గంభీరావుపేట, ఆగస్టు 17: పంటలకు సరిపోయేంత యూరియాను ప్రభుత్వం అందించే వరకు పోరాటం చేద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రైతులకు పిలుపునిచ్చారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలలో జరిగిన వివాహ వేడుకకు హాజరైన ఆయనను కలిసిన రైతులు తమ ఆవేదన వ్యక్తంచేశారు. ‘నాట్లు వేసి నెల దాటుతున్నది.. యూరియా చల్లక ఎట్ల పెట్టిన కర్రలు అట్లనే ఉన్నయి. గిట్ల యూరియా కోసం మళ్లీ లైన్లలో చెప్పులు పెట్టే పరిస్థితులు వస్తయని ఎన్నడూ అనుకోలే’ అని కేటీఆర్‌తో తమ బాధను పంచుకున్నారు. ‘ఒక్క బస్తా యూరియా కోసం చెప్పులు లైన్లో పెడితే చెప్పులు పోతున్నయ్ కానీ.. యూరియా దొరుకుతలేదు’ అని వాపోయారు. దీంతో కేటీఆర్ స్పందిస్తూ వేలాది రూపాయల పెట్టుబడితో వరి నాట్లు వేసి, యూరియా లేక పంటలను నష్టం చేసుకుంటమా? ప్రభుత్వం సరిపోయేంత యూరియా సరఫరా చేసే వరకు పోరాడుదాం’ అని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌కు ఓటేసినందుకు శిక్షిస్తున్నరు
ప్రభుత్వం గోస పుచ్చుకుంటున్నది. కాంగ్రెస్‌కు ఓటు వేసినందుకు రేవంత్‌రెడ్డి శిక్షిస్తున్నడు. ఇంకా మూడేండ్లు గిదే గోస అనుభవిస్తూ వనవాసం వెళ్లదీయాలె. 15 రోజుల తర్వాత బస్తాలు దొరికినా ఫాయిదా లేదు. ఎవుసంలో మన్ను పోస్తున్నరు.