వాగతం పలికి, శాలువా కప్పి సన్మానించారు. అక్కడి నుంచి ఆత్మకూరు గూడెప్పాడ్ జంక్షన్‌కు చేరుకున్న కేటీఆర్‌కు ఆత్మకూరు, దామెర మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
పరకాలలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్థానిక నేతలతో కలిసి స్వాగతించారు. అనంతరం అంబేద్కర్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌లోని రింగ్ రోడ్డు వద్ద మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు స్వాగతించారు. జయశంకర్ భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి కేటీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అడుగడుగునా ఘనస్వాగతం లభించింది.