హైదరాబాద్, నవంబర్ 26(నమస్తే తెలంగాణ) : ఈ నెల 29న దీక్షా దివస్‌ను బీఆర్ఎస్ ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్టీ జిల్లాల అధ్యక్షులు, ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు. ఈమేరకు సన్నాహక సమావేశాలు నిర్వహించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ నెల 28 సాయంత్రానికి పార్టీ కార్యాలయా లు, ఆవరణలను గులాబీ జెండాలు, ఫ్లెక్సీలు, విద్యుద్దీపాలతో అలంకరించాలని కోరారు. ఒక్కో జిల్లాలో వెయ్యికి తగ్గకుండా పార్టీ ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. 29న పేదలు, రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయాలని, అన్నదానం చేయాలని విజ్ఞప్తిచేశారు. రక్తదాన శిబిరాల నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని విన్నవించారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించి దీక్షాదివస్ సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.
తెలంగాణ భవన్లో గురువారం మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల నేతలు హాజరుకానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇందులో చర్చించి దీక్షాదివస్ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలను రూపకల్పన చేయనున్నారని పేర్కొన్నాయి.